Laxman G
-
ప్రభుత్వం అంటే కేసీఆర్ ఒక్కడేనా?: బీజేపీ లక్ష్మణ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రిపబ్లిక్ వేడుకలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వేడుకల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు సైతం జారీ చేసింది. పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలు జరపాలని ఆదేశించింది. ఎక్కడ పరేడ్ నిర్వహించాలనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలని సూచించింది. ఇక, ఈ క్రమంలో బీజేపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కార్‌కు చెంపపెట్టు. రిపబ్లిక్ డే వేడుకలను అవమానిస్తున్నారు. కరోనా ఉందని సాకులు చెప్పడం హాస్యాస్పదం. పరేడ్‌తో గణతంత్ర దినోత్సవం చేయాలని హైకోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నాము. మీ పార్టీ సభలకి లేని కోడ్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మాత్రం పెట్టడం దారుణం. దేశం గర్వించదగ్గ వేడుకకి ఇలాంటి రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదు. మీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రతీ సంప్రదాయం కోర్టు ద్వారానే కాపాడాలంటే కష్టం. వేడుకలు రాజ్ భవన్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనికి సంబంధించి కేబినెట్ భేటీ ఎప్పుడు జరిగింది?. నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు?. ప్రభుత్వం అంటే కేసీఆర్ ఒక్కడేనా?. కేసీఆర్ ప్రభుత్వం పతనమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. 11,000 గ్రామాల కూడళ్లలో సమావేశాలు పెట్టి కేసీఆర్ మోసాలు ప్రజల వద్ద ఎండగడుతాము. రానున్న రోజుల్లో ప్రతీ నెలకు ఒకసారి తెలంగాణకు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వస్తూనే ఉంటారు. తెలంగాణపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది అని కామెంట్స్ చేశారు. -
పేరట్ @ః 25 నాటౌట్
రాజమండ్రి కార్పొరేషన్ : సమాజంలో చిలుక జోస్యాన్ని నమ్మేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ, ఈ చిత్రంలో కనిపించే చిలుక ఎవరికీ జోస్యం చెప్పకపోయినా..దాని ఆయుష్షు ఏ జోస్యానికీ అందనంత దీర్ఘంగా ఉండి అందరినీ ఆశ్చర్యృచకితులను చేస్తోంది. సాధారణంగా రామచిలుకల జీవితకాలం గరిష్టంగా అయిదేళ్లు కాగా దీని వయసు ఇప్పటికే అంతకు నాలుగురెట్లు ఎక్కువ. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్లో ఆంధ్రాబ్యాంకు ఏటీఎం పక్కన ఉన్న లక్ష్మణ్‌జీ ఇంటిలో పెరుగుతున్న ఈ చిలుకకు 12 ఏళ్ల వయసుండగా దీన్ని, మరో చిలుకనూ బెంగళూరులోని బంధువుల ఇంటి నుంచి తెచ్చారు. ఇక్కడకు వచ్చిన కొద్ది రోజులకే మరో చిలుక మరణించింది. అప్పటి నుంచీ లక్ష్మణ్‌జీ కుటుంబం దీన్ని శ్రద్ధగా సాకనారంభించారు. అన్ని చిలుకల్లాగానే జామ కాయలంటే పడిచచ్చే ఈ చిలుక వేరుశనగలు, మొక్కజొన్నలు కూడా దండిగా తింటుంది. కరకరలాడే జంతికలు, ఘుమఘుమలాడే కాఫీ దీని ఫేవరెట్ డిష్‌లు. గతంలో దానికి కాఫీ పుష్కలంగా ఇచ్చినా ప్రస్తుతం పెరిగిన వయసును దృష్టిలో పెట్టుకుని రేషన్ విధించారు. ఎంతో చనువుగా యజమానుల భుజాలపై వాలిపోయే ఈ చిలుక కొత్తవారు కనబడగానే.. వారి రాకను చాటుతూ ఒకటే పనిగా అరుస్తుంది. ఆదివారం నగరంలోని పశువుల ఆస్పత్రిలో ప్రపంచ జూనోసిస్ డే కార్యక్రమానికి దీన్ని లక్ష్మణ్‌జీ, ఆయన కుమారుడు రామకృష్ణ తీసుకువచ్చారు. రామ చిలుకల జీవితకాలం కేవలం నాలుగైదేళ్లు మాత్రమే అయి నా ఈ చిలుకను పెంచుతున్న వారు చూపే ప్రేమ, శ్రద్ధతో పాటు జన్యుపరమైన కారణాలు ఇంతకాలం బతకడానికి దోహదపడ్డాయని పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు చెప్పారు. వయసు పైబడడం వల్ల కాస్త రంగుమారినా మరో నాలుగైదేళ్లు బతుకుతుందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి హాజరైన మేయర్ పంతం రజనీ శేషసాయి.. కాలాన్ని గెలిచిన ఈ చిలుకను చూసి ముచ్చటపడి కాసేపు దానితో ఆడుకున్నారు.