పొత్తూ గిత్తూ జాన్తా నై!
ఒకపక్క పొత్తులపై చర్చలు కొనసాగుతుండగానే మరోవైపు బీజేపీ నాయకులు తమ నామినేషన్లు తాము వేసేసుకుంటున్నారు. పొత్తూ గిత్తూ జాన్తా నై అంటూ మండిపడుతున్నారు. బీజేపీ జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ హైదరాబాద్ వచ్చి పొత్తు విషయమై చర్చలు జరుపుతుండగానే పార్టీ కార్యకర్తలు పలువురు బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ధర్నాకు దిగారు. కిషన్ రెడ్డి అంబర్పేట నుంచి పోటీ చేయాలని, సూర్యాపేట టికెట్ సంకినేనికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు, పొత్తుతో సంబంధం లేకుండా మహబూబ్నగర్ జిల్లాలో అన్ని స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయాలని ఆ జిల్లా బీజేపీ నాయకులు నిర్ణయించారు. కోరుకున్న స్థానాలు ఇవ్వకపోతే అసలు పొత్తే వద్దని స్పష్టం చేస్తున్నారు.
ఇవన్నీ ఇలా ఉండగా.. తెలుగుదేశం పార్టీతో పొత్తులపై శనివారం నాడు స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. పొత్తులపై రెండు పార్టీల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, అధికారికంగా ఇంతవరకు తమ పార్టీ అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని ఆయన తెలిపారు. తమ పార్టీ జాతీయ నేతలు హైదరాబాద్లో ఉన్నారని, అందువల్ల పొత్తులపై స్పష్టత వస్తుందని చెప్పారు.