ప్రావీణ్యత చాటేవారే నాయకులు
- కేంద్ర మంత్రి వెంకయ్య
- లక్ష్మీప్రసాద్ ‘నాయక త్రయం’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్: కేవలం రాజకీయ నాయకుడే నాయకుడు కాలేడని, ఒక రంగంలో ప్రావీణ్యతను చాటే ప్రతి ఒక్కరూ నాయకులవుతారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. భారత్‌లో తెలివైన వారికి కొదవ లేదని, ఆ తెలివితేటలకు కొంత సానపెడితే దేశం ఉజ్వలంగా వెలిగిపోతుందన్నారు. ఆదివారమిక్కడి ఓ హోటల్లో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘నాయక త్రయం’ పుస్తకాన్ని తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యతో కలసి ఆయన ఆవిష్కరించారు. రచయితలకు సామాజిక స్పృహ ఉండాలని, రచనల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని వెంకయ్య హితవు పలికారు. పత్రికలు, చానళ్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఇప్పుడు హెడ్డింగ్‌లు చేసి వదిలేసే ప్రక్రియ మొదలైందని, ఇది మంచిది కాదన్నారు. ఇటీవల ఎకనామిక్ టైమ్స్ పత్రికలో కె.ఎం.మున్షి, అశుతోష్ ముఖర్జీలు జనసంఘ్ నాయకులంటూ హెడ్డింగ్ పెట్టారన్నారు.
వాస్తవానికి మున్షి కాంగ్రెస్ నేతని, కేంద్రమంత్రిగా పనిచేయడంతో పాటు భారతీయ విద్యాభవన్ సంస్థలను ప్రారంభించారని, ఆయన ఎప్పుడూ జనసంఘ్‌లో పనిచేయలేదన్నారు. అలాగే శ్యామప్రసాద్ ముఖర్జీ తండ్రి అశుతోష్ ముఖర్జీ 1924లోనే చనిపోయారని, 1952లో శ్యామప్రసాద్ జనసంఘ్ స్థాపించారన్నారు. ఇటీవల కొంతమంది పనిగట్టుకొని పరమతసహనం గురించి ఉపన్యసిస్తున్నారని, చిన్నచిన్న ఘటనలను భూతద్దంలో చూపిస్తూ దేశ ప్రతిష్ట దిగజారుస్తున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీలో లక్షలాది మంది జైళ్లలో మగ్గినప్పుడు, 1984లో వేలాది మంది సిక్కులు ఊచకోతకు గురైనప్పుడు వీళ్ల గొంతులు ఏమయ్యాయన్నారు. లక్ష్మీప్రసాద్ బహుభాషా కోవిదుడని కొనియాడారు. ఉత్తరాదివారితో పోటీపడటం అంత సులువు కాదని, అలాంటి తరుణంలో వారితో పోటీపడి ఆయన రెండు డాక్టరేట్లు, రెండు సాహితీ అకాడమీ అవార్డులు సాధించారన్నారు.
ఈ పుస్తకంలో వాజ్‌పేయి, అద్వానీ, మోదీ చరిత్రలు ఉన్నాయని, వారి జీవితాలు రానున్న తరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. వాజ్‌పేయి సిద్ధాంతాలకు రాజీపడకుండా నిలబడ్డారని, అద్వానీ మేరునగధీరుడని, మోదీ దేశ చరిత్రలో కొత్తగా ఉద్భవించిన నేత అని కొనియాడారు. నేటి ఎంపీలకు పార్లమెంటులో గ్రంథాలయం ఉందన్న విషయం కూడా తెలియదని ఎద్దేవా చేశారు. రోజురోజుకు సాహిత్యం అందించే వారి సంఖ్య తగ్గిపోతోందని, సినారె తర్వాత ఎవరని ఊహించుకుంటేనే భయమేస్తుందన్నారు. సినీ నటుడు నాగార్జున, ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి, రచయిత కృష్ణారావు, ఎమెస్కో పబ్లిషర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.