‘ఏడు’ దాటేదెలా?
సాక్షి, సిటీబ్యూరో: 7/9.. శనివారం.. ఎలా గడుస్తుందోనని నగర పోలీసులకు టెన్షన్ పట్టుకొంది. ఓవైపు అనుమతి ఉన్న ఏపీ ఎన్జీవోల సభ.. మరోవైపు, దాన్ని అడ్డుకొంటామని ఓయూ జేఏసీ హెచ్చరిక.. ఇంకోవైపు అనుమతి లేని టీఎన్జీవోల ర్యాలీ.. ఈ నేపథ్యంలో ఏం జరగనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్‌బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు అనుమతించడం.. దీన్ని అడ్డుకుంటామని కొందరు, అదే రోజు అనుమతి లేకున్నా శాంతి ర్యాలీ నిర్వహిస్తామని మరికొందరు ప్రకటించడంతో పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఆ రోజు అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరాన్ని అష్టదిగ్భంధనం చేయనున్నారు. మొత్తం మూడు వేలకు పైగా సిబ్బందిని శనివారం తెల్లవారుజాము నుంచే ఎల్బీ స్టేడియం పరిసరాల్లో మోహరించనున్నారు. ఓయూపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు చుట్టపక్కల ప్రాంతాల్లో దాదాపు వేయి మందిని నియమించనున్నారు. వర్సిటీ మీదుగా వెళ్లే రహదారుల్ని తాత్కాలికంగా మూసేయనున్నారు. అలాగే, సికింద్రాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రాలతో పాటు ఇందిరాపార్క్ వద్ద బలగాలను మోహరిస్తున్నారు. పికెట్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు.
స్టేడియం చుట్టూ ప్రత్యేక దృష్టి..
గతానుభవాల దృష్ట్యా ఆందోళనకారుల ముసుగులో అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ప్రత్యేకంగా రూఫ్ టాప్ వాచ్, మూడంచెల కార్డన్ ఏరియాలను ఏర్పాటు చేయనున్నారు. నగర కమిషరేట్‌లోని అందరు సిబ్బందికి ‘స్టాండ్ టు’ ప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రాంతాల్లో అశ్వక దళాలు, గ్యాస్ స్వ్కాడ్స్, వాటర్ క్యానన్స్, వజ్ర వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. అవసరమైతే ట్రాఫిక్‌ను నియంత్రించాలని యోచిస్తున్నారు. అనుమానితుల్ని ముందుస్తు అరెస్టులు సైతం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు సైతం బయటి ప్రాంతాల నుంచి పెద్ద స్థాయిలో అనుమానితులెవ్వరూ నగరంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటన్నారు.
ఏపీఎన్జీవోల్ని గుర్తించేదెలా..?
ఏపీఎన్జీవోల సభకు కేవలం గుర్తింపు కార్డులు ఉన్న ఉద్యోగుల్ని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. అయితే గుర్తింపు కార్డుల్లో సదరు వ్యక్తి పేరు, హోదా తదితర వివరాలు మినహా ఏ ప్రాంతానికి చెందిన వారన్నది ఉండదు. ఈ నేపథ్యంలో టీఎన్జీవో వారూ హాజరయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు.. ఈ సమస్యను అధిగమించడంపై దృష్టి పెట్టారు. సభకు వచ్చే వారికి ప్రత్యేక పాసులు ఇస్తామంటూ ఏపీఎన్జీవోలు చెప్పడం కాస్త ఊరట కలిగించే అంశమైనా.. పోలీసులు సైతం కొన్ని ఏర్పాట్లు చేయనున్నారు.