మేఘాల పల్లకిలోమంచుకొండ
కెమెరా కంటికి చిక్కిన ప్రతి చిత్రం అద్భుతంగా ఆవిష్కృతంఅవుతుంది. అదే కెమెరా లెన్స్ ప్రకృతి ఒడిని ఒడిసిపడితే.. వచ్చే ఔట్‌పుట్ ఇదిగో ఇలా అదరహో అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని తీసింది ప్రఖ్యాత హోమియోపతి వైద్యుడు డాక్టర్ ముఖేష్ బాత్రా. ఈ డాక్టర్ సాబ్ లెన్స్ పట్టుకుని పుష్కరకాలం కూడా కాలేదు.
కానీ, ప్రకృతిపై ప్రేమ డాక్టర్‌ను కాస్తా ల్యాండ్‌స్కేప్ ఫొటోగ్రాఫర్‌గా మార్చేసింది. ఏటా ఏదో ఒక దేశంలో పది రోజులు పర్యటిస్తూ అక్కడి ప్రకృతికాంతను తన కెమెరాతో పలకరిస్తుంటారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన బాత్రా.. తన లెన్స్ అండ్ లైఫ్ విశేషాలను సిటీప్లస్‌కు వివరించారు.
మాది ముంబై. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకునే వాణ్ని. 1972లో చందాబెన్ మోహన్ భాయ్ పటేల్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ నుంచి డిగ్రీ సాధించాను. 1982లో డాక్టర్ బాత్రాస్ హెల్త్‌కేర్ గ్రూప్ మొదలుపెట్టాను. 2003లో మా ఫ్యామిలీలో ఓ వేడుక జరిగినప్పుడు కెమెరామెన్ అవతారమెత్తా. ఆ ఫొటోలు చూసి కుటుంబసభ్యులు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌లా తీశావని వెన్నుతట్టారు.
అప్పటి నుంచి ప్రకృతి అందాలను ఫొటోలు తీయడమే ప్రవృత్తిగా మలుచుకున్నాను. మన దేశంతో పాటు స్విట్జర్లాండ్, ఇటలీ, నేపాల్, చైనా, కెనెడా ఇలా పలు దేశాలు పర్యటించాను. పరవశించే ప్రకృతి కంటపడితే దాన్ని ఎలాగైనా కెమెరాలో బంధించాలనుకునే వాణ్ని. అదే ఆతృతతో మూడుసార్లు ప్రమాదం అంచుల వరకూ వెళ్లి బయటపడ్డా. అప్పుడు భయం వేసినా.. ఔట్‌పుట్ చూసిన తర్వాత ఆనందం వేసేది.
స్విట్జర్లాండ్ అందాలు సూపర్
స్విట్జర్లాండ్‌లోని వైవిధ్యమైన ల్యాండ్‌స్కేప్ దృశ్యాలను చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. అక్కడి కొండలు, కోనలు, నదులు, సరస్సులు ప్రతి దృశ్యం మనోహరమే. యూరోప్‌లోనే అత్యధికంగా పర్వతాలున్న ఈ ప్రాంతంలో ప్రయాణం కొంత ఇబ్బందే. మూడు రోజుల పాటు అదే ప్రాంతంలో ఉండి ఆ గిరుల సొగసులు క్లిక్‌మనిపించాను.
ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టిన మంచు తుపానును నేనెప్పటికీ మరచిపోలేను. మౌంటెయిన్ రైల్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మంచుతెరలతో ముస్తాబై మేఘాల పల్లకిని ముద్దాడుతున్న ఓ పర్వతం కనిపించింది. వెంటనే క్లిక్‌మనిపించాను. ఈ ఛాయాచిత్రం వన్ ఆఫ్ మై బెస్ట్ ఫొటోగ్రాఫ్స్. ఈ ఫొటోకు నేను నికాన్ డి 300 కెమెరా వాడాను.
మంచి గుర్తింపు..
దేశంలోని ప్రధాన నగరాల్లో పది ఫొటో ఎగ్జిబిషన్ ప్రదర్శనలు నిర్వహించాను. అన్నిటికీ మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ ప్రదర్శనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఓ వృద్ధాశ్రమ ఎన్జీవోకు విరాళంగా అందజేస్తున్నా. నేను తీసిన ఫొటోల్లో కొన్ని ముంబైలోని రాజ్‌భవన్‌లో, ఢిల్లీలోని సిటీ బ్యాంక్ కార్యాలయాల్లోని సిటీగోల్డ్ లాంజ్‌లలో, బజాజ్ కార్పొరేట్ కార్యాలయం, టాటా ఆర్కైవ్స్‌లో కొలువుదీరాయి.