శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి
సాక్షి, అమరావతి: శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ చక్రపాణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లభించినట్లయింది. 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 67 సీట్లు సాధించడంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా లభించింది.
శాసనమండలిలో మొన్నటివరకూ కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య ఆ పార్టీ సభ్యుల రీత్యా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆయన పదవీకాలం గత నెల 29తో ముగిసింది. మరో వైపు వైఎస్సార్‌సీపీ సభ్యుల బలం ఎనిమిది(కాంగ్రెస్ కన్నా అధికం)కి చేరుకుంది. దీంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ప్రతిపక్ష నేత హోదాను కల్పిస్తూ చైర్మన్ చక్రపాణి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. మండలిలోనూ పార్టీ సభ్యులందర్నీ ఏకతాటిపై నడిపి ప్రజాప్రయోజనాల కోసం కృషి చేస్తానని ఉమ్మారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు.