విమానాశ్రయాల్లా బస్టాండ్లు
సాక్షి, హైదరాబాద్: బస్టాండ్లను రాబడికి రాచమార్గాలుగా చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని పెద్ద పెద్ద బస్టాండ్లను విమానాశ్రయాల మాదిరిగా తీర్చిదిద్దనుంది. శంషాబాద్ విమానాశ్రయంలోని వాణిజ్య, వ్యాపార స్టాళ్ల మాదిరిగానే ఈ బస్టాండ్లలోనూ స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. విమానాశ్రయాల్లో దొరికే అన్ని రకాల వస్తువులు లభించేలా తీర్చిదిద్దుతారు. దీంతోపాటు ప్రయాణికులకు అధునాతన వసతులు కల్పించనున్నారు.తొలి దశలో విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి బస్టాండ్లను వాణిజ్య సముదాయాలుగా తీర్చిదిద్దనున్నారు.
ప్రయాణికులు రాత్రి పూట బస చేసేందుకు వీలుగా అత్యాధునిక వసతులతోపాటు సింగిల్, డబుల్ బెడ్ రూమ్ గదుల నిర్మాణం చేపడతారు. పగలుగానీ లేదా రాత్రిగానీ గంట సేపు విశ్రాంతి తీసుకోవాలనుకునే ప్రయాణికులకు అనువుగా గదుల్ని నిర్మిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో బస్టాండ్లను లీజుకివ్వాలని నిర్ణయించారు. ఎవరు ఎక్కువ ఆదాయమిస్తే వారికి వీటిని కేటాయిస్తారు.
తొలుత మూడుచోట్ల చేపడతాం
రాష్ర్టంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి బస్టాండ్లను వాణిజ్య సముదాయాలుగా తీర్చిదిద్దనున్నామని రహదారులు, భవనాలు, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబ్ ‘సాక్షి ’కి తెలిపారు. ఈ బస్టాండ్లలో 12 నుంచి 20 ఎకరాల వరకు స్థలం ఉందన్నారు. ఇందుకోసం రెండు నెలల్లో ఆసక్తిగల సంస్థల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తామన్నారు.
గుజరాత్లోని బరోడాతోపాటు కర్ణాటకలోని ఆర్టీసీ బస్టాండ్లను వాణిజ్య సముదాయాలుగా తీర్చిదిద్దారని, అదే తరహాలో రాష్ట్రంలో తొలుత పెద్ద పెద్ద బస్టాండ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం ఎవరు ఇస్తే వారికి పీపీపీ విధానంలో ఆయా బస్టాండ్లను లీజుకిస్తామని చెప్పారు. క్రమంగా అన్ని జిల్లాల బస్టాండ్లను కూడా పీపీపీ విధానంలో లీజుకిచ్చి అభివృద్ధి చేస్తామన్నారు.