LGBT people
-
అమెరికాలో తొలి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టు
డెన్వర్: అగ్రరాజ్యం అమెరికాలో పురుషులు, మహిళలు కాని ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గం పౌరుల హక్కులను గుర్తించే ప్రక్రియలో కీలకమైన అడుగు పడింది. అమెరికా ప్రభుత్వం ‘ఎక్స్’ జెండర్ హోదా కలిగిన తొలి పాస్‌పోర్టు జారీ చేసింది. ఇది చరిత్రాత్మక పరిణామం, పండుగ చేసుకోవాల్సిన సందర్భం అని ఎల్జీబీటీ హక్కుల కార్యకర్త జెస్సికా స్టెర్స్ వ్యాఖ్యానించారు. అయితే, ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును ఎవరికి జారీ చేశారన్న వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. గోప్యతను కాపాడాలన్న సంకల్పంతో పోస్‌పోర్టు దరఖాస్తుదారుల సమాచారాన్ని బహిర్గతం చేయబోమని అధికారులు చెప్పారు. కొలరాడోలో నివసించే డానా జిమ్ అనే వ్యక్తి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టు కోసం 2015 నుంచి అమెరికా ప్రభుత్వంతో పొరాడుతున్నారు. పురుషుడిగా జన్మించి డానా జిమ్ కొంతకాలం అమెరికాలో సైన్యంలో పనిచేశారు. లింగ మార్పిడి చేయించుకొని మహిళగా మారారు. తనలాంటి వారి హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. తొలి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును డానా జిమ్‌కే జారీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బాగా పరిశీలించాకే నిర్ణయం
న్యూఢిల్లీ: భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377కు సంబంధించి చట్టబద్ధమైన ప్రామాణికతను అన్ని రకాలుగా పరిశీలించాకే రద్దుపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. భారత్‌లో స్వలింగ సంపర్కులపై తీవ్ర వివక్షకారణంగా అది వారి మానసిక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపిందని అభిప్రాయపడింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొనే 158 ఏళ్ల నాటి సెక్షన్ 377ను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ధర్మాసనం సెక్షన్ 377 రద్దుపై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తమకే వదిలేసినప్పటికీ రాజ్యాంగపరంగా అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా సెక్షన్ 377ను కొనసాగించాలని, దీనిపై ప్రజాభిప్రాయం సేకరించాలని న్యాయవాదులు చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని దానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనేది చూడాలని అభిప్రాయపడింది. కేంద్రం యూ టర్న్ తీసుకుందనడం సబబు కాదు కేంద్రం ఈ కేసులో ‘యూ టర్న్’ తీసుకుందన్న న్యాయవాదుల ఆరోపణను, వారి వ్యతిరేకతను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అయితే గోప్యతా హక్కుతో పాటు పలు తీర్పులను పరిగణనలోకి తీసుకుని చూస్తే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ‘యూ టర్న్’గా అభివర్ణించడం సబబు కాదని పేర్కొంది. -
బంతి సుప్రీంకోర్టులో..
న్యూఢిల్లీ: వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న నిబంధన రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టే తేల్చాలని కేంద్రం పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 377లోని ఈ ఒక్క అంశంపైనే రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలు, దత్తతలు, హక్కులు తదితరాల జోలికిపోవొద్దని కోరింది. ఇందుకు సంబంధించి కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరమని పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 377ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నుంచి చేపట్టిన సంగతి తెలిసిందే. సెక్షన్ 377 పరిధి దాటి మరేదైనా విషయాన్ని కోర్టు పరిశీలించదలచుకుంటే, దాని ప్రభావం ఇతర చట్టాలపై తప్పక ఉంటుందని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. ‘వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 377పై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు విచక్షణకే వదిలేస్తోంది. సెక్షన్ 377 పరిధి దాటి ఇతర విషయాల్ని కోర్టు పరిశీలించదలచుకున్నా, ఎల్జీబీటీ వర్గాల హక్కులకు సంబంధించి ఏదైనా తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నా, బదులుగా మరో సవివర అఫిడవిట్ దాఖలు చేస్తాం’ అని కేంద్రం తెలిపింది. అదో ఏవగింపు చట్టం.. ఇద్దరు వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కానికి సంబంధించిన చట్టాన్ని మాత్రమే పరిశీలిస్తామని, ఒకవేళ తాము అందులోని శిక్షార్హమైన నిబంధనలను తొలగిస్తే ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గంపై ఉన్న అనర్హత తొలగిపోయి వారు కూడా త్రివిధ దళాల్లో చేరడంతో పాటు ఎన్నికల్లో పోటీచేస్తారని ధర్మాసనం తెలిపింది. ఇదే జరిగితే అలాంటి సంబంధాలను సమాజంలో హీనంగా చూసే రోజులు పోతాయంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న ఇలాంటి చట్టం ‘సామాజిక ఏవగింపు’నకు ఉదాహరణ అని పేర్కొంది. ఇలాంటి వాటిని చెల్లవని ప్రకటించడం సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు, ఎల్జీబీటీ వర్గీయులు గౌరవంగా జీవించేందుకు సాయపడుతుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో స్వలింగ సంపర్కుల ఉపాధికి ఈ చట్టంలోని శిక్షార్హమైన నిబంధనలు తీవ్ర విఘాతంగా మారాయని తెలిపింది. అయినా, స్వలింగ సంపర్కం నేరమా? కాదా? అన్నదానిపైనే విచారణ జరుపుతామని, ఎల్జీబీటీ హక్కుల అంశం తమ ముందుకు రాలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 377ను సవాలు చేస్తూనే ఎక్కువ పిటిషన్లు దాఖలయ్యాయని కేంద్రం తెలపింది. ఆ పరిధిని దాటి విచారణ కోర్టు జరపాలనుకుంటే చట్టబద్ధ దేశ ప్రయోజనాలను ఉటంకిస్తూ కౌంటర్ అఫిడవిట్ వేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. కేంద్రానికి కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేసే అవకాశం ఇవ్వకుండా, సెక్షన్ 377 కాకుండా ఇతర విషయాలపై విచారణ జరిపి, తీర్పు వెలువరించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. వివాదం లేకుంటే విచారణ వద్దు.. కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ..వివాదంలో లేని వ్యవహారాలపై విచారణ అక్కర్లేదని అన్నారు. తొలిరోజు విచారణ సందర్భంగా..‘జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రాథమిక హక్కు’ అన్న జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అందుకు జస్టిస్ చంద్రచూడ్ బదులిస్తూ సంక్లిష్ట విషయాల్లో తాము జోక్యం చేసుకోమని, ఇద్దరు వయోజనుల మధ్య సంబంధం ఆర్టికల్ 21కి సంబంధించిందా? కాదా? అనే విషయంపైనే దృష్టిపెడుతున్నామని స్పష్టతనిచ్చారు. -
'గే' మ్యాగజైన్ కవర్ పేజీపై యువరాజు
లండన్: బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా 'గే' (స్వలింగ సంపర్కులు) మ్యాగజైన్ కవర్ పేజీపై యువరాజు ఫొటో దర్శనమివ్వనుంది. ఎల్జీబీటీ ప్రజలను వివక్షకు గురిచేయరాదని పేర్కొంటూ వారికి మద్ధతుగా నిలిచేందుకు ప్రిన్స్ విలియం ఈ నిర్ణయం తీసుకున్నారని మ్యాగజైన్ యాజమాన్యం వివరించింది. ఇటీవల అమెరికాలోని ఆర్లెండో ‘గే’ క్లబ్లో ఉన్మాది ఒమర్ మతీన్కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 50 మందికి పైగా మృతిచెందగా, మరో 53 మందికి గాయాలయ్యాయి. సెక్సువాలిటీ విషయంలో ఏ వ్యక్తిని తక్కువగా చేసి చూడరాదని మ్యాగజైన్ ఎడిటర్ మాథ్యూ అన్నారు. ఎల్జీబీటీ వ్యక్తులను కెన్సింగ్గటన్ ప్యాలెస్ లోకి ఆహ్వానించి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఏ వ్యక్తి కూడా ఉద్దేశపూర్వకంగా సెక్సువాలిటీని నిర్ణయించుకోరని, ఈ విషయంలో ఎవరినీ తప్పు చేసిన వారిగా చూడవద్దని ప్రిన్స్ విలియం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్జీబీటీ వ్యక్తులకు మద్ధుతు తెలిపేందుకు తాను గే మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించబోతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్స్ విలియం ఫోజివ్వగా ఫొటోగ్రాఫర్ లీగ్ కీలీ కెమెరా క్లిక్ మనిపించారు. అన్ని వర్గాల వ్యక్తులను తాను కలిశానని, ప్రతి ఒక్కరూ ఎంతో ధైర్యంగా తమ పనిలో ముందుకెళ్లాలని ధృడ సంకల్పంతో ఉన్నారని విలియం అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తులను సమాజంలో గౌరవం ఇవ్వాలని, వారి అశావహ ధృక్పథాన్ని అందరూ గ్రహించాలని పేర్కొన్నారు.