కళ్లులేని బ్యాట్ బాయ్ చూస్తున్నాడు
లండన్: ‘ప్రాక్టీస్ మేక్స్ ది మేన్ పర్ఫెక్ట్’ అంటారు. చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే అంధులు కూడా చూడగలరని నిరూపిస్తున్నారు బర్మింగమ్కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు రూబెన్ గ్రహమ్ మారిస్. అరుదైన జన్యు లోపం కారణంగా రూబెన్‌కు నెలల వయస్సులోనే రెండు కళ్లు కనిపించకుండా పోయాయి. పిన్న వయస్సులోనే చూపు పోతే జీవితం అంధకారం అవుతుందని ఆందోళన చెందిన రూబెన్ తల్లి ట్రూడీ గ్రాహం, తన కుమారుడికి చూపు తెప్పించడం కోసం పలు ఆస్పత్రులు తిరిగింది. ‘లెబర్స్ కాన్జెనిటల్ అమౌరోసిస్’ అనే జన్యుపరమైన జబ్బు కారణంగా చూపు కోల్పోయాడని, తిరిగి చూపు తెప్పించడం అసాధ్యమని డాక్టర్లు తేల్చారు.
కళ్లు కనిపించకున్నా స్వతంత్య్రంగా జీవించడంలో శిక్షణ ఇచ్చే వారెవరైనా ఉన్నారా? అంటూ వెబ్సైట్లన్నీ వెతకడం ప్రారంభించింది సోషల్ కేర్ వర్కర్‌గా పనిచేస్తున్న ట్రూడీ. ఇలాంటి వారికి ‘ఎకోలొకేషన్’ పద్ధతి ద్వారా పరిసరాలను పర్ఫెక్ట్గా గుర్తించడంలో ‘వరల్డ్ యాక్సెస్ ఫర్ ది బ్లైండ్’ అధ్యక్షులు డేనియల్ కిష్ అమెరికాలో శిక్షణ ఇస్తున్నారని ఆమె తెలసుకొంది. నానా ప్రయాసాలుపడి కొడుకును అమెరికా తీసుకెళ్లింది. అందరూ బ్యాట్‌మేన్‌గా పిలిచే డేనియల్ కిష్ వద్ద ‘ఎకోలొకేషన్’ శిక్షణ పొందిన రూమన్ ఏడాదిలోనే ఎవరూ ఊహించని పురోగతి సాధించాడు. ఇప్పుడు ఆ బాలుడు ఎవరి సహాయం లేకుండానే చెట్టూ పుట్ట తిరగగలడు. పరిసర ప్రాంతాలను పక్కాగా గుర్తించగలడు. కళ్ల ముందు కదిలాడే ఆకారం ఏమిటో కళ్లతో చూసినట్టుగానే చెప్పగలడు. తన పనులు తాను చక్కగా చేసుకోగలడు. ఇదంతా సాధ్యమైందీ ‘ఎకోలొకేషన్’ శిక్షణ వల్లనేనని తల్లి ట్రూడీ తెలిపారు.
ఎకోలొకేషన్ అంటే ప్రతిధ్వనుల ద్వారా పరిసరాలను గుర్తించడం. నాలుకద్వారా శబ్దాలు చేయడం, చేతికర్రను నేలపై కొట్టడం లేదా రెండు చేతులతో చప్పట్లు కొట్టడం ద్వారా వచ్చే ప్రతిధ్వనులను చెవి ద్వారా పసిగట్టి పరిసరాల్లో ఏ వస్తువుందో, ఏ ఆకారముందో, అది ఏ సైజులో ఉందో గుర్తించడం. ప్రతి ధ్వనుల కోసం శబ్దం చేయడాన్ని వెజ్ఞానిక పరిభాషలో ‘ఫొనాన్స్’ అంటారు. గబ్బిలాలు (బ్యాట్స్) కూడా ప్రతిధ్వనులను గుర్తించే చీకట్లో చక్కగా వేటాడగలవు, తిరగగలవు.
రూబెన్‌కు శిక్షణ ఇస్తున్న డేనియల్ కిష్కు కూడా కళ్లు కనిపించవు. క్యాన్సర్ కారణంగా ఆయనకు 13 నెలల వయస్సులోనే కంటి చూపు పూర్తిగా పోయింది. కానీ శిక్షణ ద్వారా ఆయన తన తోటి ప్రపంచానికి వెలుతురు పంచుతున్నారు. అందుకే ఆయన్ని అందరూ బ్యాట్‌మేన్ అని పిలుస్తుండగా, రూబెన్‌ను బ్యాట్ బాయ్ అని పిలుస్తున్నారు. వాస్తవానికి గబ్బిలాలకు కళ్లు ఉన్నట్టే బ్యాట్ మేన్‌కు కళ్లుంటాయి. చాలామంది గబ్బిలాలకు కళ్లుండవని పొరపాటు పడతారు. అయితే వాటి కళ్లు చీకట్లో చూడలేవు. రాత్రిపూట శబ్దాల ప్రతిధ్వనుల ద్వారానే పరిసరాలను పసిగట్టగలవు. గబ్బిలాల తర్వాత ఇలాంటి విద్య డాల్ఫిన్స్‌కు ఉంది.
చూపున్న మనం మాత్రం పరిసరాలను ఎలా చూడగలం ? వాటి మీద పడిన కాంతి అక్కడి నుంచి మన కళ్ల రెటీనాపై రిఫ్లెక్ట్ అవడం వల్ల మనం చూడగలుగుతున్నాం. అలాగే ఎకోలొకేసన్ పద్ధతిలో శబ్దాలు పరిసరాలపై బడి ప్రతిధ్వనిగా చెవులకు చేరినప్పుడు వాటిని చూపులేని వాళ్లు మనో ఫలకంపై చూస్తారు. మధ్యలో కంటి చూపు పోయిన వారికైతే మనుషులు, జంతువులు, పరిసరాలు ఎలా ఉంటాయో గుర్తుంటాయి. కానీ పుట్టుకతోనే కంటిచూపు లేనివారికి పరిసరాలపై అవగాహన ఉండదు. అలాంటి వారికి శిక్షణ ద్వారా అవగాహన కల్పిస్తారు.