ledears
-
టీడీపీ నాయకుడి కుమారుడి అఘాయిత్యం
సాక్షి, తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లిలో గ్రామ వలంటీర్‌పై టీడీపీ నాయకుడి కుమారుడు పిడిబాకుతో దాడి చేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గ్రామంలోని రాముల దేవాలయం సమీపంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే ఉన్న వలంటీర్ రామానాయుడిపై టీడీపీ నాయకుడు దబ్బల రామాంజిని కుమారుడు సతీష్ ఒక్కసారిగా పిడిబాకుతో దాడి చేసి పరారయ్యాడు. తీవ్రగాయాలై రక్తపుమడుగులో రామానాయుడు కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు 108 వాహనంలో పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు సతీష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తుగ్గలి ఏఎస్ఐ మాధవస్వామి తెలిపారు. నిందితుడు సతీష్ డోన్‌లోని డిగ్రీ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాడు. నవశకం కార్యక్రమంలో భాగంగా వలంటీర్ రామానాయుడు కూడా ఇంటింటి సర్వే చేశాడు. ఆ సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో తన పేరు లేకుండా చేశావంటూ సతీష్ 20 రోజుల క్రితం వలంటీర్‌తో గొడవకు దిగాడు. తాను సర్వే మాత్రమే చేశానని, పేరు తీసేసే హక్కు తనకు లేదని చెప్పాడు. ఆ తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పేరు ఎలాగూ వచ్చింది. అయినా కక్ష పెంచుకున్న సతీష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. గ్రామంలో ఉద్రిక్తత వలంటీర్‌పై హత్యాయత్నం ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో 400 ఓట్లకు పైగా వైఎస్సార్సీపీకి మెజార్టీ రావడంతో టీడీపీ వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవకుండా చేయాలని వారు ప్లాన్‌లో ఉన్నట్లు వైఎస్సార్సీపీ మద్దతుదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకుడి కుమారుడు గ్రామ వలంటీర్‌పై హత్యాయత్నానికి పాల్పడడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. -
ఆదివారం ‘ఎఫెక్ట్’
సాక్షి,రాజేంద్రనగర్: సెలవురోజు ఆదివారం కావడంతో కిందిస్థాయి నాయకులు, చోటామోట లీడర్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం, ఆపై ఆదివారం కావడంతో ప్రజలు ఇళ్ల వద్దే ఉంటారని భావించిన నేతలు ముమ్మరంగా ప్రచారం చేయాలని భావించారు. బలగం చూపించుకోవడానికి జనం అవసరం కావడంతో చోటామోట లీడర్లు, గల్లీస్థాయి నాయకులను ఆశ్రయించారు. ప్రచారం తర్వాత బిర్యానీ, మద్యం, ఆపై డబ్బులు ఇస్తామని హామీ ఇస్తేనే వస్తామని వారు తెగేసి చెప్పడంతో చేసేది లేక నేతలు అంగీకరించాల్సి వచ్చింది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఆదివారం పెద్దఎత్తున నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
పులువురి నాయకుల గృహనిర్బంధం అరెస్టులకు నిరసనగా కూసుమంచిలో కార్యకర్తల ఆందోళన ప్రభుత్వ అభద్రతా భావంతోనే ఆరెస్టులు ఖమ్మం: హైదరాబాద్‌లో ఆదివారం జరిగే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను అడ్డుకుంటారనే నెపంతో ముందస్తుగా జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం నుంచే జిల్లాలోని నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ నాయకుల జాబితాను సేకరించి వారి కదలికలను పోలీసులు ఆరా తీశారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయాన్నే పోలీసులు కాంగ్రెస్ నాయకుల ఇళ్ల్లల్లోకి వెళ్లి జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులను ఆరెస్టు చేసి మధ్యాహ్నం వరకు స్టేషన్లో ఉంచుకొని ఊరు విడిచి వెళ్లకుండా ఉండాలని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. నగరంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఐతం సత్యం ఇల్లు విడిచి వెళ్లకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. కార్పొరేటర్ వడ్డెబోయిన నర్సింహరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు రాపర్తి శరత్, ఎస్టీ విభాగం నాయకులు వెంకట్రావులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని భద్రాచలం,మణుగూరు, సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల్లో నాయకులను అరెస్టు చేసి ఆయా పోలీసుస్టేషన్లకు తరలించారు.నేలకొండపల్లిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నం బ్రహ్మయ్యను , జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాంరెడ్డి శ్రీచరణ్రెడ్డితోపాటు ఆయన అనుచరులను అడ్డుకున్నారు. దీనికి నిరసనగా కూసుమంచిలో శ్రీచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అభద్రత భావంతోనే ప్రభుత్వం అరెస్టులు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.