LED light
-
ఎల్ఈడీ వీధిలైట్లపై వ్యతిరేకత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై కొన్ని పంచాయతీల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు సంబం ధించి బలవంతంగా తీర్మానాలు చేయించేందుకు ప్రయత్నించడంపై కొన్ని గ్రామాల సర్పంచ్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పంచాయతీకి అవసరమనుకుంటే తీర్మానం చేస్తుంది తప్ప.. తీర్మానాలు చేయాల్సిందిగా పంచాయతీరాజ్ కమిషనర్ కార్యా లయం ఆదేశాలివ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా తీర్మానాలు చేసేందుకు కొందరు సర్పంచ్‌లు నిరాకరిస్తున్నారు. ఎల్ఈడీ వీధిదీపాల విషయమై ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, తదితర జిల్లాల్లో సర్పంచ్ల సంఘాలు సమావేశాలు నిర్వహించినప్పుడు వ్యతిరేకత వ్యక్తమైనట్టు సమాచారం. బలవంతపు తీర్మానాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాలని, ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు చేపట్టాలనే ఆలోచనలో సర్పంచ్‌లు ఉన్నారు. తక్కువ ఖర్చయ్యే వ్యవస్థగా మార్చేందుకు.. విద్యుత్ ఆదా చర్యల్లో భాగంగా గ్రామాల్లోని సంప్రదాయ వీధి దీపాలను విద్యుత్ తక్కువ ఖర్చయ్యే ఎల్ఈడీ వీధిదీపాల వ్యవస్థగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా వీధి దీపాల నిర్వహణ వ్యయం తగ్గి పంచాయతీలపై భారం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ ప్రాజెక్ట్ అమ లుకు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీల నెలవారీ గ్రాంట్ల నుంచి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)æ సంస్థకు బకాయిలు చెల్లించేలా తీర్మానాలు చేయాల ని సూచించింది. ఈ మేరకు ఆమోదం తెలు పుతూ పంచాయతీలు వెంటనే తీర్మానాలు చేసేలా చూడాలంటూ జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవోలు) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది« శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. దీంతో డీపీవోలు తీర్మానాల కోసం సర్పంచ్‌లపై ఒత్తిడి పెంచుతున్నారు. గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేశాక సంబంధి త డీపీవోలు ఈఈఎస్ఎల్ సంస్థతో ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉంది. అయితే ఎల్ఈడీ దీపాల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని పంచాయతీలు వీటి ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా వీధిదీపాల నిర్వహణ బాధ్యతను తమ నుంచి తప్పించి మరొక సంస్థకు అప్పగించే ప్రయత్నాలపై సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఈడీ వ్యవస్థతో ఇబ్బందులు పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్లు పెట్టాలంటూ రెండేళ్ల క్రితమే ఒత్తిడి తెచ్చారు. కానీ మేము ఒప్పుకోలేదు. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో అప్పుడు వెనక్కు తగ్గారు. ఇప్పుడు మళ్లీ తీర్మానాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఈసారి కూడా మేము అంగీకరించేది లేదు. మున్సిపాలిటీలకు, పంచాయతీలకు వీధిలైట్ల నిర్వహణ, తదితరాల్లో తేడాలుంటాయి. ఎల్ఈడీల నిర్వహణ బాధ్యత అప్పగించే సంస్థ ఆఫీసులు జిల్లా కేంద్రాల్లో ఉంటాయి. ఏదైనా సమస్య తలెత్తితే సకాలంలో మరమ్మతులు చేయడం కష్టమవుతుంది. ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – అంజనీప్రసాద్, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు -
ఎల్ఈడీ లైట్ల వల్ల మనకెంత ముప్పు?
సాక్షి, హైదరాబాద్: నగరంలో న్యూ ఇయర్ జోష్ సంబరాలు.. ఫంక్షన్లు, ఔట్‌డోర్ ఈవెంట్స్‌లో జిలుగు వెలుగుల ఎల్ఈడీ లైట్లు...అత్యధిక కాంతిని వెదజల్లే విద్యుత్ దీప కాంతులు .. ధగదగల మాటెలా ఉన్నా.. వెలుగు వెనక చీకట్లు ముసురు కున్నట్లుగా గ్రేటర్ సిటీలో కాంతి కాలుష్య తీవ్రత రోజురోజుకూ పెరుగుతూనే ఉందని తాజా అధ్యయనంలో తేలింది. దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఈ తీవ్రత అత్యధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ అధ్యయన వివరాలు ఇటీవల ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడ్వాన్స్డ్ రీసెర్చ్ అనే పరిశోధన జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. ఈ కాంతి కాలుష్యం శృతిమించిన నేపథ్యంలో సిటీజన్లు నిద్రలేమి, స్థూలకాయం, డిప్రెషన్, చక్కెరవ్యాధి తదితర జీవనశైలి జబ్బుల బారిన పడుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనాన్ని భువనేశ్వర్‌కు చెందిన సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్కు చెందిన ప్రొఫెసర్ సిబా ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించారు. తన అధ్యయనంలో దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్ నగరంలో కాంతి కాలుష్య తీవ్రత అధికంగా ఉందని తేలింది. అత్యధిక కాంతిని వెదజల్లేందుకు పోటాపోటీగా ఏర్పాటుచేస్తున్న కృత్రిమ కాంతులతో అనర్థాలే అత్యధికంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ కాంతి తీవ్రత విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎల్ఈడీ విద్యుత్ ధగధగలు వెదజల్లుతున్న కాంతి తీవ్రత 7790 యూనిట్లుగా ఉందని తేలింది. ఈ తీవ్రతను ప్రతి చదరపు మీటరు స్థలంలో విరజిమ్మే కాంతి తీవ్రత ఆధారంగా లెక్కిస్తారు. దీన్ని ఆంగ్ల ప్రమాణంలో ‘యూనిట్ ఆఫ్ ల్యుమినస్ ఇంటెన్సిటీ ఫర్ స్కేర్ మీటర్’గా పిలుస్తారు. ఈ విషయంలో మన గ్రేటర్‌సిటీ తరవాత కోల్‌కతా నగరం రెండోస్థానంలో నిలిచింది. ఈ సిటీలో 7480 యూనిట్ల కాంతితీవ్రత ఉందని ఈ అధ్యయనం తెలిపింది. ఇక మూడోస్థానంలో నిలిచిన దేశరాజధాని ఢిల్లీ సిటీలో 7270 యూనిట్లుగా కాంతి తీవ్రత నమోదైంది. అతి కాంతితో అనర్థాలే... అత్యధికంగా కాంతిని వెదజల్లే కృత్రిమ విద్యుత్ దీపాలతో మానవాళితోపాటు ఇతర జీవరాశుల్లోనూ విపరీత పరిణామాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చత్వారం, కంటిచూపు దెబ్బతినడం వంటి అనర్థాలు చోటుచేసుకుంటాయంటున్నారు. చూపుల్లో అస్పష్టత చోటుచేసుకోవడం, పాదచారులు, వాహనచోదకులు, వాహనదారులు ఈ కాంతి వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించే సమయంలో కంటిచూపులో స్పష్టత కోల్పోయి తరచూ రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నట్లు ఈ అధ్యయనం హెచ్చరించింది. అత్యధిక కాలం ఎల్ఈడీ కాంతులను చూసేవాళ్లు సమీప భవిష్యత్‌లో రంగులను గుర్తించే విజన్ సామర్థ్యాన్ని సైతం కోల్పోతారని కంటి వైద్య నిపుణులు శ్రీకాంత్ ‘సాక్షి’కి తెలిపారు. ఎల్ఈడీ లైట్లు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని చెబుతున్నప్పటికీ మానవాళికి కలిగే ముప్పును ఎవరూ గుర్తించడం లేదని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తంచేయడం గమనార్హం. పశు, పక్ష్యాదులకూ గడ్డుకాలమే.. ఎల్ఈడీ కృత్రిమ కాంతులు మానవాళికే కాదు పెంపుడు జంతువులు, పక్షుల జీవనశైలిని సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఈ అధ్యయనం హెచ్చరించింది. ప్రధానంగా పక్షులు సీజన్‌ను బట్టి, వాతావరణ మార్పులకు అనుగుణంగా వాటి మనుగడ కోసం ఒక చోటు నుంచి మరోచోటుకు వలసపోయే సమయంలో అత్యధిక కాంతుల బారిన పడినపుడు అవి తమ గమ్యాన్ని చేరకుండా దారితప్పుతాయని ఈ అధ్య యనం తెలిపింది. వాటి వలస టైంటేబుల్ సైతం అస్తవ్యస్తంగా మారుతుందని పేర్కొంది. ఇక కప్పలు సైతం ఈ అత్యధిక కాంతికి గురయినపుడు వాటి ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతాయని చెబుతున్నారు. గబ్బిలాలు ఈ కాంతి బారినపడినపుడు భౌతిక వత్తిడికి గురవుతాయని చెబుతున్నారు. ఈ అత్యధిక కాంతుల బారిన పడిన జంతువులు కొన్ని సార్లు కాంతిని చూసి భయపడి అధిక దూరం ప్రయాణించేందుకు బెంబేలెత్తే పరిస్థితి తలెత్తుతుందని జంతుశాస్త్ర అధ్యాపకులు చెబుతున్నారు. అత్యధిక విద్యుత్ కాంతులు,కృత్రిమ కాంతులు,భారీ విద్యుత్ దీపాలు ఏర్పాటుచేసే సమయంలో ప్రభు త్వం తగిన చర్యలు తీసుకోవాలి. -
‘ఎల్ఈడీ’ల నిర్వహణలో లోపాలు!
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోనే మరే ఇతర నగరంలో చేయని విధంగా జీహెచ్ఎంసీలో తక్కువ వ్యవధిలో 4.18 లక్షల సంప్రదాయ వీధిలైట్ల స్థానే ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. ఎంతో విద్యుత్‌ను పొదుపు చేశారు. కోట్ల రూపాయల విద్యుత్ ఆదా జరుగుతోందన్నారు. కానీ పట్టపగలే వెలుగుతున్న లైట్లను మాత్రం ఆర్పలేకపోతున్నారు. ఎంత శాతం లైట్లు వెలుగుతున్నాయో సరైన లెక్కలు చెప్పలేకపోతున్నారు. కార్యనిర్వహణ ప్రమాణాలు పాటించకుండా, నాణ్యతను పట్టించుకోకుండా..త్వరితంగా లక్ష్యాన్ని పూర్తిచేశామని చెప్పుకునేందుకు ఏర్పాటైతే చేసినప్పటికీ, వాటి ద్వారా ఆశించిన పూర్తి ప్రయోజనం నెరవేరడం లేదు. త్వరితంగా ఏర్పాటు చేయాలనే యోచనతో ప్రమాణాలను పట్టించుకోకుండా ఏర్పాటు చేశారు. తక్కువ కరెంట్ ఖర్చు మాత్రమే కాకుండా ఆటోటైమర్ల ఆప్షన్‌తో కూడిన కంట్రోల్ స్విచ్‌లు ఫోటో సెన్స్ ఆధారంగా చీకటి పడగానే ఆటోమేటిక్‌గా వెలగడంతోపాటు తెల్లారగానే ఆరిపోతాయని ప్రకటించినప్పటికీ అవేవీ పనిచేయడం లేవు. మిట్టమధ్యాహ్నం సైతం ఎన్నో