సాక్షి, సిటీబ్యూరో: దేశంలోనే మరే ఇతర నగరంలో చేయని విధంగా జీహెచ్‌ఎంసీలో తక్కువ వ్యవధిలో 4.18 లక్షల సంప్రదాయ వీధిలైట్ల స్థానే ఎల్‌ఈడీలను ఏర్పాటు చేశారు. ఎంతో విద్యుత్‌ను పొదుపు చేశారు. కోట్ల రూపాయల విద్యుత్ ఆదా జరుగుతోందన్నారు. కానీ పట్టపగలే వెలుగుతున్న లైట్లను మాత్రం ఆర్పలేకపోతున్నారు. ఎంత శాతం లైట్లు వెలుగుతున్నాయో సరైన లెక్కలు చెప్పలేకపోతున్నారు. కార్యనిర్వహణ ప్రమాణాలు పాటించకుండా, నాణ్యతను పట్టించుకోకుండా..త్వరితంగా లక్ష్యాన్ని పూర్తిచేశామని చెప్పుకునేందుకు ఏర్పాటైతే చేసినప్పటికీ, వాటి ద్వారా ఆశించిన పూర్తి ప్రయోజనం నెరవేరడం లేదు. త్వరితంగా ఏర్పాటు చేయాలనే యోచనతో ప్రమాణాలను పట్టించుకోకుండా ఏర్పాటు చేశారు. తక్కువ కరెంట్ ఖర్చు మాత్రమే కాకుండా ఆటోటైమర్ల ఆప్షన్‌తో కూడిన కంట్రోల్ స్విచ్‌లు ఫోటో సెన్స్ ఆధారంగా చీకటి పడగానే ఆటోమేటిక్‌గా వెలగడంతోపాటు తెల్లారగానే ఆరిపోతాయని ప్రకటించినప్పటికీ అవేవీ పనిచేయడం లేవు. మిట్టమధ్యాహ్నం సైతం ఎన్నో ఎల్‌ఈడీలు వెలుగుతున్నాయి. ఇదే విషయం సెంట్రలైజ్డ్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా జీహెచ్‌ఎంసీ డ్యాష్‌బోర్డులోనూ కనిపిస్తున్నా ఏమీ చేయలేకపోతున్నారు. ప్రతినిత్యం దాదాపు 500 లైట్లు ఆరిపోకుండా వెలుగుతున్నా పట్టించుకోవడం లేదు. సాంకేతికతతో పొరపాటున ఎవరైనా పగలు ఆన్ చేయాలని ప్రయత్నించినా, సంబంధిత విద్యుత్ ఏఈ లేదా డీఈలకు వెంటనే హెచ్చరిక సమాచారం వెళ్తుందని పేర్కొన్నారు. కానీ ఇవేవీ అమలు కావడం లేదు. మరోవైపు రాత్రిళ్లు ఎన్నో ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి.
లేక్క తేలడం లేదు...
అంతేకాదు..ఎన్ని వీధిలైట్లు వెలుగుతున్నదీ, లేనిదీ ఆన్‌లైన్ ద్వారా ప్రజలు కూడా నేరుగా తెలుసుకోవచ్చునని ప్రకటించినప్పటికీ అమలు కావడం లేదు. దీంతో జీహెచ్‌ఎంసీ ఈఈఎస్‌ఎల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నెలనెలా చెల్లించాల్సిన వాయిదా చెల్లింపులను ఇంకా ప్రారంభించలేదు. 98 శాతం లైట్లు వెలగాల్సి ఉండగా వెలగకపోవడం.. ఫిర్యాదుల పరిష్కారం తీరు(కంప్‌లైంట్ హ్యాండ్లింగ్ సిస్టమ్) కూడా సరిగ్గా లేకపోవడంతో వాయిదాల చెల్లింపు ప్రారంభం కాలేదని తెలిసింది. నెలకు దాదాపు రూ.7.5 కోట్ల విద్యుత్ వినియోగం ఖర్చు ఆదా అవుతున్నప్పటికీ, ఇంకా వాయిదాల చెల్లింపు ప్రారంభించకపోవడానికి లోపాలే కారణమని సమాచారం. దాదాపు రూ. 217.12 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఒప్పందంలో భాగంగా విద్యుత్ బిల్లుల ఆదా వల్ల మిగిలిన నిధులనే జీహెచ్‌ఎంసీ ఈఈఎస్‌ఎల్‌కు ఏడేళ్ల కాలపరిమితితో చెల్లించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment