నా పాఠశాలలో కుదరదు!
గంథపు చెక్క
పాలరాయి వంటి అందమైన భవనం లేకపోయినా ఫరవాలేదు. కానీ నా పాఠశాల ఆవరణలో గోతులు పడి, కనీసం మట్టి, సున్నం కూడా అద్ద కుండా ఉంటే కుదరదు. నా పాఠశాల భవనం గోడలకి అందంగా రంగులు వెయ్యకపోయినా ఫరవాలేదు. కానీ ఒక్క సాలెగూడుగానీ, బూజు, ధూళిగాని ఉంటే కుదరదు. నా పాఠశాలలో అందమైన తివాచీలు పరచకపోయినా ఫరవాలేదుగానీ, ఉన్న కొన్ని పరికరాలను సరిగా ఉపయోగించకపోతే కుదరదు. నా పాఠశాలలో బాలసాహిత్యంతో పెద్ద గ్రంథాలయం లేకున్నా ఫరవాలేదుగానీ, చేతితో రాసిన పుస్తకమయినా సరే పిల్లలు ఉత్సాహంగా ఆసక్తిగా చదివేది లేకపోతే కుదరదు.
బాగా చదివిన ఉద్దండ పండితులు నా పాఠశాలలో లేకపోయినా ఫరవాలేదుగానీ, పిల్లలని ఆదరించి వారి వ్యక్తిత్వవికాసానికి తగిన కృషి చేయని వాళ్లు ఉంటే కుదరదు.ప్రతి నిమిషం పిల్లల జ్ఞానాన్ని పెంచాలని పరుగెత్తకపోయినా ఫరవాలేదు...కానీ నా పాఠశాలలో పిల్లల్ని తిట్టి, కొట్టి చదవమని కూర్చో బెట్టడం కుదరదు. నా పాఠశాలలో పిల్లలు తక్కువ చదివినా ఫరవాలేదు. కానీ గట్టి గట్టిగా అరిచి చదివి అలసిపోవడం కుదరదు.
- గిజుభాయి ‘మాస్టారూ’ పుస్తకం నుంచి)