లిబియా హోటల్‌పై ఉగ్రపంజా
ట్రిపోలీ: లిబియా రాజధాని ట్రిపోలీలో విదేశీయులు ఎక్కువగా బస చేసే కోరింథియా హోటల్‌పై మంగళవారం ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఐదుగురు విదేశీయులు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు సహా 9 మంది మృతిచెందారు. తొలుత హోటల్లోకి చొరబడిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు ముగ్గురు గార్డులతోపాటు ఐదుగురు విదేశీయులను కాల్చి చంపారు. అనంతరం ఒకరిని బందీగా పట్టుకున్నారు. 24వ అంతస్తులోని ముష్కరులను భద్రత బలగాలు చుట్టుముట్టగా వారు తమను తాము పేల్చేసుకున్నారు. పేలుడుతో బందీ కూడా మృతి చెందారు. మృతిచెందిన విదేశీయుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ హోటల్లోని 24వ అంతస్తును కొంతకాలంగా లిబియాలోని ఖతర్ ఎంబసీ వాడుకుంటోంది. దాడి సమయంలో ఎంబసీ ఉద్యోగులెవరూ లేరని అధికారులు తెలిపారు. దాడి మొదట్లో హోటల్లో బసచేసిన వారు పారిపోతుండగా హోటల్ ఆవరణలో కారు బాంబు పేలింది. తనను తాను లిబియా ప్రధానిగా ప్రకటించుకున్న ఒమర్ అల్ హసీ దాడి సమయంలో ఈ హోటల్లోనే ఉన్నారు. ఆయనను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎస్ విభాగం ప్రకటించుకుంది.