'గే' మ్యాగజైన్ కవర్ పేజీపై యువరాజు
లండన్: బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా 'గే' (స్వలింగ సంపర్కులు) మ్యాగజైన్ కవర్ పేజీపై యువరాజు ఫొటో దర్శనమివ్వనుంది. ఎల్జీబీటీ ప్రజలను వివక్షకు గురిచేయరాదని పేర్కొంటూ వారికి మద్ధతుగా నిలిచేందుకు ప్రిన్స్ విలియం ఈ నిర్ణయం తీసుకున్నారని మ్యాగజైన్ యాజమాన్యం వివరించింది. ఇటీవల అమెరికాలోని ఆర్లెండో ‘గే’ క్లబ్‌లో ఉన్మాది ఒమర్ మతీన్‌కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 50 మందికి పైగా మృతిచెందగా, మరో 53 మందికి గాయాలయ్యాయి.
సెక్సువాలిటీ విషయంలో ఏ వ్యక్తిని తక్కువగా చేసి చూడరాదని మ్యాగజైన్ ఎడిటర్ మాథ్యూ అన్నారు. ఎల్జీబీటీ వ్యక్తులను కెన్సింగ్గటన్ ప్యాలెస్ లోకి ఆహ్వానించి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఏ వ్యక్తి కూడా ఉద్దేశపూర్వకంగా సెక్సువాలిటీని నిర్ణయించుకోరని, ఈ విషయంలో ఎవరినీ తప్పు చేసిన వారిగా చూడవద్దని ప్రిన్స్ విలియం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్జీబీటీ వ్యక్తులకు మద్ధుతు తెలిపేందుకు తాను గే మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించబోతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్స్ విలియం ఫోజివ్వగా ఫొటోగ్రాఫర్ లీగ్ కీలీ కెమెరా క్లిక్ మనిపించారు. అన్ని వర్గాల వ్యక్తులను తాను కలిశానని, ప్రతి ఒక్కరూ ఎంతో ధైర్యంగా తమ పనిలో ముందుకెళ్లాలని ధృడ సంకల్పంతో ఉన్నారని విలియం అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తులను సమాజంలో గౌరవం ఇవ్వాలని, వారి అశావహ ధృక్పథాన్ని అందరూ గ్రహించాలని పేర్కొన్నారు.