పేరట్ @ః 25 నాటౌట్
రాజమండ్రి కార్పొరేషన్ : సమాజంలో చిలుక జోస్యాన్ని నమ్మేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ, ఈ చిత్రంలో కనిపించే చిలుక ఎవరికీ జోస్యం చెప్పకపోయినా..దాని ఆయుష్షు ఏ జోస్యానికీ అందనంత దీర్ఘంగా ఉండి అందరినీ ఆశ్చర్యృచకితులను చేస్తోంది. సాధారణంగా రామచిలుకల జీవితకాలం గరిష్టంగా అయిదేళ్లు కాగా దీని వయసు ఇప్పటికే అంతకు నాలుగురెట్లు ఎక్కువ. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్లో ఆంధ్రాబ్యాంకు ఏటీఎం పక్కన ఉన్న లక్ష్మణ్‌జీ ఇంటిలో పెరుగుతున్న ఈ చిలుకకు 12 ఏళ్ల వయసుండగా దీన్ని, మరో చిలుకనూ బెంగళూరులోని బంధువుల ఇంటి నుంచి తెచ్చారు. ఇక్కడకు వచ్చిన కొద్ది రోజులకే మరో చిలుక మరణించింది.
అప్పటి నుంచీ లక్ష్మణ్‌జీ కుటుంబం దీన్ని శ్రద్ధగా సాకనారంభించారు. అన్ని చిలుకల్లాగానే జామ కాయలంటే పడిచచ్చే ఈ చిలుక వేరుశనగలు, మొక్కజొన్నలు కూడా దండిగా తింటుంది. కరకరలాడే జంతికలు, ఘుమఘుమలాడే కాఫీ దీని ఫేవరెట్ డిష్‌లు. గతంలో దానికి కాఫీ పుష్కలంగా ఇచ్చినా ప్రస్తుతం పెరిగిన వయసును దృష్టిలో పెట్టుకుని రేషన్ విధించారు. ఎంతో చనువుగా యజమానుల భుజాలపై వాలిపోయే ఈ చిలుక కొత్తవారు కనబడగానే.. వారి రాకను చాటుతూ ఒకటే పనిగా అరుస్తుంది. ఆదివారం నగరంలోని పశువుల ఆస్పత్రిలో ప్రపంచ జూనోసిస్ డే కార్యక్రమానికి దీన్ని లక్ష్మణ్‌జీ,
ఆయన కుమారుడు రామకృష్ణ తీసుకువచ్చారు. రామ చిలుకల జీవితకాలం కేవలం నాలుగైదేళ్లు మాత్రమే అయి నా ఈ చిలుకను పెంచుతున్న వారు చూపే ప్రేమ, శ్రద్ధతో పాటు జన్యుపరమైన కారణాలు ఇంతకాలం బతకడానికి దోహదపడ్డాయని పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు చెప్పారు. వయసు పైబడడం వల్ల కాస్త రంగుమారినా మరో నాలుగైదేళ్లు బతుకుతుందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి హాజరైన మేయర్ పంతం రజనీ శేషసాయి.. కాలాన్ని గెలిచిన ఈ చిలుకను చూసి ముచ్చటపడి కాసేపు దానితో ఆడుకున్నారు.