latest books
-
వైద్య విద్యార్థులకు వరం.. డిజిటల్ లైబ్రరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యవిద్యకు సంబంధించిన అత్యాధునిక పుస్తకాలు, వివిధ రకాల అరుదైన చికిత్సలకు సంబంధించిన వీడియోలు, వేలాది జర్నల్స్‌తో కూడిన డిజిటల్ లైబ్రరీ (ఈ–లైబ్రరీ)ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వైఎస్సార్ మెడ్‌నెట్ కన్సార్షియం పేరుతో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, ఆయుష్, పారా మెడికల్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి వేలాది రకాల అత్యాధునిక పాఠ్యపుస్తకాలు, జర్నల్స్, అరుదైన చికిత్సలు, ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌కు సంబంధించిన వీడియోలు ఉంచారు. ప్రతి విద్యార్థి డిజిటల్ లైబ్రరీని సులభంగా వినియోగించుకునేందుకు మైలాఫ్ట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం యూనివర్సిటీ రూ. 4 కోట్లు వెచ్చించింది. మైలాఫ్ట్.. యూజర్ ఫ్రెండ్లీ యాప్.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 2008లోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే అక్కడ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. లైబ్రరీలో మాత్రమే దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో లైబ్రరీ పనివేళల్లో వెళ్లేందుకు కుదరకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. పరిస్థితి గమనించిన ప్రస్తుత వర్సిటీ అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో మైలాఫ్ట్ (మై లైబ్రరీ ఆన్ ఫింగర్ టిప్స్) అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు, టీచింగ్ వైద్యులు, ఎక్కడినుంచైనా తమ మొబైల్లో సైతం లాగిన్ అయ్యి డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీన్లో 21 వేలకు పైగా ఈ–బుక్స్, 22,433కు పైగా ఈ– జర్నల్స్, 11,000 పైగా వీడియోలు ఉన్నాయి. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రతి విద్యార్థి ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా డిజిటల్ లైబ్రరీని ఆధునీకరించాం. మైలాఫ్ట్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ద్వారా విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్కడి నుంచైనా, తమ మొబైల్స్‌లో సైతం లాగిన్ అయ్యే అవకాశం కల్పించాం. డిజిటల్ లైబ్రరీ వినియోగంపై అన్ని కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ వి.రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ సద్వినియోగం చేసుకోవాలి మైలాఫ్ట్ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు టెక్నికల్ సిబ్బందితో కలిసి జోనల్ వారీగా సదస్సులు నిర్వహించి యాప్ వినియోగంపై ఫ్యాకలీ్ట, విద్యార్థుల్లో అవగాహన కలి్పస్తున్నాం. వేలాది ఈ–బుక్స్, ఈ–జర్నల్స్, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. – డాక్టర్ కె.సుధ, కో ఆర్డినేటర్, కన్సార్షియం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
కొత్త పుస్తకాలు
