liberty hospital
-
విజయవాడ లిబర్టీ ఆసుపత్రిలో కోవిడ్ వైద్యం రద్దు
సాక్షి, విజయవాడ : కరోనా వైద్యం పేరుతో పలు ఆసుపత్రులు లక్షల రూపాయలు వసూలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నా ప్రైవేటు ఆసుపత్రుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా లక్షల్లో ఫీజు వసూలు తన భర్త ప్రాణాలు పోగొట్టారని విజయవాడ లిబర్టీ ఆసుపత్రి యాజమాన్యంపై మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. విజయవాడకు చెందిన లిబర్టీ ఆసుపత్రిలో కోవిడ్ వైద్యం రద్దు చేస్తున్నట్లు తెలిపారు.(చదవండి : పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్) రాజమండ్రికి చెందిన మహిళ ఫిర్యాదుతో విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. లిబర్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధిక ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కమిటీ అందించిన నివేదికతో ఆటోనగర్‌లో ఉన్న లిబర్టీ ఆసుపత్రిలో కరోనా వైద్యం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను వేరే చోటికి తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
చికిత్స కోసం రూ.15 లక్షలు కట్టించుకున్నారు
సాక్షి, అమరావతి బ్యూరో: మెరుగైన వైద్యం పేరిట మోసం చేసిన విజయవాడలోని లిబర్టీ ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజమండ్రికి చెందిన సరళ అనే బాధితురాలు శనివారం నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. తన భర్త వైద్య చికిత్సల కోసం మొత్తం రూ.15 లక్షలు కట్టించుకున్నారని, చివరికి ఆక్సిజన్ మిషన్ పనిచేయకపోవడం వల్లే మరణించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ► మాది రాజమండ్రి. నా భర్త ఆర్. శ్రీనివాసరావుకు జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రిలో ఈ నెల 10వ తేదీన చూపించాం. ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం అదే రోజు లిబర్టీ ఆస్పత్రిలో చేర్పించాం. ► అక్కడ నా భర్తను డాక్టర్ వై.రవిప్రసాద్ పరీక్షించి, భయపడాల్సిందేమీ లేదని, వైద్యానికి రూ.6 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. సంపూర్ణంగా కోలుకుంటున్నారని చెబుతూనే మొత్తం రూ.15 లక్షలు కట్టించుకున్నారు. ► ఈ నెల 21వ తేదీ రాత్రి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న సమయంలో ఎవరూ పట్టించుకోవడంలేదని నా భర్త చెప్పారు. దీంతో ఆయన దగ్గరే ఉంటానని నేను కరాఖండిగా చెప్పడంతో వైద్యులు అందుకు ఒప్పుకున్నారు. ► మరుసటి రోజు రాత్రి 12 గంటల తరువాత ఒక్కసారిగా మళ్లీ ఆక్సిజన్ సరఫరాలో తేడా రావడంతో నా భర్త ఇబ్బంది పడ్డారు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుండటాన్ని గమనించి డాక్టర్‌ను పిలవాలని నర్సును కోరగా.. ఆయన వస్తున్నారంటూ కాలం వెళ్లదీశారు. తీరా మూడు గంటల తర్వాత డాక్టర్ వచ్చి నా భర్త చనిపోయారని తెలిపారు. ► కరోనా బాధితులకు చికిత్స అందించే ఈ ఆస్పత్రిలో సీటీస్కాన్, ఎక్స్‌రే వంటి మిషన్లు కూడా లేవు. ► సరైన వైద్యం అందించకుండా పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు చేసిన లిబర్టీ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. లిబర్టీ హాస్పిటల్‌పై విచారణకు కలెక్టర్ ఆదేశం ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపేందుకు కలెక్టర్ ఇంతియాజ్ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఆదేశించారు. జిల్లా ఆస్పత్రి కో–ఆర్డినేటర్ డాక్టర్ జ్యోతిర్మణి, జిల్లా ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ డాక్టర్ సంతోష్, విజయవాడ తూర్పు తహశీల్ధారు లలితాంజలిలను విచారణ కమిటీ సభ్యులుగా నియమించారు. మృతుడి భార్య నుంచి విచారణ కమిటీ సభ్యులు మంగళవారం వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు తెలిసింది. -
విజయవాడ లిబర్టీ ఆసుపత్రి వద్ద ఆందోళన
విజయవాడ: విజయవాడ ఆటోనగర్‌లోని లిబర్టీ ఆసుపత్రి వద్ద రోగి బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు.. నగరంలోని చెక్‌పోస్ట్ సెంటర్‌కు చెందిన భార్యాభర్తల మధ్య నిన్న గొడవ జరిగింది. ఈ ఘటనలో భర్త చేయి చేసుకోవడంతో భార్య మహ్మద్ శమ్మా తలకు గాయమైంది. చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న లిబర్టీలో ఆసుపత్రిలో చేరగా..అక్కడ న్యూరో సర్జన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్థించాడు. ఈ రోజు ఉదయం కూడా అలాగే మాట్లాడటంతో ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు, ముస్లిం సంఘాల నాయకులు లిబర్టీ ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. న్యూరోసర్జన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు న్యూరోసర్జన్తో శమ్మాకు క్షమాపణ చెప్పించినా ఆందోళన ఆగలేదు. అక్కడున్న వారందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.