సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న భాషా పండితులు, పీఈటీ లను అప్‌గ్రేడ్ చేయటంపై సానుకూలంగా ఉన్నామని, ఇందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. ఎయిడెడ్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు, ఇతర సమస్యలకు సంబంధించిన ఫైలు చివరి దశలో ఉందని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే వారికి పదోన్నతులు, బదిలీల సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. గురువారమిక్కడ రవీంద్రభారతిలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, డీఎస్సీ 2012 ద్వారా వేల పోస్టులను భర్తీ చేశామని చెప్పారు.
డీఎస్సీ 2013 అంశాన్ని ప్రస్తావించిన మంత్రి దానిపై వివరణ ఇవ్వకుండానే దాటవేయటంతో నోటిఫికేషన్‌పై స్పష్టత రాలేదు. ఉపాధ్యాయులు ఉన్నత మన స్తత్వంతో కులతత్వం, మతతత్వం, అవినీతి రుగ్మతలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం గురువులను చూస్తే గౌరవం తగ్గిపోతోందని అది మంచిది కాదన్నారు. ఉపాధ్యాయ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తే వారి వ్యక్తిగత సమస్యలపైనే చర్చ వస్తోందని, ప్రభుత్వ స్కూళ్లను ఎలా బాగు చేయాలనే చర్చ రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తప్పయితే క్షమించాలని కోరారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రూ.21 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. టీచర్ల అప్రెంటిస్ రద్దు, అప్రెంటిస్ కాలానికి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చామని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా 202 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నగదు బహుమతితో పాటు బంగారు పతకాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం కొరవడుతోందని, హాజరుశాతం తగ్గుతోంద ని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశరావు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారిలో పాఠశాల విద్యాశాఖ తరపున 57 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ కింద 38 మంది టీచర్లకు, ఇంటర్మీడియట్ విద్యా శాఖ నుంచి 23 మంది లెక్చరర్లు, ముగ్గురు సాంకేతిక విద్యాశాఖ లెక్చరర్లతోపాటు యూనివర్సిటీ, కళాశాల విద్యా శాఖ లెక్చరర్లు 77 మందికి, సాంస్కృతిక శాఖ నుంచి నలుగురుకి పురస్కారాలు లభించాయి.
భాషా పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్
Published Fri, Sep 6 2013 1:02 AM | Last Updated on Thu, Sep 19 2019 8:59 PM
Advertisement
Advertisement