నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
- పులువురి నాయకుల గృహనిర్బంధం
- అరెస్టులకు నిరసనగా కూసుమంచిలో కార్యకర్తల ఆందోళన
- ప్రభుత్వ అభద్రతా భావంతోనే ఆరెస్టులు
ఖమ్మం: హైదరాబాద్‌లో ఆదివారం జరిగే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను అడ్డుకుంటారనే నెపంతో ముందస్తుగా జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం నుంచే జిల్లాలోని నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ నాయకుల జాబితాను సేకరించి వారి కదలికలను పోలీసులు ఆరా తీశారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయాన్నే పోలీసులు కాంగ్రెస్ నాయకుల ఇళ్ల్లల్లోకి వెళ్లి జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులను ఆరెస్టు చేసి మధ్యాహ్నం వరకు స్టేషన్‌లో ఉంచుకొని ఊరు విడిచి వెళ్లకుండా ఉండాలని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
నగరంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఐతం సత్యం ఇల్లు విడిచి వెళ్లకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. కార్పొరేటర్ వడ్డెబోయిన నర్సింహరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు రాపర్తి శరత్, ఎస్టీ విభాగం నాయకులు వెంకట్రావులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని భద్రాచలం,మణుగూరు, సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల్లో నాయకులను అరెస్టు చేసి ఆయా పోలీసుస్టేషన్‌లకు తరలించారు.నేలకొండపల్లిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నం బ్రహ్మయ్యను , జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాంరెడ్డి శ్రీచరణ్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులను అడ్డుకున్నారు. దీనికి నిరసనగా కూసుమంచిలో శ్రీచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అభద్రత భావంతోనే ప్రభుత్వం అరెస్టులు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.