కిషిదా వారసుడెవరో!
జపాన్ అధికార పార్టీ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) ప్రతి మూడేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని నడిపేందుకు తమ నాయకుడిని ఎన్నుకుంటుంది. ప్రధాని ఫుమియో కిషిదా 2021లో ఎల్డీపీ నేతగా ఎన్నికై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మూడు పర్యాయాలు పదవి చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజాదరణ తక్కువగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని కిషిదా తాను మరోమారు ప్రధాని పదవికి పోటీపడటం లేదని చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. అక్టోబర్ ఒకటిన కిషిదా, ఆయన కేబినెట్ రాజీనామా చేయనుంది. అదేరోజు పార్లమెంటు ఆమోదముద్ర పడ్డాక కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కిషిదా ని్రష్కమణ నేపథ్యంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వానికి తీవ్ర పోటీ నెలకొంది. శుక్రవారం జరిగే ఎన్నికలో ఏకంగా తొమ్మిది మంది బరిలో ఉన్నారు. వీరిలో కొందరు ప్రస్తుత కేబినెట్ మంత్రులు కాగా.. మరికొందరు మాజీ మంత్రులు. దిగువసభ కాలావధి 2025 అక్టోబర్ వరకు ఉన్నప్పటికీ.. కొత్త ప్రధానిగా ఎన్నికైన వారు తమ కొత్త ఇమేజ్ను ఉపయోగించుకొని.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు. ప్రధాని పదవి చేపట్టాక కొద్ది వారాల్లోనే ఎన్నికలకు వెళతామని చాలా మంది పోటీదారులు బాçహాటంగానే చెప్పారు. ఓటింగ్ జరిగేదిలా.. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వ ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఎల్డీపీకి 368 మంది ఎంపీల బలముంది. ఎంపీకి ఒక ఓటు ఉంటుంది. 11 లక్షల ఎల్డీపీ సభ్యుల ప్రాధామ్యాలకు అనుగుణంగా మరో 368 ఓట్లను పోటీపడుతున్న అభ్యర్థులకు కేటాయిస్తారు. అంటే తొలిరౌండ్లో మొత్తం 736 ఓట్లు ఉంటాయి. మొదటిరౌండ్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఏకంగా తొమ్మిది మంది బరిలో ఉండటంతో తొలిరౌండ్లో ఏ ఒక్కరూ 50 శాతం ఓట్లను సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారమే రెండో రౌండ్ ఓటింగ్ జరుగుతుంది. మొదటిరౌండ్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు తదుపరి రౌండ్ ఓటింగ్‌కు అర్హత సాధిస్తారు. ఈ రౌండ్లో 368 మంది ఎంపీలకు తోడు 47 మంది స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు ఓటింగ్‌కు అర్హులు. మొత్తం 415 ఓట్లు ఉంటాయి. తమ పరిధిలోని మెజారిటీ పార్టీ సభ్యులు ఎవరివైపు మొగ్గుచూపారో దానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు తమ ఓటు వేస్తారు. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కిషిదా కుర్చీ కోసం తొమ్మిది మంది రేసులో నిలిచినా.. ప్రధానంగా పోటీ ముగ్గురి మధ్యే ఉందని పలు పోల్ సర్వేలు చెబుతున్నాయి. మాజీ రక్షణమంత్రి షిగెరూ ఇషిబా, మాజీ పర్యావరణ మంత్రి షిన్‌జిరో కొయిజుమీ, ఆర్థిక భద్రత మంత్రి తకైచీ సనయీలు ముందంజలో ఉన్నారు. యోషిమాసా హయాíÙ, తకయుకి కొబయాషి, తొషిమిత్సు మొతెగి, యోకో కమికావా, టారో కోనో, కత్సునోబు కటో.. మిగతా పోటీదారులు. టాప్–3 పోటీదారుల వివరాలిలా ఉన్నాయి...షిగెరూ ఇషిబా (67): ఆపత్కాలంలో అనుభవజు్ఞడు ఇషిబా మాజీ బ్యాంకర్. ఎల్డీపీ నాయకత్వానికి ఆయన పోటీపడటం ఇది ఐదోసారి. ఇదే తన చివరి ప్రయత్నమని ప్రకటించారు. 1986లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన ఇషిబా రక్షణ, వ్యవసాయ శాఖలతో పాటు పలు మంత్రిత్వ శాఖలు చూశారు. పార్టీ పదవుల్లోనూ పనిచేశారు. ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ.. తోటి ఎంపీల నుంచి ఆశించినంత మద్దతు కూడగట్టుకోలేకపోయారు. ఏడాది కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విపక్ష కాన్సిట్యూషనల్ డెమొక్రాటిక్ పార్టీ మాజీ ప్రధాని యోషిహికో నోడాను తమ నాయకుడిగా ఎన్నుకుంది. వాగ్ధా్దటితో ప్రజలను ఆకట్టుకునే నోడాను ఎదుర్కొనడానికి ఇషిబా అనుభవం, విషయ పరిజ్ఞానం, నైపుణ్యం అక్కరకొస్తాయని ఎల్డీపీ భావిస్తోంది. రక్షణ విధానాల రూపకల్పనలో నిపుణుడిగా ఇషిబాకు పేరుంది. నాటో రక్షణ కూటమి లాంటిది ఆసియాకూ ఉండాలని ఇషిబా ప్రతిపాదించారు. షిన్‌జిరో కొయిజుమీ (43): నాలుగోతరం వారసుడు ప్రజాదరణ పొందిన మాజీ ప్రధాని జునిచితో కొయిజుమీ కుమారుడే షిన్‌జిరో. కొయిజుమీ రాజకీయ వారసత్వంలో నాలుగోతరం నాయకుడు. శుక్రవారం ఎన్నికల్లో నెగ్గితే జపాన్‌కు అత్యంత పిన్న వయసు్కడైన ప్రధానిగా రికార్డులకెక్కుతారు. 2009లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. షింజో అబే కేబినెట్లో 2019– 2021 మధ్య పర్యావరణ మంత్రిగా పనిచేశారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి రాజనీతిశాస్త్రంలో మాస్టర్స్ చేసిన షిన్‌జిరో ప్రముఖ టీవీ యాంకర్ తకిగవా క్రిస్టెల్ను వివాహమాడారు. ఇతర పోటీదారులతో పోలి్చనపుడు అనుభవం పెద్దగా లేకున్నా.. ఎల్డీపీ శ్రేణుల్లో ఆదరణ ఉంది. మాజీ ప్రధాని యోషిహిడే సుగా మద్దతు ఉంది. సంస్కరణ వాది. పితృత్వపు సెలవును ప్రమోట్ చేయడానికి 2020లో స్వయంగా రెండు వారాలు సెలవు తీసుకున్నారు. జపాన్– అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేస్తానని, పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయడానికి భావసారూప్యత కలిగిన దేశాలతో కలిసి పనిచేస్తానని షిన్‌జిరో చెబుతారు. రెండోరౌండ్ వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అనుభవలేమి ఒక్కటే ప్రతికూలత.తకైచీ సనయీ (63): సంప్రదాయవాది తకైచీ గెలిస్తే జపాన్‌కు తొలి మహిళా ప్రధానమంత్రి అవుతారు. మాజీ ప్రధాని షింజో అబే అనుయాయురాలు. సంప్రదాయవాది. రైట్ వింగ్ మద్దతు ఉంది. 2021లో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వం కోసం కిషిదాతో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే సా«ధనసంపత్తిని బలోపేతం చేయడం, ఆహార భద్రత, సైనిక సామర్థ్యం పెంపుదల, పంపిణీ వ్యవస్థల బలోపేతం.. ఇవి తకైచీ ప్రధాన హామీలు. స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తారు. పురుషులనే వారసులుగా పరిగణించే రాజకుటుంబ సంప్రదాయాన్ని బలపరుస్తారు. టీవీ యాంకర్‌గా పనిచేసిన తకైచీ తొలిసారిగా 1993లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రిగా పనిచేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ తనకు రోల్ మోడల్ అని చెబుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్