విమానంపై లేజర్ దాడి!
లండన్: అమెరికాలోని న్యూయార్క్‌కు బయల్దేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానంపై లేజర్ కిరణాల దాడి జరగడంతో లండన్‌లోని హిత్రూ విమానాశ్రయానికి వెనుదిరిగింది. ఈ కిరణాలు కళ్లపై పడటంతో ఓ పైలట్ అస్వస్థతకు గురయ్యాడు. ఘటన జరిగినపుడు విమానంలో 252 మంది ప్రయాణికులతో పాటు 15 మంది సిబ్బంది ఉన్నారు.
విమానం లండన్‌లోని హిత్రూ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే లేజర్ కిరణాల దాడి జరిగింది. దీంతో ముందుకు కొనసాగడం కన్నా వెనుదిరగడమే మేలని భావించిన పైలట్లు ఐరిష్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. అయితే లేజర్ కిరణాలు ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లండన్‌లో 2010 నుంచి ఇప్పటి వరకు 1,300 లేజర్ దాడులు జరిగాయని తెలిపారు.