‘సెజ్’ పొమ్మంది..
అరుణ్ రాయ్‌చౌదరి.. 25 ఏళ్లు ఫొటో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఆయనది. కెమెరా క్లిక్‌మంటే ఫొటో అయిపోతుంది. కానీ, ఒక్క ఛాయాచిత్రంతో దాని వెనుకున్న కథను చెప్పగలిగితేనే అది ఫొటో జర్నలిజం అవుతుందంటున్న అరుణ్ రాయ్‌చౌదరితో ఈ వారం లెన్స్ అండ్ లైఫ్.
ఫొటో జర్నలిజం అంటే ఒక స్టిల్ కాదు. మనం నేరుగా చూడలేని అంశాలను కళ్లకు కట్టేది. సబ్జెక్ట్‌లోకి తొంగి చూడగలగాలి. అలాంటిదే పశ్చిమబెంగాల్‌లోని నందిగ్రామ్‌లో నేను తీసిన ఫొటో. స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) వివాదం ఆ ఊరిని కల్లోలం చేసింది. ప్రాణభయంతో ఆ గ్రామస్తులను పరుగులు తీసేలా చేసింది. పోలీసులకు, అల్లరి మూకలకు చెలరేగిన ఘర్షణలు అమాయక జనాన్ని కట్టుబట్టలతో ఊరి పొలిమేరల వరకూ తరిమింది. ఆ సమయంలో తీసిన ఫొటో అక్కడున్న పరిస్థితిని కళ్లకు కట్టింది. ఈ ఫొటో తీసిన ముందు రోజు అదే గ్రామంలో జరిగిన ఘర్షణల్లో 14 మంది అమాయక రైతులు ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పుడు చోటు లేదు...
ఒక ఫొటో మాట్లాడుతుంది. అలాంటి చిత్రం చూసిన తర్వాత మాట్లాడటం ఆపేసి... ఆలోచించటం మొదలుపెడతాం. ఈ రోజుల్లో అలాంటి చిత్రాలకు దినపత్రికల్లో చోటు లేదు. మొబైల్స్, డిజిటల్ కెమెరాల్లో రోజుకు ఎన్నో వేల ఫొటోలు క్లిక్‌మంటున్నాయి. అవన్ని ఫొటో జర్నలిజం కాలేవు. అసలు ఫొటో జర్నలిజం అనేది ఈ రోజుల్లో లేదనే చెప్పాలి. ఇప్పుడు న్యూస్ పేపర్లలో వస్తున్నది కేవలం పేజ్ ఫిల్లింగ్ కోసం తీసిన ఫొటోలు మాత్రమే. న్యూస్‌ను క్యారీ చేసేవి, వివరించే చిత్రాలకు చోటెక్కడుంది. దీనికి ప్రకటనలు, ఆలోచన ధోరణిలో మార్పు ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఫొటో జర్నలిజం కంట్రిబూషన్స్
ఈ రోజు హైదరాబాదులో చోటు చేసుకున్న మార్పులకు ఫోటో జర్నలిస్టుల కాంట్రిబూషన్ ఎంతైనా ఉంది. ఆ రోజుల్లో జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి దుర్గం చెరువు వెళ్లడానికి ఒక పిల్ల రోడ్డు ఉండేది. వర్షంలో, బురదలో సైకిల్ మీద వెళ్లి ఫొటోలు తీసిన సందర్భాలు నా అనుభవంలో ఉన్నాయి. అప్పట్లో న్యూస్ పేపర్స్‌లలో ఫొటో ఫీచర్స్ ఉండేవి. వాటి కోసం ఇలాంటి ఎన్నో ఫొటో ఫీచర్స్ చేసిన ఫొటోగ్రాఫర్లను, వారి కంట్రిబూషన్స్‌ని మరచిపోయారు. ఈ రోజుల్లో అలాంటి ఫీచర్స్ కూడా రన్ చెయ్యట్లేదు ఎవరూ. ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం కావడమే ఇందుకు కారణం.
ప్రజెంటర్: ఓ మధు