Legal Adviser
-
రెండవ భార్యకు, పిల్లలకు ఆస్తి వస్తుందా?
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో, (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చనిపోయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతుంది.ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్‌కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కాని పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్ లో ఎటువంటి హక్కు ఉండదు. కానీ అన్నివేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్‌లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలి అంటూ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం.అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికి, మెయింటెనెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికి తేడా ఏమీ లేదు అని అంటూ, మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తన తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం, పెన్షన్ రూల్స్ లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్‌లో సమాన హక్కు ఉంటుంది అని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి. కొన్ని హక్కులు రెండవ భార్యకి వర్తిస్తాయా లేదా అన్నది కేసు పూర్వాపరాలను బట్టి, ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపైనా ఆధారపడి ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
ఎల్ఐసీ ఐపీవోకు సలహాదారులు కావలెను
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు సంబంధించి మర్చంట్ బ్యాంకర్లు, న్యాయ సలహాదారుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గరిష్టంగా పది వరకు మర్చంట్ బ్యాంకర్లు, ఒక న్యాయ సలహా సేవల సంస్థను ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం’ (దీపమ్) ఎంపిక చేయనుంది. బిడ్ల దాఖలుకు ఆగస్ట్ 6 వరకు గడువు ఇచ్చింది. గత వారమే ఎల్ఐసీ ఐపీవోకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసిన విషయం తెలిసిందే. 2022 జనవరి–మార్చి మధ్యలో ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక. ఇప్పటివరకు కేవలం రూ.7,500 కోట్ల మేరకే సమీకరించింది. ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాల విక్రయం, ఎల్ఐసీ ఐపీవో రూపంలో గణనీయమైన మొత్తం సమకూరనుంది. -
కోర్టుకు హాజరుకావాలని కమిషనర్‌కు ఆదేశం
అనంతపురం న్యూసిటీ: సుదర్శన్ కమ్యూనికేషన్స్ వ్యవహారంలో వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసును ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు జడ్జి ప్రవీణ్‌కుమార్ సోమవారం మునిసిపల్ లీగల్ అడ్వైజర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలో సుదర్శన్ కమ్యూనికేషన్స్ నిర్వాహకులు కేబుల్ కు రైట్ ఆఫ్ వే(కేబుల్‌ను పోల్‌పై తీసుకోవడానికి) అనుమతి కోసం కమిషనర్‌కు విన్నవించారు. ఆయన నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో గత నెల 25న హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఈ కేసును విచారించి ఈ నెల రెండుకు వాయిదా వేసింది. అయితే.. మునిసిపల్ లీగల్ అడ్వైజర్ ఆరో తేదీకి వాయిదా కోరారు. అందుకు అనుగుణంగానే ఆదేశాలిచ్చింది. అయితే.. ఈలోపే ఈ నెల నాలుగున కేబుల్‌ను నగరపాలక సంస్థ ఉద్యోగులు కత్తిరించారు. దీనిపై సుదర్శన్ కమ్యూనికేషన్స్ న్యాయవాది హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు.. కమిషనర్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కమిషనర్ కూడా ధ్రువీకరించారు. మంగళవారం హైకోర్టుకు హాజరవుతామని, కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పారు.