law education
-
న్యాయవిద్యలో మనమే లీడర్!
రాయదుర్గం (హైదరాబాద్): న్యాయ విద్యపరంగా భారత్ ప్రపంచ నాయకత్వ పాత్ర పోషించబోతోందని భారత అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి చెప్పారు. గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీ య ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లోని ‘స్కూల్ ఆఫ్ లా’లో మూట్ కోర్టు ప్రారంభోత్సవ కార్య క్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ విద్యను అందించే సంస్థల వైఫల్యం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. అమెరికా, యూరప్‌లలో అక్కడి న్యాయ విద్యాసంస్థల వైఫల్యంపై మేధావులు మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. కానీ భారతీయ న్యాయ విద్యావ్యవస్థ బాగా పని చేస్తోందని, అందుకే న్యాయ విద్యలో ప్రపంచ నాయకత్వ పాత్రను పోషించబోతోందని చెప్పారు. ఉర్దూ భాషలో న్యాయ విద్య భారతదేశ సాంస్కృతిక సంపద పెంపుదలకు బాటలు వేస్తుందని చెప్పారు. న్యాయ కళాశాలలు వాస్తవానికి న్యాయ ప్రయోగశాలలని, ఉర్దూ విశ్వవిద్యాలయంలో లా స్కూల్ విద్యార్థులకు ఉర్దూ భాష విలువైన ఆస్తిగా ఉంటుందని, ఇది వారికి ప్రత్యేకమైన అవకాశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. కొత్త చట్టాలను ఉర్దూలోకి అనువదించాలి‘మనూ’కి రాజ్యాంగ హోదా కల్పించడంతోపాటు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించాలని పట్నా సీఎన్ఎల్యూ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా కోరారు. ఉర్దూ వర్సిటీ లా స్కూల్ మూడు కొత్త నేర చట్టాలను ఉర్దూలోకి అనువదించే ప్రాజెక్టును ఆమోదించాలని అటార్నీ జనరల్‌ను కోరారు. ఈ అనువాద ప్రాజెక్టుకు తానే పనిచేస్తానని హమీ ఇచ్చారు. ఉర్దూ వర్సిటీ సర్వతోముఖాభివృద్ధికి ఎప్పుడూ కృషి చేస్తానని వర్సిటీ చాన్స్‌లర్ ముంతాజ్‌అలీ చెప్పారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్, రిజిస్ట్రార్‡ ఇష్తియాక్ ఆహ్మద్, లా స్కూల్ డీన్ తబ్రేజ్ అçహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
లా‘సెట్’ కావడం లేదు
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్యలో ప్రవేశాలు ఏటా ఆలస్యం అవుతూనే ఉన్నాయి. న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కాలేజీలకు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొనడంతో వేల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ల న్యాయవిద్య కోర్సుల్లో, ఎల్ఎల్ఎంలో ప్రవేశాలకు ఈ ఏడాది మే 25న లాసెట్ నిర్వహించగా, జూన్ 15న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫలితాలను ప్రకటించింది. ఇక బీసీఐ నుంచి అనుమతులు రాగానే కాలేజీల్లో ప్రవేశాలను చేపట్టేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. కానీ ఇప్పటివరకు ప్రవేశాలకు అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరో కోర్సులో చేరలేని పరిస్థితి.. రాష్ట్రంలోని 21 న్యాయవిద్యా కాలేజీల్లో 4,712 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే లాసెట్‌లో మాత్రం 15,793 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో ఎవరికి సీటు వస్తుందో, ఎవరికి రాదో తెలియని పరిస్థితి నెలకొంది. సకాలంలో ప్రవేశాలను నిర్వహిస్తే తాము మరొక కోర్సులోనైనా చేరే వీలుండేదని, ఇపుడు లాసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌కోసం ఎదురుచూస్తూ ఎక్కడా చేరలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు. పైగా సీటు రాకపోతే విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. 23,109 మంది దరఖాస్తు చేసుకుంటే.. రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 23,109 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో మే 25న నిర్వహించిన రాత పరీక్షకు 18,547 మంది హాజరయ్యారు. అందులో మూడేళ్ల లా కోర్సులో చేరేందుకు 16,332 మంది దరఖాస్తు చేసుకోగా 12,960 హాజరయ్యారు. వారిలో 11,563 మంది అర్హత సాధించారు. ఐదేళ్ల లా కోర్సుకు 4,580 మంది దరఖాస్తు చేసుకుంటే, 3,727 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. 2,401 మంది అర్హత సాధించారు. ఇక పీజీ లాకోర్సు కోసం లాసెట్ రాసేందుకు 2,197 మంది దరఖాస్తు చేసుకోగా, 1,860 మంది హాజరయ్యారు. 1,829 మంది అర్హత సాధించారు. ఇలా మొత్తంగా లాసెట్‌లో అర్హత సాధించిన 15,793 మంది విద్యార్థులకు ప్రవేశాల కౌన్సెలింగ్‌కోసం నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. -
