
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసైసౌందరరాజన్, ప్రభుత్వం మధ్య విమర్శలపర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాటల దాడి మరింతగా పెరిగింది. గవర్నర్ తమిళిసై అటు పుదుచ్చేరిలో కూడా రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ క్రమంలో పుదుచ్చేరిలో కూడా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. 5 లక్షల మందితో సీఎం కేసీఆర్ బహిరంగ సభ పెట్టారు. కానీ, రిపబ్లిక్ డే వేడుకలకు మాత్రం కరోనాను సాకుగా చూపించారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. కేంద్రానికి నేను ఇవ్వాల్సిన రిపోర్టు పంపించాను. తెలంగాణలో అన్నీ అతిక్రమణలే. రాజ్యాంగ, రాజకీయ, చట్టపరమైన అతిక్రమణలు ఉన్నాయి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు తెలంగాణలో రాజ్‌భవన్ వేడుకల్లో పాల్గొన్న తమిళిసై కేసీఆర్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొందరికి నేను నచ్చకపోవచ్చు.. కానీ తెలంగాణ అంటే ఇష్టం. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం. కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికీ ఫార్మ్‌లు కావాలి. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.. తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి’ అంటూ ఆమె కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment