‘చింత’ వీడని రైల్వే
‘చింత’ వీడని రైల్వే
వేళకు రాని ప్యాసింజర్ రైళ్లు
ఆలస్యానికి చింతిస్తున్నామంటూ అనౌన్స్మెంట్
గంటల కొద్దీ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల పడిగాపులు
గుంతకల్లు : ‘యువర్ అటెన్షన్ ప్లీజ్... గుంతకల్లు రైల్వే జంక్షన్ మీదుగా నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆలస్యానికి చింతిస్తున్నాం. సహకరించగలరని మనవి..’ అన్న అనౌన్స్‌మెంట్‌తో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల రోజులుగా తిరుపతి–హుబ్లీ, కదిరిదేవరపల్లి–తిరుపతి, కాచిగూడ–గుంతకల్లు ప్యాసింజర్ రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నా.. సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టలేకపోతున్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా మొత్తం 26 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో 10 రైళ్లు గుంతకల్లు రైల్వే జంక్షన్ నుంచే బయలుదేరుతుంటాయి. ప్రధానంగా గుంతకల్లు–కాచిగూడ, గుంతకల్లు–తిరుపతి, గుంతకల్లు–రాయచూరు, గుంతకల్లు–గుల్బర్గా, గుంతకల్లు–చిక్జాజూర్, గుంతకల్లు–కర్నూలు, గుంతకల్లు–డోన్, గుంతకల్లు–బళ్లారి, గుంతకల్లు–హిందూపురం ప్యాసింజర్ రైళ్లలో నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తున్నారు. రైళ్లు సరైన వేళలకు బయలుదేరకపోవడం, రాకపోవడం వల్ల స్టేషన్‌లోని ప్లాట్పారాల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తిరుపతి నుంచి హుబ్లీ వెళ్లే ప్యాసింజర్ గుంతకల్లుకు మధ్యాహ్నం 2.10 గంటలకు రావల్సి ఉంది. అయితే నెల రోజులుగా ఈ రైలు రోజూ 2 నుంచి 4 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. గత శనివారం ఈ రైలు సాయంత్రం 7.00 గంటలకు గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు చేరింది. అదేవిధంగా కదిరిదేవరపల్లి–తిరుపతి ప్యాసింజర్ రైలు సాయంత్రం 6.00 గంటలకు గుంతకల్లు జంక్షన్‌కు చేరుకోవాల్సి ఉండగా గడిచిన ఆదివారం రాత్రి 10.45 గంటలకు చేరింది. సాయంత్రం 7.30 గంటలకు రావాల్సిన కాచిగూడ - గుంతకల్లు ప్యాసింజర్ రైలు రోజూ 10.30 గంటల తరువాత చేరుకుంటోంది. ఎక్స్‌ప్రెస్ రైలు కంటే ప్యాసింజర్ రైలు టిక్కెట్ ధర తక్కువ కావడంతో నిరుపేద, మధ్య తరగతి ప్రయాణికులు ఈ రైళ్లలో రాకపోకలు సాగించడానికి ఇష్టపడతారు. అయితే రైళ్లు ఆలస్యంగా చేరుకుంటుండడంతో ప్రయాణికులు సరైన సమయంలో గమ్యస్థానాలను చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం గుంతకల్లు డివిజన్ మీదుగా ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైళ్లన్నీ 90 శాతం మేర నిర్ణీత సమయంలోనే గమ్యస్థానాలను చేరుతున్నాయని పేర్కొంటుండటం విశేషం. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్యాసింజర్ రైళ్లపై చిన్నచూపును వీడి నిర్ణీత సమయాల్లో నడిచేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.