Lens and Life
-
‘సెజ్’ పొమ్మంది..
అరుణ్ రాయ్‌చౌదరి.. 25 ఏళ్లు ఫొటో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఆయనది. కెమెరా క్లిక్‌మంటే ఫొటో అయిపోతుంది. కానీ, ఒక్క ఛాయాచిత్రంతో దాని వెనుకున్న కథను చెప్పగలిగితేనే అది ఫొటో జర్నలిజం అవుతుందంటున్న అరుణ్ రాయ్చౌదరితో ఈ వారం లెన్స్ అండ్ లైఫ్. ఫొటో జర్నలిజం అంటే ఒక స్టిల్ కాదు. మనం నేరుగా చూడలేని అంశాలను కళ్లకు కట్టేది. సబ్జెక్ట్‌లోకి తొంగి చూడగలగాలి. అలాంటిదే పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్‌లో నేను తీసిన ఫొటో. స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) వివాదం ఆ ఊరిని కల్లోలం చేసింది. ప్రాణభయంతో ఆ గ్రామస్తులను పరుగులు తీసేలా చేసింది. పోలీసులకు, అల్లరి మూకలకు చెలరేగిన ఘర్షణలు అమాయక జనాన్ని కట్టుబట్టలతో ఊరి పొలిమేరల వరకూ తరిమింది. ఆ సమయంలో తీసిన ఫొటో అక్కడున్న పరిస్థితిని కళ్లకు కట్టింది. ఈ ఫొటో తీసిన ముందు రోజు అదే గ్రామంలో జరిగిన ఘర్షణల్లో 14 మంది అమాయక రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు చోటు లేదు... ఒక ఫొటో మాట్లాడుతుంది. అలాంటి చిత్రం చూసిన తర్వాత మాట్లాడటం ఆపేసి... ఆలోచించటం మొదలుపెడతాం. ఈ రోజుల్లో అలాంటి చిత్రాలకు దినపత్రికల్లో చోటు లేదు. మొబైల్స్, డిజిటల్ కెమెరాల్లో రోజుకు ఎన్నో వేల ఫొటోలు క్లిక్‌మంటున్నాయి. అవన్ని ఫొటో జర్నలిజం కాలేవు. అసలు ఫొటో జర్నలిజం అనేది ఈ రోజుల్లో లేదనే చెప్పాలి. ఇప్పుడు న్యూస్ పేపర్లలో వస్తున్నది కేవలం పేజ్ ఫిల్లింగ్ కోసం తీసిన ఫొటోలు మాత్రమే. న్యూస్‌ను క్యారీ చేసేవి, వివరించే చిత్రాలకు చోటెక్కడుంది. దీనికి ప్రకటనలు, ఆలోచన ధోరణిలో మార్పు ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫొటో జర్నలిజం కంట్రిబూషన్స్ ఈ రోజు హైదరాబాదులో చోటు చేసుకున్న మార్పులకు ఫోటో జర్నలిస్టుల కాంట్రిబూషన్ ఎంతైనా ఉంది. ఆ రోజుల్లో జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి దుర్గం చెరువు వెళ్లడానికి ఒక పిల్ల రోడ్డు ఉండేది. వర్షంలో, బురదలో సైకిల్ మీద వెళ్లి ఫొటోలు తీసిన సందర్భాలు నా అనుభవంలో ఉన్నాయి. అప్పట్లో న్యూస్ పేపర్స్లలో ఫొటో ఫీచర్స్ ఉండేవి. వాటి కోసం ఇలాంటి ఎన్నో ఫొటో ఫీచర్స్ చేసిన ఫొటోగ్రాఫర్లను, వారి కంట్రిబూషన్స్ని మరచిపోయారు. ఈ రోజుల్లో అలాంటి ఫీచర్స్ కూడా రన్ చెయ్యట్లేదు ఎవరూ. ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం కావడమే ఇందుకు కారణం. ప్రజెంటర్: ఓ మధు -
మేఘాల పల్లకిలోమంచుకొండ
కెమెరా కంటికి చిక్కిన ప్రతి చిత్రం అద్భుతంగా ఆవిష్కృతంఅవుతుంది. అదే కెమెరా లెన్స్ ప్రకృతి ఒడిని ఒడిసిపడితే.. వచ్చే ఔట్పుట్ ఇదిగో ఇలా అదరహో అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని తీసింది ప్రఖ్యాత హోమియోపతి వైద్యుడు డాక్టర్ ముఖేష్ బాత్రా. ఈ డాక్టర్ సాబ్ లెన్స్ పట్టుకుని పుష్కరకాలం కూడా కాలేదు. కానీ, ప్రకృతిపై ప్రేమ డాక్టర్‌ను కాస్తా ల్యాండ్‌స్కేప్ ఫొటోగ్రాఫర్‌గా మార్చేసింది. ఏటా ఏదో ఒక దేశంలో పది రోజులు పర్యటిస్తూ అక్కడి ప్రకృతికాంతను తన కెమెరాతో పలకరిస్తుంటారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన బాత్రా.. తన లెన్స్ అండ్ లైఫ్ విశేషాలను సిటీప్లస్కు వివరించారు. మాది ముంబై. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకునే వాణ్ని. 1972లో చందాబెన్ మోహన్ భాయ్ పటేల్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ నుంచి డిగ్రీ సాధించాను. 1982లో డాక్టర్ బాత్రాస్ హెల్త్‌కేర్ గ్రూప్ మొదలుపెట్టాను. 2003లో మా ఫ్యామిలీలో ఓ వేడుక జరిగినప్పుడు కెమెరామెన్ అవతారమెత్తా. ఆ ఫొటోలు చూసి కుటుంబసభ్యులు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లా తీశావని వెన్నుతట్టారు. అప్పటి నుంచి ప్రకృతి అందాలను ఫొటోలు తీయడమే ప్రవృత్తిగా మలుచుకున్నాను. మన దేశంతో పాటు స్విట్జర్లాండ్, ఇటలీ, నేపాల్, చైనా, కెనెడా ఇలా పలు దేశాలు పర్యటించాను. పరవశించే ప్రకృతి కంటపడితే దాన్ని ఎలాగైనా కెమెరాలో బంధించాలనుకునే వాణ్ని. అదే ఆతృతతో మూడుసార్లు ప్రమాదం అంచుల వరకూ వెళ్లి బయటపడ్డా. అప్పుడు భయం వేసినా.. ఔట్పుట్ చూసిన తర్వాత ఆనందం వేసేది. స్విట్జర్లాండ్ అందాలు సూపర్ స్విట్జర్లాండ్‌లోని వైవిధ్యమైన ల్యాండ్‌స్కేప్ దృశ్యాలను చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. అక్కడి కొండలు, కోనలు, నదులు, సరస్సులు ప్రతి దృశ్యం మనోహరమే. యూరోప్‌లోనే అత్యధికంగా పర్వతాలున్న ఈ ప్రాంతంలో ప్రయాణం కొంత ఇబ్బందే. మూడు రోజుల పాటు అదే ప్రాంతంలో ఉండి ఆ గిరుల సొగసులు క్లిక్‌మనిపించాను. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టిన మంచు తుపానును నేనెప్పటికీ మరచిపోలేను. మౌంటెయిన్ రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మంచుతెరలతో ముస్తాబై మేఘాల పల్లకిని ముద్దాడుతున్న ఓ పర్వతం కనిపించింది. వెంటనే క్లిక్‌మనిపించాను. ఈ ఛాయాచిత్రం వన్ ఆఫ్ మై బెస్ట్ ఫొటోగ్రాఫ్స్. ఈ ఫొటోకు నేను నికాన్ డి 300 కెమెరా వాడాను. మంచి గుర్తింపు.. దేశంలోని ప్రధాన నగరాల్లో పది ఫొటో ఎగ్జిబిషన్ ప్రదర్శనలు నిర్వహించాను. అన్నిటికీ మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ ప్రదర్శనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఓ వృద్ధాశ్రమ ఎన్జీవోకు విరాళంగా అందజేస్తున్నా. నేను తీసిన ఫొటోల్లో కొన్ని ముంబైలోని రాజ్‌భవన్‌లో, ఢిల్లీలోని సిటీ బ్యాంక్ కార్యాలయాల్లోని సిటీగోల్డ్ లాంజ్లలో, బజాజ్ కార్పొరేట్ కార్యాలయం, టాటా ఆర్కైవ్స్‌లో కొలువుదీరాయి. -
లెన్స్ అండ్ లైఫ్...
యాభై ఏళ్ల కిందట క్లిక్‌మనే కెమెరాను చూసి ముచ్చటపడ్డారు. తోటివాళ్ల కెమెరాతో ఆ చిట్టి చేతులు తీస్తున్న అద్భుతాలు చూసిన అతడి తల్లి మైమరిచిపోయింది. అందుకే ఏడో తరగతిలోనే కుర్రాడికి మంచి కెమెరా కొనిచ్చింది. అంతే అప్పటి నుంచి ఆ కెమెరా క్లిక్‌మంటూనే ఉంది. ప్రకృతితో పెనవేసుకున్న అనుబంధం.. అత డిని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ వైపు నడిపించింది. కొండల్లో, కోనల్లో, అడవుల్లో సంచరిస్తూ.. అక్కడ పరుచుకున్న ప్రక ృతిని తన కెమెరాతో ఒడిసిపట్టారు. అక్కడ సంచరిస్తున్న జంతుజాలాన్ని తన ఫొటోగ్రఫీ మాయాజాలంతో అందంగా చూపించారు. వీటన్నింటితో పాటు ప్రముఖ దినపత్రికల్లో పనిచేస్తున్న ఎంతోమంది ఫొటోగ్రాఫర్లకు ఓనమాలు నేర్పిన మాదిరెడ్డి రాంగోపాల్‌తో ఈ వారం లెన్స్ అండ్ లైఫ్... -
రిస్కీ క్లిక్స్
