Lewis Hamilton
-
అబుదాబి గ్రాండ్‌ప్రి... వెర్‌స్టాపెన్‌దే పోల్ పొజిషన్
ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్ ఎవరిదో తేల్చే అబుదాబి గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్ చివరి రౌండ్లో వెర్స్టాపెన్ ల్యాప్‌ను అందరికంటే వేగంగా ఒక నిమిషం 22.109 సెకన్లలో పూర్తి చేసి పోల్పొజిషన్ను అందుకున్నాడు. చాంపియన్‌షిప్ కోసం పోటీ పడుతున్న హామిల్టన్ (మెర్సిడెస్) క్వాలిఫయింగ్ సెషన్లో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ ప్రస్తుతం 369.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. నేటి రేసులో ఈ ఇద్దరిలో ఎక్కువ పాయింట్లు నెగ్గిన వారికి టైటిల్ లభిస్తుంది. నేటి సాయంత్రం గం. 6:30 నుంచి జరిగే ప్రధాన రేసును స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2, హాట్స్టార్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. -
ఫార్ములావన్ సీజన్లో హామిల్టన్ హవా
దోహా: క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ పునరావృతం చేసిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఏడో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఖతర్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ గంటా 24 నిమిషాల 28.471 సెకన్లలో అందరికంటే ముందుగా గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ రెండో స్థానాన్ని పొందగా... అలోన్సో (అల్పైన్) మూడో స్థానంలో నిలిచాడు. మరో రెండు రేసులు మిగిలి ఉన్న ఈ సీజన్లో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో వెర్స్టాపెన్ 351.5 పాయింట్లతో తొలి స్థానంలో, హామిల్టన్ 343.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తదుపరి రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి డిసెంబర్ 5న జరగనుంది. చదవండి: కోహ్లీ కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యల కేసు.. నిందితుడికి బెయిల్ -
హమిల్టన్ రికార్డు
బుడాపెస్ట్: ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ హామిల్టన్ దూసుకుపోతున్నాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ చాంపియన్‌గా నిలిచాడు. 70 ల్యాప్లపాటు జరిగిన ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించి తన కెరీర్లో 86వ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 36 నిమిషాల 12.473 సెకన్లలో రేసును ముగించి విజేత అయ్యాడు. హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను ఎనిమిదో సారి నెగ్గిన హామిల్టన్ (2007, 09, 2012, 13, 16, 18, 19, 2020)... ఈ క్రమంలో ఒకే వేదికపై అత్యధిక రేసులు నెగ్గిన జర్మనీ దిగ్గజ రేసర్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. గతంలో షుమాకర్ ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రిని ఎనిమిదిసార్లు గెలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఆగస్టు 2న జరుగుతుంది. హంగేరి గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 5. ఆల్బోన్ (రెడ్‌బుల్), 6. వెటెల్ (ఫెరారీ), 7. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 8. రికియార్డో (రెనౌ), 9. మాగ్నుసెన్ (హాస్), 10. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్). -
విజేత హామిల్టన్..వ్యూహంతో కొట్టారు
బుడాపెస్ట్ : ఆద్భుతమైన డ్రైవింగ్‌కు జట్టు (మెర్సిడెస్) వ్యూహం తోడవడంతో లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన 70 ల్యాప్‌ల ప్రధాన రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన అతను అందరికంటే ముందుగా గంటా 35 నిమిషాల 3.796 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. కెరీర్లో తొలిసారి పోల్ సాధించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ చివర్లో ఆధిక్యాన్ని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో లెక్లెర్క్ (ఫెరారీ), ఐదో స్థానంలో కార్లో సెయింజ్ (మెక్లారెన్)లు రేస్‌ను ముగించారు. రేస్‌ను రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన మరో మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచాడు. వ్యూహంతో దెబ్బకొట్టారు. వెర్స్టాపెన్ కళాత్మకమైన డ్రైవింగ్ డిఫెన్స్‌ను మెర్సిడెస్ తన వ్యూహంతో ఓడించింది. తొలి 35 ల్యాప్‌ల రేస్‌లో వెర్‌స్టాపెన్‌కు హామిల్టన్ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురవలేదు. అనంతరం దూకుడు పెంచిన హామిల్టన్ ల్యాప్ ల్యాప్‌కు వెర్స్టాపెన్తో ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ వచ్చి అతనిపై ఒత్తిడిని పెంచాడు. అయితే ఈ కుర్ర డ్రైవర్ డిఫెన్స్ డ్రైవింగ్ ముందు 5 సార్లు ఫార్ములావన్ డ్రైవర్ చాంపియన్ అయిన హామిల్టన్ పప్పులు ఉడకలేదు. దీంతో వ్యూహం మార్చిన మెర్సిడెస్ జట్టు హామిల్టన్‌ను 49వ ల్యాప్‌లో రెండో సారి పిట్లోకి పిలిచి కొత్త టైర్లను వేసి పంపింది. సరిగ్గా ఆ వ్యూహం రేస్ 67వ ల్యాప్‌లో ఫలితం చూపింది. అప్పటిదాకా ఆధిక్యంలో ఉన్న వెర్స్టాపెన్ను ఒవర్టేక్ చేసిన హామిల్టన్ రేస్‌ను ముగించాడు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ 250 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. తదుపరి బెల్జియం గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 1న జరుగుతుంది. -
బ్రిటిష్ గ్రాండ్‌ప్రి చాంపియన్ సెబాస్టియన్ వెటెల్
ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచాడు. సిల్వర్‌స్టోన్‌లో ఆదివారం జరిగిన 52 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 27 నిమిషాల 29.784 సెకన్లలో ముగించాడు. ఈ సీజన్లో వెటెల్‌కిది నాలుగో విజయం. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్ ఏడో స్థానంలో, పెరెజ్ 11వ స్థానంలో నిలిచారు. -
వరల్డ్ టైటిల్ దిశగా..
సుజుకా(జపాన్): ఇప్పటికే ఈ సీజన్ ఫార్ములావన్ గ్రాండ్ ప్రిలో అత్యధిక విజయాలతో దూసుకుపోతున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని వరల్డ్ టైటిల్ దిశగా సాగుతున్నాడు. జపాన్ గ్రాండ్ ప్రి ప్రధాన రేసులో రోస్ బర్గ్ విజేతగా నిలవడంతో తన పాయింట్ల సంఖ్యను మరింత పెంచుకున్నాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ఆరంభించిన రోస్ బర్గ్ ఆద్యంతం ఆకట్టుకుంటూ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ 53 ల్యాప్ లను రేసును రోస్ బర్గ్ అందరి కంటే వేగంగా పూర్తి చేయగా, మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే రెడ్ బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ రెండో స్థానంతో మెరిశాడు. ఈ తాజా విజయంతో రోస్ బర్గ్ తన పాయింట్లను మరింత పెంచుకుని హామిల్టన్ ను వెనక్కునెట్టాడు. గత ఐదు రేసుల్లో రోస్ బర్గ్ నాలుగింటిలో విజయం సాధించడం విశేషం. ప్రస్తుతం రోస్ బర్గ్ 313 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, హామిల్టన్ 280 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకూ జరిగిన 17 ఫార్ములా వన్ గ్రాండ్ ప్రి రేసులో రోస్ బర్గ్ తొమ్మిందిటిలో విజయం సాధించగా, హామిల్టన్ ఆరింటిలో గెలిచాడు. ఇంకా నాలుగు రేసులో మిగిలి ఉండటంతో రోస్ బర్గ్ తొలి వరల్డ్ టైటిల్ ను సాధించేందుకు స్వల్ప దూరంలో నిలిచాడు. ఇక మిగిలిన నాలుగు రేసుల్లో ఒకదాంట్లో గెలిచినా రోస్ బర్గ్ ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్‌షిప్ ను కైవసం చేసుకుంటాడు.