సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రిపబ్లిక్ వేడుకలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వేడుకల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు సైతం జారీ చేసింది. పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలు జరపాలని ఆదేశించింది. ఎక్కడ పరేడ్ నిర్వహించాలనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలని సూచించింది.
ఇక, ఈ క్రమంలో బీజేపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కార్‌కు చెంపపెట్టు. రిపబ్లిక్ డే వేడుకలను అవమానిస్తున్నారు. కరోనా ఉందని సాకులు చెప్పడం హాస్యాస్పదం. పరేడ్‌తో గణతంత్ర దినోత్సవం చేయాలని హైకోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నాము.
మీ పార్టీ సభలకి లేని కోడ్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మాత్రం పెట్టడం దారుణం. దేశం గర్వించదగ్గ వేడుకకి ఇలాంటి రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదు. మీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రతీ సంప్రదాయం కోర్టు ద్వారానే కాపాడాలంటే కష్టం. వేడుకలు రాజ్ భవన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనికి సంబంధించి కేబినెట్ భేటీ ఎప్పుడు జరిగింది?. నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు?. ప్రభుత్వం అంటే కేసీఆర్ ఒక్కడేనా?. కేసీఆర్ ప్రభుత్వం పతనమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. 11,000 గ్రామాల కూడళ్లలో సమావేశాలు పెట్టి కేసీఆర్ మోసాలు ప్రజల వద్ద ఎండగడుతాము. రానున్న రోజుల్లో ప్రతీ నెలకు ఒకసారి తెలంగాణకు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వస్తూనే ఉంటారు. తెలంగాణపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment