మూల్యం చెల్లించాల్సి వస్తుంది
విమోచన ఉత్సవాలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి లక్ష్మణ్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరించారు. ఈ ఉత్సవాన్ని ప్రభుత్వం జరిపే వరకు తమ పార్టీ పోరాటం సాగిస్తుందన్నారు. శనివారం హైదరాబాద్ విమోచన దినం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విధానాలకు భిన్నంగా రాష్ట్రంలో కుటుంబపాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
దత్తాత్రేయ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలను కేసీఆర్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విస్మరించడం తగదని అన్నారు. కార్యక్రమంలో బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు, పార్టీనాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, బద్ధం బాల్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, యెండల లక్ష్మీనారాయణ, దినేష్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అయితే బీజేఎల్పీ కార్యాలయం లోపల బీజేపీ నేతలు జాతీయ జెండాను ఎగురవేశారు.