
కంగ్రా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. అవినీతిని ఉపేక్షించబోమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా చెపుతోందని, కానీ స్వయంగా ఆ పార్టీ ముఖ్యమంత్రే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారని మోదీ ఎద్దేవా చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ నెల 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న సంగతిని ఆయన గుర్తుచేశారు. దేవుళ్లకు నిలయమైన దేవభూమి (హిమాచల్) నుంచి దెయ్యాలను పారద్రోలాలని పిలుపునిచ్చారు. ‘‘కాంగ్రెస్ పార్టీ లాఫింగ్ క్లబ్‌గా మారుతోందని నాకు అనిపిస్తోంది. ముఖ్యమంత్రే ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్ పొందింది అవినీతి ఆరోపణలపై.. ఆయన ఎదుర్కొంటున్నవి తీవ్రమైన అభియోగాలు’’ అని చెప్పారు. అటువంటి ముఖ్యమంత్రి అవినీతిని అంతమొందిస్తామని చెపుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం సరైనదేనా అని ప్రజలను అడిగారు.
హిమాచల్‌లోని చిన్న పిల్లాడు కూడా దీనిని అంగీకరించబోడని చెప్పారు. డోక్లామ్ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చైనా రాయబారితో సమావేశం కావడాన్ని మోదీ తప్పుబట్టారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కుటుంబంలో పుట్టిన ఓ నాయకుడు దేశాన్ని కించపరిచేలా ప్రవర్తించారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని అడగడం మానేసి.. చైనా నాయకులతో ఇలాంటి వాళ్లు మాట్లాడటం దేశాన్ని కించపరచడం కాదా అని రాహుల్‌ను ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు.
ప్రస్తుతం దేశంలో ఉన్నది స్వాతంత్య్ర సమరయోధులు, మహాత్మా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కాదని, ఇది అవినీతిలో కూరుకుపోయిన, వారసత్వ రాజకీయాలకు నిలయమైన పార్టీ అని చెప్పారు. స్వచ్ఛ అభియాన్‌లో ప్రజలంతా భాగస్వాములయ్యారని, వారికి ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ పాత పార్టీని తుడిచిపెట్టేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. దేవభూమిలో దెయ్యాలను పెంచిపోషించింది కాంగ్రెస్ పార్టీయే అని, రాష్ట్రాన్ని లూటీ చేసిన దెయ్యాలను తరిమికొట్టి హిమాచల్‌ప్రదేశ్‌ను రక్షించాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు.