భారత్ ప్రపంచ నాయకత్వ పాత్ర పోషించబోతోంది
భారత అటార్నీ జనరల్ వెంకటరమణి వెల్లడి
రాయదుర్గం (హైదరాబాద్): న్యాయ విద్యపరంగా భారత్ ప్రపంచ నాయకత్వ పాత్ర పోషించబోతోందని భారత అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి చెప్పారు. గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీ య ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లోని ‘స్కూల్ ఆఫ్ లా’లో మూట్ కోర్టు ప్రారంభోత్సవ కార్య క్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ విద్యను అందించే సంస్థల వైఫల్యం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.
అమెరికా, యూరప్‌లలో అక్కడి న్యాయ విద్యాసంస్థల వైఫల్యంపై మేధావులు మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. కానీ భారతీయ న్యాయ విద్యావ్యవస్థ బాగా పని చేస్తోందని, అందుకే న్యాయ విద్యలో ప్రపంచ నాయకత్వ పాత్రను పోషించబోతోందని చెప్పారు. ఉర్దూ భాషలో న్యాయ విద్య భారతదేశ సాంస్కృతిక సంపద పెంపుదలకు బాటలు వేస్తుందని చెప్పారు. న్యాయ కళాశాలలు వాస్తవానికి న్యాయ ప్రయోగశాలలని, ఉర్దూ విశ్వవిద్యాలయంలో లా స్కూల్ విద్యార్థులకు ఉర్దూ భాష విలువైన ఆస్తిగా ఉంటుందని, ఇది వారికి ప్రత్యేకమైన అవకాశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
కొత్త చట్టాలను ఉర్దూలోకి అనువదించాలి
‘మనూ’కి రాజ్యాంగ హోదా కల్పించడంతోపాటు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించాలని పట్నా సీఎన్‌ఎల్‌యూ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా కోరారు. ఉర్దూ వర్సిటీ లా స్కూల్ మూడు కొత్త నేర చట్టాలను ఉర్దూలోకి అనువదించే ప్రాజెక్టును ఆమోదించాలని అటార్నీ జనరల్‌ను కోరారు.
ఈ అనువాద ప్రాజెక్టుకు తానే పనిచేస్తానని హమీ ఇచ్చారు. ఉర్దూ వర్సిటీ సర్వతోముఖాభివృద్ధికి ఎప్పుడూ కృషి చేస్తానని వర్సిటీ చాన్స్‌లర్ ముంతాజ్‌అలీ చెప్పారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్, రిజిస్ట్రార్‡ ఇష్తియాక్ ఆహ్మద్, లా స్కూల్ డీన్ తబ్రేజ్ అçహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment