జిల్లాలో బాలకృష్ణ సందడి
గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్ :సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం జిల్లాలో సందడి చేశారు. లెజండ్ చిత్ర యూనిట్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన యాత్ర బుధవారం గుంటూరు నగరానికి విచ్చేసింది. దర్శకుడు బోయపాటి శ్రీను, టీడీపీ నాయకుడు గల్లా జయదేవ్, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, నాయకులు మన్నవ సుబ్బారావు, మన్నం శివనాగమల్లేశ్వరరావు, కొర్రపాటి సాయి, హనుమంతరావు తదితరులు బాలకృష్ణ వెంట పల్లవి థియేటర్‌కు విచ్చేశారు. బాలకృష్ణకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు బాలకృష్ణకు పూలదండ, శాలువా కప్పి సత్కరించారు. అనంతరం బాలకృష్ణ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అభిమానులు రాజకీయ అంశాల గురించి ప్రశ్నలు వేయడంతో ఇది రాజకీయ సభ కాదు, రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడనన్నారు. అభిమానులు పెద్ద ఎత్తున బాలకృష్ణ సీఎం కావాలంటూ నినాదాలు చేశారు. అలాగే మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామిని బాలకృష్ణ దర్శించుకున్నారు.
పెదకాకాని : శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు జరిపేందుకు బుధవారం సినీనటుడు బాలకృష్ణ పెదకాకాని విచ్చేశారు. ఆలయ సహాయకమిషనర్ ఈమని చంద్రశేఖరరెడ్డి, ఆలయ చైర్మన్ కరణం సాంబశివరావు,పాలకవర్గం సభ్యులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన బాలకృష్ణ, చిత్రదర్శకుడు బోయపాటి శ్రీను రాహుకేతువులకు పూజలు చేశారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు జరిపించారు. అమ్మవారికి అష్టోత్తర పూజలు జరిపించారు. అనంతరం చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి అల్ఫాహారం తీసుకుని ఆనందంగా గడిపాడు. అనంతరం బోయపాటి ఇంటికి చేరుకున్న గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ బాలకృష్ణను కలసి మంతనాలు జరిపారు.