కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు
♦ ముస్లింలపై ఉగ్రవాదులుగా బీజేపీ ముద్ర వేస్తోంది
♦ కాంగ్రెస్‌తోనే మజ్లిస్ ఎదిగింది
♦ మజ్లిస్‌లో ఎక్కువ శాతం నేరస్తులే
♦ గ్రేటర్ ప్రచారంలో దిగ్విజయ్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ కల్లబొల్లి మాటలతో, అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ దుయ్యబట్టారు. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు. కేబినెట్లో ఒక్క మహిళకూ స్థానం కల్పించలేదని, ముస్లిం లకు 12% రిజర్వేషన్లను కూడా కేసీఆర్ పక్కనపెట్టేశారని ధ్వజమెత్తారు.
తెలంగాణను తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలసి శుక్రవారం వివిధ ప్రాంతాల్లో రోడ్‌షోల్లో పాల్గొన్నారు. సైనిక్‌పురి, జమ్మిగడ్డ, మాణికేశ్వరినగర్, పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, శంషీర్‌గంజ్, శాలిబండ, చార్మినార్, ఖిల్వత్, చౌమహల్లా ప్యాలెస్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో దిగ్విజయ్ మాట్లాడారు. పాతబస్తీలో జరిగిన సభల్లో ఆయన మజ్లిస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌తోనే ఎంఐఎం ఎదిగిందని, ఇప్పుడు ఆ పార్టీలో అంతా రౌడీలు, గూండాలే ఉన్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి పంచన చేరే అల వాటు మజ్లిస్‌కు ఉందని దెప్పిపొడిచారు. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిపై పదికి పైగా కేసులు ఉన్నాయని ఆరోపించారు. మజ్లిస్ వ్యవహార శైలి పరోక్షంగా బీజేపీని గెలిపించేందుకే దోహ దం చేస్తుందని, రెండూ మతతత్వ పార్టీలేనని అన్నారు. ముస్లింలందరినీ ఉగ్రవాదులుగా ముద్ర వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, సంఘ్‌పరివార్‌లో కూడా సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే విషయాన్ని ఆ పార్టీ విస్మరిస్తోందన్నారు.
దేశంలో కాంగ్రెస్ మాత్రమే నిజమైన లౌకిక పార్టీ అని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలైనా చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినా.. హైదరాబాద్‌లో ఉన్న కేసీఆర్, చంద్రబాబు కనీసం స్పందించలేదన్నారు.
దీన్నిబట్టి విద్యార్థులు, దళితుల పట్ల వారి వైఖరేంటో తెలుస్తోందన్నారు. కేసీఆర్, బాబు, మోదీ ముగ్గురూ ఒక్కటయ్యారని అన్నారు. ఈ సభల్లో పార్టీ జాతీయ నాయకుడు కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీ వినోద్, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, టీపీసీసీ కార్యదర్శి ఫక్రుద్దీన్, మహిళా అధ్యక్షురాలు శారద తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే నగర అభివృద్ధి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెంది విశ్వనగరంగా గుర్తింపు వచ్చిందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. పాతబస్తీ అభివృద్ధికి మజ్లిస్ చేసిందేమీ లేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ కృషితోనే మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయన్నారు. విద్యార్థుల ఉద్యమాలతో బలం పెంచుకున్న టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చాక వారికి ఉద్యోగాలు కల్పించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. ఆంధ్ర సీఎం చంద్రబాబు తెలంగాణలో ఒక మాట ఆంధ్రలో మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.