laughing clubs
-
లాఫింగ్ క్లబ్‌లా కాంగ్రెస్ పార్టీ
కంగ్రా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. అవినీతిని ఉపేక్షించబోమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా చెపుతోందని, కానీ స్వయంగా ఆ పార్టీ ముఖ్యమంత్రే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారని మోదీ ఎద్దేవా చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ నెల 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న సంగతిని ఆయన గుర్తుచేశారు. దేవుళ్లకు నిలయమైన దేవభూమి (హిమాచల్) నుంచి దెయ్యాలను పారద్రోలాలని పిలుపునిచ్చారు. ‘‘కాంగ్రెస్ పార్టీ లాఫింగ్ క్లబ్‌గా మారుతోందని నాకు అనిపిస్తోంది. ముఖ్యమంత్రే ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్ పొందింది అవినీతి ఆరోపణలపై.. ఆయన ఎదుర్కొంటున్నవి తీవ్రమైన అభియోగాలు’’ అని చెప్పారు. అటువంటి ముఖ్యమంత్రి అవినీతిని అంతమొందిస్తామని చెపుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం సరైనదేనా అని ప్రజలను అడిగారు. హిమాచల్‌లోని చిన్న పిల్లాడు కూడా దీనిని అంగీకరించబోడని చెప్పారు. డోక్లామ్ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చైనా రాయబారితో సమావేశం కావడాన్ని మోదీ తప్పుబట్టారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కుటుంబంలో పుట్టిన ఓ నాయకుడు దేశాన్ని కించపరిచేలా ప్రవర్తించారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని అడగడం మానేసి.. చైనా నాయకులతో ఇలాంటి వాళ్లు మాట్లాడటం దేశాన్ని కించపరచడం కాదా అని రాహుల్‌ను ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఉన్నది స్వాతంత్య్ర సమరయోధులు, మహాత్మా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కాదని, ఇది అవినీతిలో కూరుకుపోయిన, వారసత్వ రాజకీయాలకు నిలయమైన పార్టీ అని చెప్పారు. స్వచ్ఛ అభియాన్‌లో ప్రజలంతా భాగస్వాములయ్యారని, వారికి ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ పాత పార్టీని తుడిచిపెట్టేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. దేవభూమిలో దెయ్యాలను పెంచిపోషించింది కాంగ్రెస్ పార్టీయే అని, రాష్ట్రాన్ని లూటీ చేసిన దెయ్యాలను తరిమికొట్టి హిమాచల్‌ప్రదేశ్‌ను రక్షించాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. -
అది ఒక లాఫింగ్ క్లబ్
సాక్షి, కాంగ్రా (హిమాచల్ ప్రదేశ్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఒక లాఫింగ్ క్లబ్‌లా మారిందని మోదీ ఎగతాళి చేశారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీ దేశం నుంచి త్వరలోనే కనుమరుగు అవుతుందని పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు దూరంజరుగుతున్నా.. ఆ పార్టీ మాత్రం ఏమిపట్టనట్లు వ్యహరిస్తోందని ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కాంగ్ర బహిరంగ సభలో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలోని అన్నిప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనమంతా ఒక్కసారి కాంగ్రెస్ వైపు చూడాలని చెప్పారు. అంతేకాక వాళ్లను మనమంతా మెచ్చుకోవాలని చెప్పారు. దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది.. అయితే అన్నిచోట్లా ఓడిపోయి మనకు గెలుపుని ఇస్తుంది అని చెప్పారు. హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ అవినీతి, అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉన్నారు.. ఆయన కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నారు.. వీళ్లను మనము ఏమనుకోవాలి? అని అన్నారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రజలు మార్పుకు ఓటేశారు.. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒక లాఫింగ్ క్లబ్‌గా మారిపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల జాబితాలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌కు ఈ నెల 9న ఎన్నికలు జరగనున్నాయి. -
సందర్భ శుద్ధి లేని నవ్వుతో చేటే!
నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం... నవ్వకపోవడం ఒక రోగం’ అన్నాడు ప్రముఖ దర్శకుడు జంధ్యాల. ఆ మాట అక్షర సత్యం. కానీ, ఆ నవ్వుకు సందర్భ శుద్ధి చాలా అవసరం. ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు నవ్వకూడదో తెలుసుకుని మరీ నవ్వాలి. లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఈ విషయం సరిగ్గా తెలియపోవడం వల్లనే చైనాలో ఓ పెద్ద మనిషికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 సంవత్సరాల జైలుశిక్ష పడింది. అదేంటి, నవ్వినందుకు కూడా జైల్లో పెడతారా అనుకోవచ్చు గానీ ఇది అక్షరాలా నిజం ఎందుకంటే, ఓ ప్రమాదం జరిగినప్పుడు దాన్ని చూసి ఆయన విరగబడి నవ్వారట. దాంతో ఒళ్లు మండిన కోర్టు సదరు పెద్దమనిషిని హాయిగా జైల్లో కాలం గడపాలంటూ ఆదేశించింది. కానీ ఆ కోర్టుకు నిజంగా నవ్వు విలువ తెలుసో లేదోనని ఆయన ఆవేదన చెందారట. అసలు విషయం ఏమిటంటే, ఇంత అన్యాయంగా కూడా ప్రమాదాలకు గురవుతారా అని అతగాడికి అనుమానం వచ్చింది. ప్రశాంతంగా బాగున్న రోడ్డు మీద ఎంచక్కా వెళ్లకుండా అనవసరంగా ఎలా యాక్సిడెంటు చేసుకున్నారోనంటూ నవ్వుకున్నారు. దాన్ని కాస్తా ఆ ప్రమాదంలో బతికి బయటపడ్డవాళ్లు వీడియో తీసి కోర్టుకు పంపేసరికి అయ్యగారి బండారం అందరికీ తెలిసిపోయింది. దాంతో ఆయనకు అక్షరాలా 14 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. చైనా పెద్ద మనిషి అనవసరంగా తంటాలు పడ్డారు గానీ, నిజానికి ప్రపంచవ్యాప్తంగా నవ్వు... అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకొని ఎందరో ఆరోగ్యవంతులవుతున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నవ్వు క్లబ్‌లు. నగు మోముకు నవ్వే అందాల నగ... అరమరికలు లేని నవ్వు ఎదుటి వారిని ఆప్యాయంగా పలకరించినట్టు ఆలింగనం చేసుకున్నట్టు ఆప్యాయతను కురిపిస్తుంది. నవ్వితే హాయిగా, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కడుపుబ్బా నవ్విన తర్వాత ఎలా ఉందని అడిగితే... చాలామంది హాయిగా ఉందం టారు. కానీ ప్రస్తుతం నగర జీవితపు వాసనల వల్ల నవ్వు అనేదే మాయమైపోయింది. నలుగురు కలిసి హాయిగా నవ్వుకునే రోజులు కనిపించడంలేదు. నవ్వు అనేక రకాలుగా ఆరో గ్యానికి మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో నవ్వుకోడానికే ప్రత్యేకంగా లాఫింగ్ క్లబ్‌లు ఏర్పడ్డాయి. నవ్వు అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్, దీనికి మించిన వ్యాయామం లేదని చాలాసార్లు చాలామంది చెప్పారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్నిచ్చి, మనిషని ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు. మనుషులకు మాత్రమే చేతనైన ఏకైక విద్య నవ్వేనంటే ఆశ్చర్యం లేదు. నవ్వు శరీరంలోని కొటికోల్ అయాన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. నవ్వు వల్ల ఎండార్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ బాధను మరిపిస్తాయి, అనేక శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేసి ప్రశాంతతను ఇవ్వడంలో ఈ హార్మోన్లు ప్రధానపాత్ర పోషిస్తాయి. నవ్వడం వలన రోగాలు మటుమాయం అవుతాయని వైద్య నిపుణులు చెబుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే మాత్రం.. నవ్వు ఒక విధమైన ముఖ కవళిక. నవ్వులో ముఖంలోని వివిధ కండరాలు, ముఖ్యంగా నోటికి రెండువైపులా ఉండేవి సంకోచిస్తాయి. మానవులలో నవ్వు సంతోషం, ఆనందానికి బాహ్య సంకేతం. కొందరు నిశ్శబ్దంగా నవ్వుకుంటే, కొంత మంది బయటకు శబ్దం వచ్చేటట్లుగా నవ్వుతారు. సాధారణంగా చలోక్తులు, కితకితలు మరికొన్ని రకాల ప్రేరేపణల వలన నవ్వొస్తుంది. నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వలన, కొన్ని మాదక ద్రవ్యాలు వాడడం వలన బిగ్గరగా నవ్వుతారు. బిగ్గరగా నవ్వినప్పుడు కొన్నిసార్లు కన్నీరు కూడా రావచ్చు. మానవులలో నవ్వడాన్ని మెదడు నియంత్రిస్తుంది. నవ్వు కోపానికి విరుగుడు. మానవులలో నవ్వు, హాస్యానికి సంబంధించిన మానసిక, శరీరధర్మ శాస్త్ర ప్రభావాల్ని గురించి తెలిపే శాస్త్ర విజ్ఞానాన్ని "జెలోటాలజీ" అంటారు.