lbw Stadium
-
సమైక్య శంఖారావం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని తెలిపారు. మరోపక్క స్టేడియం లోపలకు ప్రవేశించి ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలకు ప్రత్యేక ప్రవేశాలు కేటాయించారు. మళ్లింపులు ఇలా... నాంపల్లి, పోలీసు కంట్రోల్‌రూమ్‌ల వైపు నుంచి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ చౌరస్తా నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. సుజాత స్కూల్, చర్మాస్‌ల వైపు నుంచి వచ్చే వాహనాలు బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీటిని గన్‌ఫౌండ్రి ఎస్బీహెచ్ నుంచి అబిడ్స్ వైపు పంపిస్తారు. సిమెట్రీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ వైపు పంపిస్తారు. రాజ్‌మొహల్లా రోడ్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనాలను సిమెట్రీ నుంచి మళ్లిస్తారు. బొగ్గులకుంట, తాజ్ మహల్, ఈడెన్‌గార్డెన్స్, కింగ్ కోఠి వైపు నుంచి వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ వైపు అనుమతించరు. వీటిని కింగ్ కోఠి క్రాస్‌రోడ్స్ నుంచి అబిడ్స్ తాజ్‌మహల్ హోటల్ వైపు మళ్లిస్తారు. అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి బషీర్‌బాగ్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను లిబర్టీ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు. రవీంద్రభారతి, నాంపల్లి వైపుల నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ కంట్రోల్‌రూమ్ మీదుగా బషీర్‌బాగ్ వైపు అనుమతించరు. సాధారణ వాహనచోదకులు స్టేడియానికి నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మాసబ్‌ట్యాంక్, వీవీ స్టాట్యూ, ట్యాంక్‌బండ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఏంజే మార్కెట్ మార్గాలను ఎంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నగర పోలీసులు విధించిన ఆంక్షలకు నగరవాసులు, సభకు తరలి వచ్చే వారు సహకరించాలని పోలీసులు కోరారు. నిబంధనలను కచ్చితంగా పాటించి కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించాలని సూచించారు. -
‘సమైక్య శంఖారావం’ పార్కింగ్స్, మార్గాలు
సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వస్తారని భావిస్తున్న పోలీసులు దీనికి విస్తృత బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ నగరంలోని ప్రవేశించాక అనుసరించడం కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ వసతులు కల్పించారు. స్టేడియం చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో కేటాయించిన ప్రాంతాల మినహా మిగిలిన చోట్ల నిలుపుకోవాల్సిన వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద దిగిపోవాలి. అక్కడ నుంచి వాహనాలు వాటికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలి. కార్యకర్తలు, అభిమానులు మాత్రం కాలినడకన వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. సభ పూర్తయిన తరవాత సైతం ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద నుంచే తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. సహాయసహకారాలు, సూచనలు కోసం విధుల్లో ఉండే వాలంటీర్లు, ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని సంప్రదించవచ్చు. మార్గాలు, పార్కింగ్స్ ఇలా... కడప, చిత్తూరు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి వచ్చే బస్సులు, తేలికపాటి వాహనాలు జూ పార్క్, బహదూర్‌పుర, పేట్లబురుజు, సిటీ కాలేజ్, హైకోర్టు, నయాపూల్, ఉస్మానియా ఆస్పత్రి, బేగంబజార్ మీదుగా ఎంజే మార్కెట్ వద్దకు చేరుకోవాలి. ఇక్కడ కార్యకర్తల, అభిమానుల్ని దింపాల్సి ఉంటుంది. వాహనాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పాతబస్తీలోని కులీకుతుబ్‌షా స్టేడియం, పేట్లబురుజులోని సిటీ ఆర్డ్మ్ రిజర్వ్ హెడ్-క్వార్టర్స్, గోషామహల్ పోలీసుస్టేడియంల్లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. గోషామహల్ స్టేడియం కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తారు. -
‘ఏడు’ దాటేదెలా?
సాక్షి, సిటీబ్యూరో: 7/9.. శనివారం.. ఎలా గడుస్తుందోనని నగర పోలీసులకు టెన్షన్ పట్టుకొంది. ఓవైపు అనుమతి ఉన్న ఏపీ ఎన్జీవోల సభ.. మరోవైపు, దాన్ని అడ్డుకొంటామని ఓయూ జేఏసీ హెచ్చరిక.. ఇంకోవైపు అనుమతి లేని టీఎన్జీవోల ర్యాలీ.. ఈ నేపథ్యంలో ఏం జరగనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు అనుమతించడం.. దీన్ని అడ్డుకుంటామని కొందరు, అదే రోజు అనుమతి లేకున్నా శాంతి ర్యాలీ నిర్వహిస్తామని మరికొందరు ప్రకటించడంతో పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ రోజు అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరాన్ని అష్టదిగ్భంధనం చేయనున్నారు. మొత్తం మూడు వేలకు పైగా సిబ్బందిని శనివారం తెల్లవారుజాము నుంచే ఎల్బీ స్టేడియం పరిసరాల్లో మోహరించనున్నారు. ఓయూపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు చుట్టపక్కల ప్రాంతాల్లో దాదాపు వేయి మందిని నియమించనున్నారు. వర్సిటీ మీదుగా వెళ్లే రహదారుల్ని తాత్కాలికంగా మూసేయనున్నారు. అలాగే, సికింద్రాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రాలతో పాటు ఇందిరాపార్క్ వద్ద బలగాలను మోహరిస్తున్నారు. పికెట్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. స్టేడియం చుట్టూ ప్రత్యేక దృష్టి.. గతానుభవాల దృష్ట్యా ఆందోళనకారుల ముసుగులో అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ప్రత్యేకంగా రూఫ్ టాప్ వాచ్, మూడంచెల కార్డన్ ఏరియాలను ఏర్పాటు చేయనున్నారు. నగర కమిషరేట్‌లోని అందరు సిబ్బందికి ‘స్టాండ్ టు’ ప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రాంతాల్లో అశ్వక దళాలు, గ్యాస్ స్వ్కాడ్స్, వాటర్ క్యానన్స్, వజ్ర వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. అవసరమైతే ట్రాఫిక్‌ను నియంత్రించాలని యోచిస్తున్నారు. అనుమానితుల్ని ముందుస్తు అరెస్టులు సైతం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు సైతం బయటి ప్రాంతాల నుంచి పెద్ద స్థాయిలో అనుమానితులెవ్వరూ నగరంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటన్నారు. ఏపీఎన్జీవోల్ని గుర్తించేదెలా..? ఏపీఎన్జీవోల సభకు కేవలం గుర్తింపు కార్డులు ఉన్న ఉద్యోగుల్ని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. అయితే గుర్తింపు కార్డుల్లో సదరు వ్యక్తి పేరు, హోదా తదితర వివరాలు మినహా ఏ ప్రాంతానికి చెందిన వారన్నది ఉండదు. ఈ నేపథ్యంలో టీఎన్జీవో వారూ హాజరయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు.. ఈ సమస్యను అధిగమించడంపై దృష్టి పెట్టారు. సభకు వచ్చే వారికి ప్రత్యేక పాసులు ఇస్తామంటూ ఏపీఎన్జీవోలు చెప్పడం కాస్త ఊరట కలిగించే అంశమైనా.. పోలీసులు సైతం కొన్ని ఏర్పాట్లు చేయనున్నారు.