న్యూ రిలీజ్ పవర్ ఆఫ్ ఎ కామన్ మేన్ ప్రపంచంలోని నటులందరిలోనూ షారూక్‌ఖాన్ అధిక సంపన్నుడని ఈ మధ్యే ఎవరో తేల్చారు. హాలీవుడ్‌వాళ్లు కూడా మనవాడి వెనుక నిలబడి ఎక్కడ వెనుకబడ్డామా అని లెక్కలేసుకుంటున్నారట. ఆ మాట నిజమో కాదోగాని భారత ఉపఖండంలో ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా షారూక్‌ఖాన్ మూట గట్టుకున్న అభిమానులు తక్కువేం కాదు. చాలామంది ఇంతటితో ఆగిపోతారు. అయితే షారూక్ వాళ్లందరినీ అభిమానులుగా కాక వినియోగదారులుగా కూడా చూశాడు. అందుకే తనే ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా మారి చాలా ప్రాడక్ట్స్‌కు ప్రమోషన్ ఇచ్చాడు. ఇవాళ షారూక్ మైనస్ మార్కెట్‌ను ఊహించడం కష్టం అంటారు మార్కెట్ రంగ నిపుణులు. పుస్తకాలు రాసేవాళ్లు కూడా మార్కెట్‌నే దృష్టిలో పెట్టుకుని ఉంటారు. ఇదంతా గమనించిన కొరల్ దాస్‌గుప్తా అనే రచయిత్రి షారూక్ మీద తాజాగా ‘పవర్ ఆఫ్ ఎ కామన్ మేన్’ అనే పుస్తకాన్ని వెలువరించింది. ఇది ఇటీవల ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారూక్ వాడిన డైలాగ్. షారూక్‌ని కేవలం నటుడిగా కాకుండా అతడి వెనుక ఉన్న వ్యాపార వ్యూహాలను ఆమె ఈ పుస్తకంలో చర్చించింది. ఒక సాదాసీదా ఢిల్లీ కామన్ మేన్ ఇవాళ ఇంత పెద్ద విజేత ఎలా అయ్యాడో తెలియాలంటే ఈ పుస్తకం చదవాలి. పబ్లిషర్: Westland వెల: రూ. 395 సివిల్స్ తెలుగు అభ్యర్థుల కోసం వ్యాస కల్హారాలు గుణనిధి కథ, సుగాత్రీ శాలీనుల కథ, ఆంధ్రప్రశస్తి, జాషువా గబ్బిలం, కర్పూర వసంతరాయలు, మహాప్రస్థానం ఆధ్యాత్మికత, అల్పజీవి నవల తదితర అంశాలపై పోటీ పరీక్షలకు తగినట్టుగా వ్యాసాలు. రచయిత్రి సర్వమంగళ గౌరి దశాబ్దాలుగా పోటీ పరీక్షల బోధనా రంగంలో ఉండటం వల్ల విద్యార్థులు తప్పక పరిశీలించదగ్గ పుస్తకం. వెల: రూ.120 ప్రతులకు: 9866222978 కారంచేడు నుంచి లక్షింపేట దాకా 1985 కారంచేడు నరమేధం నుంచి 2012 లక్షింపేట మారణ కాండ దాకా దళితులపై జరిగిన సామూహిక దాడులు, హంతకుల శిక్షకై జరిగిన పోరాటాలు, చర్చలు... వీటన్నింటి సమగ్ర కూర్పు ఇది. దళిత పోరాటాల నేపధ్యం తెలియాలంటే ఈ పుస్తకం చదవక తప్పదు. ఎన్నో వ్యయప్రయాసలతో ఈ భారీ సంకలనాన్ని తీర్చిదిద్దిన పాపని నాగరాజు అభినందనీయుడు. వెల: ఇవ్వలేదు ప్రతులకు: 9948872190 -
తాజా పుస్తకాలు
ఉద్యమాలలో భారత మహిళలు సింహం తన చరిత్ర తాను రాసుకునే వరకూ వేటగాడి చరిత్రే చెలామణి అవుతుందని సామెత. మనం ఏ పని చేసినా మగదృష్టితోనే చేస్తాం. ఉద్యమాల గాథలైనా విజేతల కథలైనా మగవారి వల్ల మగవారి చేత మగవారి కొరకు. స్త్రీలు ఏం చేసినా లెక్కలోకి రాదు. స్త్రీల చేతుల తోడు లేకుండా చప్పట్లు మోగగలవా? ఆదివాసీ ఉద్యమాల్లో, స్వాతంత్య్రోద్యమాల్లో పని చేసిన స్త్రీల గురించి రాయరు చాలాసార్లు. ఆ మొత్తం వెలితిని పూడ్చే ప్రయత్నం ఈ పుస్తకం. వి.గార్గి ఇంగ్లిష్‌లో రాసిన ‘హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఇన్ మూవ్మెంట్’ పుస్తకాన్ని తెలుగులో మహిళామార్గం పత్రికలో సీరియలైజ్ చేసి (అనువాదం: మధుమాలతి, సూరి) ఇప్పుడు పుస్తకంగా తీసుకువచ్చారు. సంస్కరణోద్యమాల నుంచి మొదలుపెట్టి పర్యావరణ ఉద్యమాల వరకు పిడికిలి బిగించిన స్త్రీలెందరో ఇందులో కనపడతారు. విలువైన పుస్తకం. మహిళ లేని చరిత్ర లేదు- వి.