సరైన ప్రచారం లేకే ఓడిపోయాం
- తెలంగాణ వాదాన్ని కేసీఆర్ బాగా వాడుకున్నారు
- శాసనమండలి ప్రతిపక్ష నేత డీఎస్
నిజామాబాద్ సిటీ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అని ప్రతి ఒక్కరికి తెలుసని, ఈ విషయాన్ని తగినంత ప్రచారం చేసుకోకపోవడంతోనే ఎన్నికల్లో ఓడిపోయామని శాసన మండలి ప్రతిపక్ష నేత డి. శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా, నగర కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు తాహెర్, కేశవేణు ఆధ్వర్యంలో ఇటీవల గెలిచిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ల అధ్యక్షులు, మండలాల అధ్యక్షులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్ మాట్లాడుతూ పోరాటాలతోనే తెలంగాణ సాధించుకున్నామని, ఎన్నికల మేనిఫేస్టోలో కేసీఆర్ ప్రజలను ఆకర్షించే హమీలు ఇవ్వటంతోనే ప్రజలు తెరాసను గెలిపించారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో కేసీఆర్ విఫలమైతే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం పనితీరును ఎండగడతామన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ గెలుపుకోసం ఎంతో కృషి చేశారని, అయితే తెలంగాణ వాదం ముందు ఓడిపోయామన్నారు.
తెలంగాణపై తాము మొదట మాట్లాడినపుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారని అన్నారు. రాబోయే ఐదేళ్లలో కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చిందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోతే భవిష్యత్తు ఉంటుందని డీఎస్ అన్నారు.
ప్రజలకు అండగా ఉండాలనే ప్రతిపక్షనేతగా..
శానసమండలి చైర్మన్‌గా తనకు అవకాశం వచ్చినప్పటికి ఆ పదవితో పార్టీకి, ప్రజలకు ఉపయోగపడనని గ్రహించి ప్రతిపక్ష పదవి తీసుకున్నట్లు డి. శ్రీనివాస్ తెలిపారు. తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో జాప్యం చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే ఈ పదవి తీసుకున్నట్లు చెప్పారు.
ఓటమిని గౌరవిస్తాం..
సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారంతోనే అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఇన్చా ర్జి మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. నిజామాబా ద్ రూరల్ నియోజకవర్గంలో డీఎస్, జిల్లాలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఎన్నో కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేసినా ప్రజలు తెరాసను గెలిపించారన్నారు. ఎంఐఎం పార్టీ కూడా తమకు ద్రోహం చేసిందన్నారు. ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చిన గౌరవించటం పార్టీ నైజమన్నారు.
సమావేశంలో టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, డీసీసీ మాజీ అధ్యక్షుడు గంగాధర్, మాజీ మా ర్కెట్ కమిటి చైర్మన్ నగేష్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల చిన్నరాజేశ్వర్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావీద్, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు గన్‌రాజ్, అర్బన్ అధ్యక్షుడు బంటురాము తదితరులు పాల్గొన్నారు.