విలువలను పెంపొందించండి
* న్యాయవిద్య పట్టభద్రులకు రాష్ట్రపతి పిలుపు
* ఘనంగా నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
సాక్షి, హైదరాబాద్ : ‘‘ప్రతిష్టాత్మకమైన నల్సార్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసించిన విద్యార్థులందరికీ అభినందనలు. ఉన్నతమైన న్యాయవాద వృత్తిని చేపట్టబోతున్న మీరు సమాజ శ్రేయస్సుకు పని చేస్తారని ఆకాంక్షిస్తున్నా. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ప్రాథమిక హక్కుల పరరిరక్షణ, సమానత్వం కోసం పాటుపడండి. ధనార్జనే ధ్యేయంగా భావించకుండా న్యాయవాద వృత్తికి ఉన్న విలువలను పెంపొందించండి’’అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు.
శామీర్‌పేట్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్(నల్సార్) యూనివర్సిటీలో శనివారం జరిగిన 12వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. న్యాయవాద పట్టభద్రులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఎందరో ప్రముఖులు న్యాయవాదులేనని గుర్తుచేశారు. న్యాయవిద్యను పూర్తి చేసిన పట్టభద్రులు మనదేశ సామాజిక, రాజకీయ వ్యవస్థలను ఆకళింపు చేసుకొని రుగ్మతలను రూపుమాపాలన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా విలువలను పరిరక్షిస్తూ వృత్తినిసాగించాలని విద్యార్థులకు సూచించారు.
ప్రయోగాలు అవసరమే..
పదహారేళ్ల క్రితం ప్రారంభమైన తొలి న్యాయ విశ్వవిద్యాలయం నల్సార్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైందిగా పేరుగాంచిందన్నారు. న్యాయవిద్య వ్యవస్థీకృతమైనదే అయినప్పటికీ, ప్రయోగాల అవసరం కూడా ఎంతో ఉందన్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రవేశపెట్టిన పలు కోర్సులు న్యాయవ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాయని ప్రణ బ్ ప్రశంసించారు. వర్సిటీలో ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులతో పాటు ఎంబీఏ కోర్సులనూ ప్రవేశపెట్టిన వర్సిటీ అధికారులను ఆయన అభినందించారు. స్నాతకోత్సవం సందర్భంగా వివిధ లా కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు.
దేశంలోనే ప్రప్రథమం
న్యాయవిద్యలో వస్తున్న నూతన ఒరవడులపై గ్రామీణ ప్రాంతాల్లో ఉండే న్యాయవాదులకు అవగాహన కల్పించే నిమిత్తం న్యాయ సహకార వ్యవస్థను దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో నెలకొల్పాలని సంకల్పించామని నల్సార్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ఫైజాన్ ముస్తఫా చెప్పారు. ఇటీవల వర్సిటీలో ప్రవేశపెట్టిన చాయిస్ బేస్‌డ్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా విద్యార్థులు విభిన్నమైన నేరాలకు సంబంధించిన అంశాలను సులువుగా నేర్చుకునే వీలు కలిగిందన్నారు.
ఘనంగా స్నాతకోత్సవం
స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌తో పాటు సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. హైదరాబాద్ హైకోర్డు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్ కూడా అయిన క ళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా ఆధ్వర్యంలో స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. వివిధ లా కోర్సులను పూర్తి చేసిన 649 మంది విద్యార్థులకు చాన్స్‌లర్ పట్టాలను అందజేశారు. మొత్తం 48 బంగారు పతకాలు విద్యార్థులు సొంతం చేసుకోగా. వీటిలో ఐదేళ్ల బీఏఎల్ ఎల్‌బీ(ఆనర్స్) పూర్తి చేసిన విద్యార్థిని ప్రియం బదా దాస్‌కు ఏకంగా తొమ్మిది స్వర్ణ పతకాలు లభించాయి. కార్యక్రమంలో రిజిస్ట్రార్ విజేందర్‌కుమార్, న్యాయమూర్తులు పాల్గొన్నారు.