ఎత్తిపోతలతో భూములు సస్యశ్యామలం
దామరచర్ల : దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల నిర్మాణంతో చివరి భూములు సైతం సస్యశ్యామలమవుతాయని ఎన్ఎస్పీ సీఈ సి.సునీల్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పేర్కొన్నారు. సోమవారం దామరచర్ల మండలం వాచ్యాతండా, ఇర్కిగూడెం, అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం, టెయిల్‌పాండ్‌లో ఎత్తిపోతల నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దామరచర్ల మండలం వాచ్యాతండా వద్ద మూసీనదిపై నిర్మించనున్న ఎత్తిపోతల పథకం ద్వారా వజీరాబాద్ మైనర్ కాల్వలకు నీరు మళ్లించి 5500 ఎకరాలకు నీరందిస్తామన్నారు. ఇర్కిగూడం వద్ద తుంగపాడ్ బంధం, కృష్ణానదులు కలిసే చోట నిర్మించే ఎత్తిపోతల పథకం నుంచి బొత్తలపాలెం చెరువు నింపి 7,500 ఎకరాలకు నీరిస్తామన్నారు.
అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం వద్ద నిర్మించే ఎత్తిపోతల పథకం ద్వారా వీర్లపాలెం పరిసరాలకు చెందిన 4వేల ఎకరాలు, టెయిల్‌పాండ్ వద్ద నిర్మించనున్న ఎత్తిపోతల పథకం ద్వారా ఉల్సాయిపాలెం దున్నపోతులగండి వరకు 12,500 ఎకరాలకు నీరు అందించేందుకు ఈ లిఫ్ట్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులతో కలిసి పథకాల ఏర్పాటు చేసే ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఎస్ఈ నర్సింహ, ఈఈ భాష్యా, ఎంపీపీ కురాకుల మంగమ్మ, సింగిల్ విండో చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మాజీ చైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి, సర్పంచ్ బాలునాయక్, బొమ్మనబోయిన రామారావు, గుండా సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.