నటి కేసు: 'లై డిటెక్టర్ టెస్ట్ వద్దు'
కొచ్చి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు సునిల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ తమను తప్పుదోవ పట్టిస్తున్నాడని కేరళ పోలీసులు అంటున్నారు. శనివారం పల్సర్ సునీని అలువా కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లై డిటెక్టర్ టెస్ట్ (నిజ నిర్ధారణ పరీక్ష) చేస్తేనే కేసు విచారణ త్వరగా పూర్తవుతుందని, లేనిపక్షంలో నిందితుడు సునీ పొంతన లేని విషయాలు చెబుతున్నాడని పోలీసులు అలువా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కు విన్నవించారు. లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించ వద్దని, అందుకు తాను సిద్ధంగా లేనని కోర్టులో పల్సర్ సునీ చెప్పాడు.
కేరళ నటి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వీపీ విగీష్, పల్సర్ సునీలకు పోలీస్ కస్టడీని మార్చి 10 వరకు కోర్టు పొడిగించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధం ఉన్న కొందరిని అదుపులోకి విచారిస్తున్న పోలీసులకు ఆధారాలు సంపాదించడం సమస్యగా మారింది. నిందితుడు పల్సర్ సునీ నటిని కిడ్నాప్ చేసి కారులో తిప్పుడూ మరికొందరితో కలిసి తన స్మార్ట్ ఫోన్లో ఆమెను అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీశాడు. అయితే ఫోన్ వివరాలు మాత్రం వెల్లడించడక పోవడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు.
ఈ నెల 17న సినిమా షూటింగ్ నుంచి ఇంటికి బయలుదేరిన నటిని కొచ్చిలో కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. నటిని దాదాపు 2 గంటలు కారులో బంధీగా తిప్పుతూ లైంగికంగా వేధిస్తూ ఫొటోలు, వీడియోలు తీశారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని కేరళ సీఎం పినరయి విజయన్ పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి 23న పల్సర్ సునీ, విగ్నేష్ లతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.