లా కాలేజీల్లో పెరిగిన సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని లా కాలేజీల్లో సీట్లు పెరిగాయి. గతేడాది రాష్ట్రంలోని 21 కాలేజీల్లో 4,322 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి 4,712కు పెరిగాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్–2018 ఫలితాలను గురువారం ఆయన విడుదల చేశారు. అన్ని ప్రవేశ పరీక్షల్లో సీట్లు ఎక్కువగా, అభ్యర్థులు తక్కువగా ఉన్నారని, లాసెట్‌లో మాత్రం సీట్లు తక్కువగా ఉంటే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం లాసెట్‌లో 15,793 మంది అర్హత సాధించారని తెలిపారు. లాసెట్‌కు 23,109 మంది దరఖాస్తు చేశారని, వారిలో 18,547 మంది రాత పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. మూడేళ్ల లా కోర్సుకు 16,332 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 12,960 రాత పరీక్ష రాయగా, 11,563 మంది అర్హత సాధించారన్నారు. ఐదేళ్ల లా కోర్సుకు 4,580 మంది దరఖాస్తు చేసుకుంటే, 3,727 మంది రాత పరీక్షకు హాజరయ్యారని, 2,401 మంది అర్హత సాధించారన్నారు. పీజీ లా కోర్సుకు 2,197 మంది దరఖాస్తు చేసుకోగా, దాంట్లో 1,860 మంది హాజరైతే 1,829 మంది అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ లింబాద్రి, కార్యదర్శి ఎన్ శ్రీనివాస్‌రావు, లాసెట్ కన్వీనర్ ద్వారకానాథ్ తదితరులు పాల్గొన్నారు. -
విలువలను పెంపొందించండి
* న్యాయవిద్య పట్టభద్రులకు రాష్ట్రపతి పిలుపు * ఘనంగా నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవం సాక్షి, హైదరాబాద్ : ‘‘ప్రతిష్టాత్మకమైన నల్సార్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసించిన విద్యార్థులందరికీ అభినందనలు. ఉన్నతమైన న్యాయవాద వృత్తిని చేపట్టబోతున్న మీరు సమాజ శ్రేయస్సుకు పని చేస్తారని ఆకాంక్షిస్తున్నా. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ప్రాథమిక హక్కుల పరరిరక్షణ, సమానత్వం కోసం పాటుపడండి. ధనార్జనే ధ్యేయంగా భావించకుండా న్యాయవాద వృత్తికి ఉన్న విలువలను పెంపొందించండి’’అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. శామీర్‌పేట్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్(నల్సార్) యూనివర్సిటీలో శనివారం జరిగిన 12వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. న్యాయవాద పట్టభద్రులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఎందరో ప్రముఖులు న్యాయవాదులేనని గుర్తుచేశారు. న్యాయవిద్యను పూర్తి చేసిన పట్టభద్రులు మనదేశ సామాజిక, రాజకీయ వ్యవస్థలను ఆకళింపు చేసుకొని రుగ్మతలను రూపుమాపాలన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా విలువలను పరిరక్షిస్తూ వృత్తినిసాగించాలని విద్యార్థులకు సూచించారు. ప్రయోగాలు అవసరమే.. పదహారేళ్ల క్రితం ప్రారంభమైన తొలి న్యాయ విశ్వవిద్యాలయం నల్సార్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైందిగా పేరుగాంచిందన్నారు. న్యాయవిద్య వ్యవస్థీకృతమైనదే అయినప్పటికీ, ప్రయోగాల అవసరం కూడా ఎంతో ఉందన్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రవేశపెట్టిన పలు కోర్సులు న్యాయవ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాయని ప్రణ బ్ ప్రశంసించారు. వర్సిటీలో ఐదేళ్ల బీఏ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులతో పాటు ఎంబీఏ కోర్సులనూ ప్రవేశపెట్టిన వర్సిటీ అధికారులను ఆయన అభినందించారు. స్నాతకోత్సవం సందర్భంగా వివిధ లా కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. దేశంలోనే ప్రప్రథమం న్యాయవిద్యలో వస్తున్న నూతన ఒరవడులపై గ్రామీణ ప్రాంతాల్లో ఉండే న్యాయవాదులకు అవగాహన కల్పించే నిమిత్తం న్యాయ సహకార వ్యవస్థను దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో నెలకొల్పాలని సంకల్పించామని నల్సార్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ఫైజాన్ ముస్తఫా చెప్పారు. ఇటీవల వర్సిటీలో ప్రవేశపెట్టిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా విద్యార్థులు విభిన్నమైన నేరాలకు సంబంధించిన అంశాలను సులువుగా నేర్చుకునే వీలు కలిగిందన్నారు. ఘనంగా స్నాతకోత్సవం స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌తో పాటు సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. హైదరాబాద్ హైకోర్డు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్ కూడా అయిన క ళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా ఆధ్వర్యంలో స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. వివిధ లా కోర్సులను పూర్తి చేసిన 649 మంది విద్యార్థులకు చాన్స్‌లర్ పట్టాలను అందజేశారు. మొత్తం 48 బంగారు పతకాలు విద్యార్థులు సొంతం చేసుకోగా. వీటిలో ఐదేళ్ల బీఏఎల్ ఎల్బీ(ఆనర్స్) పూర్తి చేసిన విద్యార్థిని ప్రియం బదా దాస్‌కు ఏకంగా తొమ్మిది స్వర్ణ పతకాలు లభించాయి. కార్యక్రమంలో రిజిస్ట్రార్ విజేందర్‌కుమార్, న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
సామాన్యులకు సైతం న్యాయవిద్య అందాలి: రాష్ట్రపతి
హైదరాబాద్: దేశంలో సామాన్యులకు సైతం న్యాయవిద్య అందాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆకాంక్షించారు. నిష్పక్షపాతంగా ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ఉపన్యాసం చేసిన ఆయన విద్యారంగంలో పరిశోధనలను ప్రోత్సహించాలని సూచించారు. ఉన్నత విద్యలో సంస్కరణలు అవసరమన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేయాలన్నారు. న్యాయవృత్తిలో ఉన్నవాళ్లు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని ఉద్బోధించారు. అనంతరం ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.