Lens & లైఫ్ స్మైల్ అనగానే నవ్వవు.. చిటికెలు కొడితే పట్టించుకోవు.. ఇటు చూడమనే అవకాశమే లేదు.. కానీ వాటి నడకలో రాజసం ఉంటుంది. అవి చేసే ప్రతి పనిలో అందం ఉంటుంది. వాటిని కెమెరాలో బంధించాలంటే హైలెన్స్ కెమెరాలు కాదు.. ధైర్యం కావాలి.. అంతకుమించి బోల్డెంత ఓపిక కావాలి. క్షణాల్లో మారిపోయే హావభావాల్లో కత్తిలాంటి దాన్ని సెలెక్ట్ చేసి క్లిక్‌మనిపించాలి. అప్పుడు వైల్డ్ ఫొటోగ్రాఫ్ బోల్డ్‌గా వస్తుంది. అందుకోసం ఎక్కడెక్కడో తిరగాలి.. ఎన్నో వదులుకోవాలి. అలాంటి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో ప్రత్యేకత చాటుకుంటున్న సిటీకి చెందిన శంకర్‌తో ఈ వారం లెన్స్ అండ్ లైఫ్ మాది కృష్ణా జిల్లా కొల్లేరు. చిన్నప్పటి నుంచే ప్రకృతి అందాలంటే ఇష్టపడే నేను వాటిని కెమెరాలో బంధించేవాడిని. అలా నాకు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీపై ఆసక్తి ఏర్పడింది. సిటీకి వచ్చాక జేఎన్టీయూ నుంచి డిప్లొమో ఇన్ ఫొటోగ్రఫీ కోర్సు చేశా. ఆపై వరంగల్‌లోని ఏటూరునాగారం అడవులు, శ్రీశైలంలోని నల్లమల అడవులు, శ్రీహరికోట సమీపంలోని సూళ్లూరిపేట నీలిపట్టు ప్రాంతాలను నా కెమెరా నేత్రంతో వీక్షించా. అక్కడి ప్రకృతితో పాటు పక్షులు, జంతువుల ఫొటోలు తీశా. వీటిలో కొన్ని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ బ్రోచర్లు, పోస్టర్లలో కూడా వాడారు. ఆనాటి గూడు కొంగలేవీ 1972 అనుకుంటా. వైల్డ్‌లైఫ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. కొల్లేరు సరస్సు సమీప ప్రాంతాల్లో గూడు కొంగలు (గ్రేప్ పొలికన్ స్పాట్ బిల్డ్) తాటి చెట్లపై గూళ్లు కడుతుండటం ఎక్కువగా కనిపించేది. అందులో గుడ్లు పొదిగేవి. అలా వాటి సంతతి రోజురోజుకు పెరిగింది. ఇదే సమయంలో స్థానిక గిరిజనులు గూడు కొంగలను వేటాడడం మొదలెట్టారు. రోజురోజుకి వీరి ఆగడాలు శ్రుతిమించడంతో అక్కడి నుంచి ఆ పక్షులు వలస వెళ్లాయి. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఆ గూడు కొంగలు కొల్లేరు సరస్సులో కనిపించాయి. గూడు కొంగ తన పిల్లలకు ఆహారం ఇస్తున్న సమయంలో నా కెమెరా క్లిక్మంది. 2000 డిసెంబర్ 2 పులికాట్ సరస్సుకు వెళ్లా. మర్నాడు ఫ్లెమింగోలు నా కంటపడ్డాయి. వెంటనే వాటిని నా లెన్స్‌లో బంధించా. ఈ ఫొటోలు శభాష్ అనిపించుకున్నాయి. ప్రకృతితో మాట్లాడొచ్చు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే జంతువు హావభావాలే కాదు.. చుట్టూ ఉన్న ప్రకృతీ ప్రతిబింబించాలి. ఫొటోగ్రఫీపై పట్టు, వైల్డ్‌లైఫ్ మీద ఆసక్తి ఉన్నప్పుడే ఇందులో రాణించగలం. ఈ రంగంలో సంపాదన ఉండదు.. పైగా కెమెరాలకు, లెన్స్‌లకు లక్షల్లో ఖర్చవుతుంది. కానీ, ప్రకృతితో మాట్లాడే అవకాశం ఒక్క వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలోనే ఉంది. టెక్నికల్ యాంగిల్ ఫొటోలు తీసేందుకు కెనాన్ ఏ వన్ వాడుతున్నా. జూమ్ 152 టూ 600. షట్టర్ స్పీడ్ 250పైనే. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పూర్తిగా నేచురల్ లైటింగ్‌పై ఆధారపడి ఉంటుంది. శిక్షణ తర్వాతే అడవికెళ్లాలి ఔత్సాహిక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు శిక్షణను జూ నుంచి మొదలుపెట్టాలి. శిక్షణ తర్వాత అడవుల్లోకి వెళ్లి ఫొటోలు తీయడం ఉత్తమం. పులి, చిరుతపులి, అడవి పిల్లి, దుప్పి వంటి వాటికోసం శ్రీశైలం, ఏటూరునాగారం అడువులకు వెళ్లొచ్చు. అలాగే దేశ, విదేశీ పక్షులు, నీటి జంతువుల కోసం షామీర్పేట, పాకాల, కొల్లేరు, గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు వంటి సరస్సులకు వెళ్లొచ్చు.