ఎల్ఈడీలు వెలుగుతున్నాయి. ఇదే విషయం సెంట్రలైజ్డ్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా జీహెచ్ఎంసీ డ్యాష్‌బోర్డులోనూ కనిపిస్తున్నా ఏమీ చేయలేకపోతున్నారు. ప్రతినిత్యం దాదాపు 500 లైట్లు ఆరిపోకుండా వెలుగుతున్నా పట్టించుకోవడం లేదు. సాంకేతికతతో పొరపాటున ఎవరైనా పగలు ఆన్ చేయాలని ప్రయత్నించినా, సంబంధిత విద్యుత్ ఏఈ లేదా డీఈలకు వెంటనే హెచ్చరిక సమాచారం వెళ్తుందని పేర్కొన్నారు. కానీ ఇవేవీ అమలు కావడం లేదు. మరోవైపు రాత్రిళ్లు ఎన్నో ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. లేక్క తేలడం లేదు... అంతేకాదు..ఎన్ని వీధిలైట్లు వెలుగుతున్నదీ, లేనిదీ ఆన్లైన్ ద్వారా ప్రజలు కూడా నేరుగా తెలుసుకోవచ్చునని ప్రకటించినప్పటికీ అమలు కావడం లేదు. దీంతో జీహెచ్ఎంసీ ఈఈఎస్ఎల్తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నెలనెలా చెల్లించాల్సిన వాయిదా చెల్లింపులను ఇంకా ప్రారంభించలేదు. 98 శాతం లైట్లు వెలగాల్సి ఉండగా వెలగకపోవడం.. ఫిర్యాదుల పరిష్కారం తీరు(కంప్లైంట్ హ్యాండ్లింగ్ సిస్టమ్) కూడా సరిగ్గా లేకపోవడంతో వాయిదాల చెల్లింపు ప్రారంభం కాలేదని తెలిసింది. నెలకు దాదాపు రూ.7.5 కోట్ల విద్యుత్ వినియోగం ఖర్చు ఆదా అవుతున్నప్పటికీ, ఇంకా వాయిదాల చెల్లింపు ప్రారంభించకపోవడానికి లోపాలే కారణమని సమాచారం. దాదాపు రూ. 217.12 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఒప్పందంలో భాగంగా విద్యుత్ బిల్లుల ఆదా వల్ల మిగిలిన నిధులనే జీహెచ్ఎంసీ ఈఈఎస్ఎల్కు ఏడేళ్ల కాలపరిమితితో చెల్లించాల్సి ఉంది. -
గుడ్డు కోసం వెరీగుడ్ ట్రే!
కోడిగుడ్లు బాగున్నాయో పాడయ్యాయో ఎలా తెలుస్తుంది? అది ఇప్పటికీ చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ను తీరుస్తుంది ‘ఎగ్ మైండర్ స్మార్ట్ ట్రే’. ఈ ట్రేకి ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. గుడ్లను తీసుకుని దీనిలో పెట్టాలి. తర్వాత ఎగ్మైండర్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆపైన యాప్ ఓపెన్ చేసి, మొబైల్‌ను ట్రే దగ్గర పెడితే... ఆ గుడ్లు బాగున్నాయో పాడైపోయాయో చెప్పేస్తుంది. ట్రేలో ఆరు గుడ్లు ఉంటాయి కదా... యాప్‌లో కూడా ఆరు గుడ్ల సింబల్ ఉంటుంది. రెండిటినీ దగ్గర పెట్టినప్పుడు ఏ గుడ్డు ఎన్ని రోజుల పాతదో, ఏది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో మొబైలో కనిపిస్తుంది. ఒకవేళ ఏ గుడ్డు అయినా పాడైపోతే... ఆ గుడ్డు పక్కన ఉన్న ఎల్ఈడీ లైటు వెలుగుతుంది. ప్రతిదీ కల్తీ అవుతున్న ఈ రోజుల్లో ఈ మాత్రం పరీక్ష చేసుకోవడం అవసరమే. అయితే ఈ ట్రేలు, యాప్ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. మన వరకూ రావడానికి కాస్త సమయం పట్టవచ్చు. వస్తే మాత్రం మిస్ కాకండి!