గార్గి; వెల: రూ.120; ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు ఉడ్‌హౌస్ పుస్తకాలు రెండు తెలుగులో ఉడ్హౌస్ని అనుదించి అందించడంలో గబ్బిట కృష్ణమోహన్ సఫలీకృతులయ్యారు. ఆయన అనువాదం చేసిన ఉడ్‌హౌస్ కథలు ‘సరదాగా కాసేపు’ పేరుతో వెలువడి పాఠకాదరణ పొందాయి. ఆ ఉత్సాహంతో ఆయన మరి రెండు పుస్తకాలు తీసుకొచ్చారు. ఉడ్‌హౌస్ రాసిన ‘ది స్టోరీ ఆఫ్ విలియమ్’, ‘ది మేన్ హూ గేవ్ అప్ స్మోకింగ్’, ‘బిగ్ బిజినెస్’ తదితర పది కథలను ‘సరదాగా మరి కాసేపు’ పేరుతోనూ, ఉడ్‌హౌస్ నవల ‘ఫ్రోజెన్ ఎసెట్స్’ను ‘లంకె బిందెలు’ పేరుతోనూ అనువాదం చేసి అందించారు. రెంటిలోనూ ఉడ్‌హౌస్ పాత్రలను స్థానికీకరణం చేసి రాయడం ఒక విధంగా మంచిది ఒక విధంగా కాదు. మంచి ఏమిటంటే మూలం మరీ దగ్గరైపోవడం. చెడ్డ- మూలం మరీ దూరానికి పోవడం. హాస్యాభిమానుల పుస్తకాలు ఇవి. సరదాగా మరి కాసేపు; వెల: రూ.140; లంకెబిందెలు; వెల: రూ.150; విశాలాంధ్ర ప్రచురణ; ప్రతులకు- విశాలాంధ్ర ఎన్నికల చట్టాలపై సమగ్ర సమాచారం ఓటు వేయడం ఇవాళ ప్రతి ఒక్కరి బాధ్యతగా మారింది. ఎవరికి ఓటు వేయాలనే అంశంపై చైతన్యం తెచ్చుకోవడం కనిపిస్తూ ఉంది. అయితే ఒకరికి ఓటు వేసే స్థితి నుంచి మనమే అభ్యర్థిగా మారే స్థితికి ఎదగాలంటే (పార్టీల్లో ఉండాల్సిన నియమం లేదు. ఇండిపెండెంట్‌గా అయినా సరే) ఏం చేయాలో చాలామందికి తెలియదు. ఔత్సాహిక రాజకీయ నేతలకు కూడా తెలియదు. న్యాయవాదులు వడ్లమాని వెంకటరమణ, వడ్లమాని నాగేష్శర్మలు ఈ అవసరం కోసమే ప్రజా ప్రాతినిధ్యచట్టం అంతటిని తెలుగులోకి అనువాదం చేశారు. ఎలక్షన్ ప్రక్రియలోని అన్ని స్థాయులను విశదపరిచారు. అభ్యర్థి అర్హతలు, నామినేషన్ ఎలా వేయాలి, కట్టవలసిన డిపాజిట్లు, ఏజెంట్లు, బూత్‌లు-వాటి నిర్వహణ, రిటర్నింగ్ ఆఫీసర్లు, వారి డ్యూటీలు విపులంగా చర్చించారు. దీంతో పాటు సమాచార హక్కు చట్టం, సొసైటీల చట్టం తదితర అంశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో గెలవండి- వెల: రూ.200; ప్రతులకు: 9912240509 పల్లెను మింగిన పెట్టుబడి పల్లెలు అభివృద్ధి చెందాలంటే నిధులు రావాలి. నిధులు రావాలంటే పెట్టుబడి రావాలి. పెట్టుబడి వస్తే? వస్తే ఏమవుతుందో పల్లెలు ఏమవుతున్నాయో వృత్తులేమవుతున్నాయో వ్యవసాయం ఏమవుతున్నదో గిరిజనులు ఏమవుతున్నారో మత్స్యకారులు ఏమవుతున్నారో ఐదేళ్ల పాటు పల్లెలు తిరిగి పరిశోధించి రాసిన పుస్తకం ఇది. చాలామంది వ్యవసాయాన్ని వదిలేయడం మనకు అభివృద్ధి. వలస వచ్చి పట్టణాల్లో మురికివాడలను పెంచడమూ అభివృద్ధే. స్థానిక వ్యవస్థలు బలపడాల్సింది పోయి అంతరాలు పెరిగి నడుం విరుచుకుంటూ ఉండటం పల్లెల్లో వర్తమాన దృశ్యం. దీనిని చూపి మేల్కొలిపే ప్రయత్నం చేశారు పుస్తక రచయిత ఎస్.ఎ.విద్యాసాగర్. పాత వ్యవస్థ మంచిదికాదు మారాలి అనుకున్నాం గతంలో. కొత్త వ్యవస్థ బాగున్నదా? భవిష్యత్తు క్షేమంగా అనిపిస్తున్నదా? ఆ అవగాహన కలిగించే పుస్తకమే ఇది. పల్లెను మింగిన పెట్టుబడి - ఎస్.ఎ. విద్యాసాగర్; వెల: రూ. 250; ప్రతులకు- 9010204633, 9492340651