3వ రోజూఅదే సీన్..
* స్తంభించిన పార్లమెంటు ఉభయ సభలు
* సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిన లోక్‌సభ
* వైఎస్సార్‌సీపీ సహా 3 అవిశ్వాస తీర్మానం నోటీసులు
* రాజ్యసభలోనూ సేమ్ సీన్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలూ వరుసగా మూడోరోజు కూడా సమైక్యాంధ్ర, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో దద్దరిల్లాయి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు సభలను స్తంభింపజేశారు. దీంతో పొడిగించిన శీతాకాల సమావేశాల మొదటివారం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినట్టయింది. శుక్రవారం లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతోపాటు, దీనిపై చర్చ కోరుతూ వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీ జి.వి.హర్షకుమార్, టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కూడా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు.
* ఉదయం 11 గంటలకు స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించగానే సభలో సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తాయి. ఇదే సమయంలో మంత్రి చిరంజీవి తన శాఖకు చెందిన నివేదికను ప్రవేశపెట్టారు.
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవెరైడ్డిలు వెల్‌లోకి దూసుకువెళ్లి సమైక్య నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు కూడా నినాదాలు చేశారు.
* ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు తమ ప్రాంత సమస్యలపై వెల్‌లో ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు.
* నినాదాలు కొనసాగుతూ సభ అదుపులోకి రాకపోవడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు సభ వారుుదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత కూడా వెల్‌లో వైఎస్సార్‌సీపీ సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తించగా మరోవైపు తెలంగాణ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు తెలంగాణ నినాదాలు చేశారు.
* ఈ సమయంలోనే స్పీకర్ అవిశ్వాస తీర్మానం నోటీసులు ప్రస్తావించారు. సభ అదుపులో లేకపోవడంతో వాటిని పరిశీలించలేక పోతున్నానని ప్రకటించారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు.
* రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చైర్మన్ హమీద్ అన్సారీ మాట్లాడుతూ ‘రోజూ సభ్యులు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేస్తుండడంతో సభాకార్యక్రమాలకు అంతరాయం కలుగుతోంది. సభ కొనసాగేందుకు సహకరించాలి’ అని విజ్ఞప్తి చేశారు. సభ్యులు విన్పించుకోకుండా నినాదాలు కొనసాగిస్తుండటంతో తొలుత 2.30 గంటల వరకు, తర్వాత సోమవారానికి రాజ్యసభ వారుుదా పడింది.
* తమిళ జాలర్లపై శ్రీలంక నౌకాదళ వేధింపుల అంశం కూడా పార్లమెంటు ఉభయ సభల్లోనూ గందరగోళానికి కారణమయింది.
జాతీయ నేతలతో జగన్ భేటీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పార్లమెంటులో పలువురు జాతీయ పార్టీల నేతలను కలసి సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని కోరారు. జేడీయూ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ నేత శరద్‌పవార్, బీజేడీ ఎంపీ జయ్ పండాలను విడివిడిగా కలసి మద్దతు కోరారు.