న్యూఢిల్లీ: దేశీయంగా అల్ట్రా హై–స్పీడ్ టెలికం సర్వీసుల వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో 5జీ స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి నుంచి డిసెంబర్ ఆఖరులోగా 3.1 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు 5జీ ఫోన్లకు అప్‌గ్రేడ్ కానున్నారు. ప్రస్తుతం 5జీ హ్యాండ్‌సెట్ యూజర్ల సంఖ్య 8 నుంచి 10 కోట్ల మధ్యలో ఉంది. స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
వినూత్నమైన, వైవిధ్యమైన 5జీ కనెక్టివిటీ సేవల కోసం కాస్త ఎక్కువ చెల్లించేందుకు కూడా కస్టమర్లు సిద్ధంగానే ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అక్టోబర్‌లో దేశీయంగా 5జీ సేవలను ఆవిష్కరించారు. టెలికం సంస్థలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ గత కొద్ది నెలలుగా వీటిని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాయి. ఇటీవలి ఊక్లా నివేదిక ప్రకారం 5జీ సేవల ఆవిష్కరణతో భారత్‌లో మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో జపాన్, బ్రిటన్, బ్రెజిల్‌ను కూడా దాటేసి, 72 స్థానాలు ఎగబాకి భారత్ 47వ ర్యాంకుకు చేరుకుంది. 5జీని ప్రవేశపెట్టాక భారత్‌లో స్పీడ్ 3.59 రెట్లు పెరిగింది.
సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలు..
- మనకన్నా ముందు నుంచే 5జీ సేవలను వినియోగిస్తున్న అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, చైనాతో పోలిస్తే భారత్‌లో యూజర్లు సగటున వారానికి రెండు గంటలు ఎక్కువ సమయాన్ని 5జీ సర్వీసులపై వెచ్చిస్తున్నారు.
- 5జీని ముందుగా అందుబాటులోకి తెచ్చిన మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో 5జీపై సంతృప్తి స్థాయి అధికంగా ఉంది. 15 శాతం మంది వినియోగదారులు తమ 5జీ ప్లాన్లకు వీడియో ఆన్ డిమాండ్, గేమింగ్, మ్యూజిక్ వంటి అప్లికేషన్స్‌ను జోడించుకునేందుకు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ సర్వీసుల కోసం 14 శాతం ప్రీమియం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.
- నెలాఖరు వచ్చేసరికి 31 శాతం మంది 5జీ యూజర్లే తమ ప్లాన్లలో లభించే డేటాను పూర్తిగా వినియోగిస్తున్నారు. 58 శాతం మంది యూజర్ల ఖాతాల్లో 30 జీబీ పైగా డేటా మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ ధోరణులకు అనుగుణంగా డేటా వ్యూహాలను టెల్కోలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment