మద్యరహితమైనప్పుడే బంగారు తెలంగాణ
మల్లు స్వరాజ్యం వ్యాఖ్య
ఐద్వా ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రం మద్యరహితమై, మహిళలపై దాడులు జరగకుండా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం ప్రగతినగర్లో సోమవారం ఐద్వా ఆధ్వర్యంలో మద్యం నియంత్రణకు చేపట్టిన బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగినసమావేశంలో మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉత్తమ గ్రామంగా ఉన్న గంగదేవర పల్లికి వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తాను అమలు చేయనున్న కొత్త ఎక్సైజ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలు మద్యానికి బానిసలై తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకుంటుంటే చీప్ లిక్కర్ విధానాన్ని తీసుకువచ్చి పేదలను మరింత పేదరికంలో మగ్గే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.మద్యం నియంత్రణకు ఐద్వా ఆధ్వర్యంలో పోరుచేసేందుకే బస్సుయాత్రను ఎంచుకున్నామని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు.
మద్యం పేరిట జరుగుతున్న రాక్షస దోపిడీ నుంచి ప్రజలను కాపాడేందుకు ఉద్యమానికి అండగా నిలవాలని స్వరాజ్యం పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్తో సహా మంత్రులంతా ప్రగతినగర్ గ్రామాన్ని సందర్శించి మద్యం లేకుంటే అభివృద్ధి ఎలాగుంటుందో పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పోరాట యోధురాలు, జాతీయ అవార్డు గ్రహీత శాంతా సిన్హా, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.ఎన్ ఆశాలత, ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు కె.జ్యోతి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి హైమావతి తదితరులు పాల్గొన్నారు.