'గడ్డుకాలం ఎదుర్కొంటున్న లంకకు సాయం చేస్తాం'
న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది శ్రీలంక. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ స్పందించారు. పొరుగు దేశంతో భారత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు కూడా తన వంతు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం శరణార్థ సంక్షోభం లేదని జైశంకర్ పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది, ఏం జరుగుతుందో వేచి చూడాలని పేర్కొన్నారు. భారత్ నుంచి మాత్రం అవసరమైన సాయం అందుతుందని స్పష్టం చేశారు.
సంక్షోభంతో అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది శ్రీలంక. ఆహారం, ఇంధనం, ఆర్థిక సంక్షోభానికి కారణం అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అని, ఆయనే ప్రస్తుత పరిస్థితికి బాధ్యత తీసుకోవాలంటూ లక్షల మంది నిరసనకారులు శనివారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. ఒకప్పుడు సుసంపన్నంగా ఉన్న తమను దారుణమైన పరిస్థితిలోకి నెట్టారని ఆరోపిస్తున్నారు.
మరోవైపు ప్రధాని విక్రమసింఘే ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. జనాగ్రహం చూసి ఆయన ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో శ్రీలంకలో అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి:అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు