ఇంకా కొండచరియలకిందే ప్రాణాలు.. | People in landslide prone areas may have to be shifted | Sakshi
Sakshi News home page

ఇంకా కొండచరియలకిందే ప్రాణాలు..

Published Fri, Aug 1 2014 12:43 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

ఇంకా కొండచరియలకిందే ప్రాణాలు.. - Sakshi

ఇంకా కొండచరియలకిందే ప్రాణాలు..

పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో కుండపోత వర్షాలకు కొండ చరియలు విరిగి మాలిన్ గ్రామంపై పడిన ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఇప్పటి వరకూ 41 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. వీరిలో 16 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. మూడు నెలల పసిపాప, ఆమె తల్లితో పాటు మరో 20 మందిని ప్రాణాలతో బయటకు తీయగలిగారు. ఇంకా శిథిలాల కింద 100 మందికిపైగా ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలు, ప్రతికూల వాతావరణం జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలకు అడ్డంకిగా మారాయి. భారీ వర్షాలు, పేరుకుపోయిన మట్టి, పెద్దపెద్ద బండ రాళ్ల కారణంగా శిథిలాల కింద ఉన్న వారు ప్రాణాలతో ఉండేది అనుమానంగా మారింది.

 

శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు, సమీప గ్రామాల ప్రజలు ముమ్మరంగా గాలిస్తున్నారు. జేసీబీలు, క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. మరోవైపు గ్రామం దాదాపు తుడిచిపెట్టుకుపోవడంతో మాలిన్ గ్రామస్తులు ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉన్నారు. సహాయ కార్యక్రమాలు జరుగుతున్న చోట తమ వారు బతికే ఉంటారనే ఆశతో వెతుకులాట కొనసాగిస్తున్నారు. మరోవైపు శిథిలాల నుంచి వెలికి తీసిన మృతదేహాలకు గురువారం సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు.
 ఇంకా శిథిలాల కింద 100 మందికిపైగా ఉండొచ్చని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ స్పష్టంచేశారు. ప్రమాదకరమైన చోట్ల నివసించే ప్రజలను వేరే ప్రాంతాకు తరలించాలని భావిస్తున్నట్టు చవాన్ చెప్పారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం మాలిన్ గ్రామాన్ని సందర్శించారు. ప్రస్తుత పరిస్థితిని, సహాయక చర్యల తీరును ఆయన పరిశీలించారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల ఆర్థిక సాయంగా ప్రకటించారు. ‘కేంద్రం తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైన సాయం అందించాల్సిందిగా ప్రధాని ఆదేశించారు’’ అని రాజ్‌నాథ్ చెప్పారు. ఆడవుల నరికివేత, నేల కోతకు గురికావడమే ఈ దుర్ఘటనకు కారణమా అని విలేకరులు ప్రశ్నించగా.. దీనికి కారణాలను ముందుగానే చెప్పడం తొందరపాటు అవుతుందని, దీనిపై జియోలాజికల్ సర్వే సిబ్బంది విచారణ జరుపుతారని చెప్పారు. సహాయక చర్యలు పూర్తి కావడానికి మరో రెండు రోజులు పడుతుందని, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement