Language scholars
-
భాషా పండితులు, పీఈటీలు.. ఇక స్కూల్ అసిస్టెంట్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీ) ఏళ్ల తరబడి సాగిస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. పదోన్నతులు, సమాన పనికి సమాన వేతనం కోసం ఎదురు చూసిన వేలాది మంది పండితులు, పీఈటీల కల నెరవేరింది. స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నతీకరణ అయిన భాషా పండితులు, పీఈటీ పోస్టుల్లోకి భాషా పండితులు, వ్యాయమ ఉపాధ్యాయులకు పదోన్నతులకు అవకాశం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ గతంలో ఉత్తర్వులు జారీచేయగా, వాటి అమలుపై జీవో నం.77 ఇచ్చారు. ఈ ఉత్తర్వులతో రాష్ట్రంలోని 12,827 మంది భాషా పండితులు, పీఈటీలలో అత్యధికులకు ప్రయోజనం చేకూరనుంది. 1983లో పోస్టుల అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు జారీ అయినప్పటినుంచి భాషా పండితులు, పీఈటీల పోరాటం కొనసాగుతూనే ఉంది. తమ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 17న 10,224 భాషా పండితులు, 2,603 పీఈటీల పోస్టులను ఉన్నతీకరిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో నం.91 విడుదల చేసింది. కానీ, సాకులు చెబుతూ ఆ జీవోను అమలు చేయలేదు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక వీరి సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎస్ఏలుగా ఉన్నతీకరణ అయిన పండిత, పీఈటీ పోస్టుల్లోకి భాషాపండితుల, పీఈటీలకు పదోన్నతులు కల్పించింది. అర్హతలుండే సెకండరీ గ్రేడ్ టీచర్లకు సైతం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చి, వారికి న్యాయం చేకూర్చింది. భాషా పండితులు, పీఈటీల కుటుంబాల్లో ఆనందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, భాషా పండితులు, పీఈటీల సమస్య తీవ్రతను వివరించగానే, వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. ఉన్నతీకరణ ఉత్తర్వులు విడుదల చేయడమే కాకుండా కౌన్సెలింగ్‌ను ఏర్పాటుచేసి భాషా పండితులు, పీఈటీ కుటుంబాల్లో ఆనందాన్ని నింపారన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, యస్.యల్.టి.ఎ. వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రాణత్యాగానికైనా సిద్ధం
హైదరాబాద్: భాషా పండితులు, పీఈటీల పదోన్నతుల సాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు(ఆర్‌యూపీపీ–టీ), వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ (పీఈటీఏ టీఎస్)ల రాష్ట్ర కమిటీ నాయకు లు అన్నారు. ఏ ఉద్యోగంలోనైనా ప్రమోషన్లు ఉన్నాయని, భాషా పండితులు, పీఈటీలు మాత్రం చేరిన కేడర్లోనే రిటైరవుతున్నారని వాపోయారు. భాషాపండితులు, పీఈటీల సమస్యపై స్పందించి పోస్టులను అప్‌గ్రెడేషన్ చేస్తూ జీవో 15పై సీఎం కేసీఆర్ సంతకం చేసినా దాని అమలులో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. భాషా పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, వ్యాయామవిద్య ఉపా ధ్యాయ సంఘాలు ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్షలు నిర్వహించాయి. దీక్షల్లో ఆర్‌యూపీపీటీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.డి. అబ్దుల్లా, గండమల్ల విశ్వరూపం, పీఈ టీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు డాక్టర్ ఎస్.సోమేశ్వర్రావు, బి.రాఘవరెడ్డిలతోపాటు తెలంగా ణలోని అన్నిజిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు కూర్చున్నారు. అన్నిజిల్లాల నుంచి పండిత ఉపాధ్యాయులు, పీఈటీలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీక్షలకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎ.నర్సిరెడ్డి, సరోత్తమ్‌రెడ్డి, చావ రవి (టీఎస్‌యూటీఎఫ్) భుజంగరావు(ఎస్టీయూ), రాఘవరెడ్డి (పీఈటీ అసోసియేషన్), రఘునందన్ (టీటీఎఫ్), పి.లక్ష్మయ్య(జూనియర్ కళాశాల పీఈటీ అసోసియేషన్) సంఘీభావం ప్రకటించారు. సీఎంకు పండిత టీచర్ల సమస్యలు పట్టవా? భాషా పండితుడైన సీఎం కేసీఆర్ భాషా పండితుల సమస్యలు పట్టించుకోకపోవడం శోచనీయమని ఆర్.కృష్ణయ్య అన్నారు. పండిత, పీఈటీ పోస్టుల్లో 25, 30 ఏళ్లుగా పనిచేస్తున్నా ప్రమోషన్లు లేకపోవడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ భాషా పండితులు, పీఈటీల సమస్యలపై మండలిలో నిలదీస్తామన్నారు. పదోన్నతులతో 12 వేలకుపైగా భాషాపండితులు, పీఈటీలు, లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. భాషా పండితుల నిరాహారదీక్షలను పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా దీక్షలు కొనసాగిస్తున్నా రంటూ పోలీసులు 8 మంది భాషాపండితులను బలవంతంగా అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం 5 తర్వాత కూడా దీక్షలను యధావిధిగా కొనసాగిస్తుండడంతో పోలీసులు టీచర్లను దీక్షలను ముగించాలని చెప్పినప్పటికీ రాత్రి ఏడుగంటల తర్వాత పోలీసులు వారిని అరెస్టు చేశారు. -
భాషా పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న భాషా పండితులు, పీఈటీ లను అప్‌గ్రేడ్ చేయటంపై సానుకూలంగా ఉన్నామని, ఇందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. ఎయిడెడ్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు, ఇతర సమస్యలకు సంబంధించిన ఫైలు చివరి దశలో ఉందని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే వారికి పదోన్నతులు, బదిలీల సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. గురువారమిక్కడ రవీంద్రభారతిలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, డీఎస్సీ 2012 ద్వారా వేల పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. డీఎస్సీ 2013 అంశాన్ని ప్రస్తావించిన మంత్రి దానిపై వివరణ ఇవ్వకుండానే దాటవేయటంతో నోటిఫికేషన్‌పై స్పష్టత రాలేదు. ఉపాధ్యాయులు ఉన్నత మన స్తత్వంతో కులతత్వం, మతతత్వం, అవినీతి రుగ్మతలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం గురువులను చూస్తే గౌరవం తగ్గిపోతోందని అది మంచిది కాదన్నారు. ఉపాధ్యాయ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తే వారి వ్యక్తిగత సమస్యలపైనే చర్చ వస్తోందని, ప్రభుత్వ స్కూళ్లను ఎలా బాగు చేయాలనే చర్చ రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తప్పయితే క్షమించాలని కోరారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రూ.21 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. టీచర్ల అప్రెంటిస్ రద్దు, అప్రెంటిస్ కాలానికి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 202 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నగదు బహుమతితో పాటు బంగారు పతకాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం కొరవడుతోందని, హాజరుశాతం తగ్గుతోంద ని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశరావు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారిలో పాఠశాల విద్యాశాఖ తరపున 57 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ కింద 38 మంది టీచర్లకు, ఇంటర్మీడియట్ విద్యా శాఖ నుంచి 23 మంది లెక్చరర్లు, ముగ్గురు సాంకేతిక విద్యాశాఖ లెక్చరర్లతోపాటు యూనివర్సిటీ, కళాశాల విద్యా శాఖ లెక్చరర్లు 77 మందికి, సాంస్కృతిక శాఖ నుంచి నలుగురుకి పురస్కారాలు లభించాయి.