
సందర్భ శుద్ధి లేని నవ్వుతో చేటే!
నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం... నవ్వకపోవడం ఒక రోగం’ అన్నాడు ప్రముఖ దర్శకుడు జంధ్యాల. ఆ మాట అక్షర సత్యం. కానీ, ఆ నవ్వుకు సందర్భ శుద్ధి చాలా అవసరం. ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు నవ్వకూడదో తెలుసుకుని మరీ నవ్వాలి. లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఈ విషయం సరిగ్గా తెలియపోవడం వల్లనే చైనాలో ఓ పెద్ద మనిషికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 సంవత్సరాల జైలుశిక్ష పడింది. అదేంటి, నవ్వినందుకు కూడా జైల్లో పెడతారా అనుకోవచ్చు గానీ ఇది అక్షరాలా నిజం ఎందుకంటే, ఓ ప్రమాదం జరిగినప్పుడు దాన్ని చూసి ఆయన విరగబడి నవ్వారట. దాంతో ఒళ్లు మండిన కోర్టు సదరు పెద్దమనిషిని హాయిగా జైల్లో కాలం గడపాలంటూ ఆదేశించింది.
కానీ ఆ కోర్టుకు నిజంగా నవ్వు విలువ తెలుసో లేదోనని ఆయన ఆవేదన చెందారట. అసలు విషయం ఏమిటంటే, ఇంత అన్యాయంగా కూడా ప్రమాదాలకు గురవుతారా అని అతగాడికి అనుమానం వచ్చింది. ప్రశాంతంగా బాగున్న రోడ్డు మీద ఎంచక్కా వెళ్లకుండా అనవసరంగా ఎలా యాక్సిడెంటు చేసుకున్నారోనంటూ నవ్వుకున్నారు. దాన్ని కాస్తా ఆ ప్రమాదంలో బతికి బయటపడ్డవాళ్లు వీడియో తీసి కోర్టుకు పంపేసరికి అయ్యగారి బండారం అందరికీ తెలిసిపోయింది. దాంతో ఆయనకు అక్షరాలా 14 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
చైనా పెద్ద మనిషి అనవసరంగా తంటాలు పడ్డారు గానీ, నిజానికి ప్రపంచవ్యాప్తంగా నవ్వు... అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకొని ఎందరో ఆరోగ్యవంతులవుతున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నవ్వు క్లబ్‌లు. నగు మోముకు నవ్వే అందాల నగ... అరమరికలు లేని నవ్వు ఎదుటి వారిని ఆప్యాయంగా పలకరించినట్టు ఆలింగనం చేసుకున్నట్టు ఆప్యాయతను కురిపిస్తుంది. నవ్వితే హాయిగా, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కడుపుబ్బా నవ్విన తర్వాత ఎలా ఉందని అడిగితే... చాలామంది హాయిగా ఉందం టారు. కానీ ప్రస్తుతం నగర జీవితపు వాసనల వల్ల నవ్వు అనేదే మాయమైపోయింది. నలుగురు కలిసి హాయిగా నవ్వుకునే రోజులు కనిపించడంలేదు. నవ్వు అనేక రకాలుగా ఆరో గ్యానికి మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో నవ్వుకోడానికే ప్రత్యేకంగా లాఫింగ్ క్లబ్‌లు ఏర్పడ్డాయి.
నవ్వు అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్, దీనికి మించిన వ్యాయామం లేదని చాలాసార్లు చాలామంది చెప్పారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్నిచ్చి, మనిషని ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు. మనుషులకు మాత్రమే చేతనైన ఏకైక విద్య నవ్వేనంటే ఆశ్చర్యం లేదు. నవ్వు శరీరంలోని కొటికోల్ అయాన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. నవ్వు వల్ల ఎండార్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ బాధను మరిపిస్తాయి, అనేక శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేసి ప్రశాంతతను ఇవ్వడంలో ఈ హార్మోన్లు ప్రధానపాత్ర పోషిస్తాయి. నవ్వడం వలన రోగాలు మటుమాయం అవుతాయని వైద్య నిపుణులు చెబుతారు.
శాస్త్రీయంగా చెప్పాలంటే మాత్రం.. నవ్వు ఒక విధమైన ముఖ కవళిక. నవ్వులో ముఖంలోని వివిధ కండరాలు, ముఖ్యంగా నోటికి రెండువైపులా ఉండేవి సంకోచిస్తాయి. మానవులలో నవ్వు సంతోషం, ఆనందానికి బాహ్య సంకేతం. కొందరు నిశ్శబ్దంగా నవ్వుకుంటే, కొంత మంది బయటకు శబ్దం వచ్చేటట్లుగా నవ్వుతారు. సాధారణంగా చలోక్తులు, కితకితలు మరికొన్ని రకాల ప్రేరేపణల వలన నవ్వొస్తుంది. నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వలన, కొన్ని మాదక ద్రవ్యాలు వాడడం వలన బిగ్గరగా నవ్వుతారు. బిగ్గరగా నవ్వినప్పుడు కొన్నిసార్లు కన్నీరు కూడా రావచ్చు. మానవులలో నవ్వడాన్ని మెదడు నియంత్రిస్తుంది. నవ్వు కోపానికి విరుగుడు. మానవులలో నవ్వు, హాస్యానికి సంబంధించిన మానసిక, శరీరధర్మ శాస్త్ర ప్రభావాల్ని గురించి తెలిపే శాస్త్ర విజ్ఞానాన్ని "జెలోటాలజీ" అంటారు.