రోజా, ఖురాన్... దేవుడి వరాలు
ఇస్లాం వెలుగు
ఉపవాసాల ఉద్దేశాన్ని, పవిత్ర ఖురాన్ అవతరణ లక్ష్యాన్ని అర్థం చేసుకొని, రమజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటేనే పరలోక పరాభవం నుండి తప్పించుకొని దైవ ప్రసన్నతకు పాత్రులం కాగలుగుతాం.
ఇది పవిత్ర రమజాన్ మాసం. దైవ విశ్వాసుల పాలిట వరాల వసంతం. అందుకే దైవ విశ్వాసులంతా ఈ పవిత్రమాసంలో ఉపవాస వ్రతం పాటిస్తారు. ఇది సృష్టికర్త తరఫున మోపబడిన విధి. ఈ విషయాన్ని పవిత్ర ఖురాన్ ఇలా వివరిస్తోంది: ‘‘విశ్వాసులారా! గత ప్రవక్తల అనుయాయులకు ఏ విధంగా ఉపవాసాలు విధించబడ్డాయో, అలాగే ఇప్పుడు మీరు కూడా ఉపవాసాలు ఆచరించాలని నిర్ణయించాము. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.’’ (2-183).
దైవం పట్ల భయభక్తులు ఉన్నప్పుడే మనిషి అన్ని రకాల చెడులనూ, దుర్మార్గాలను విసర్జించి మంచిని స్వీకరిస్తాడు. ప్రతి మనిషీ మరణానంతరం ప్రపంచంలో తాను చేసుకున్న కర్మలకు పరలోకంలో విశ్వ ప్రభువు ముందు సమాధానం చెప్పుకోవలసి ఉన్నందున ఆ ప్రకారమే ప్రతిఫలం అనుభవించవలసి ఉంటుంది. విశ్వాసి మదిలో నిరంతరం మెదిలే ఈ భావనే దైవభీతి. ఇలాంటి భయభక్తులు కలిగిన మనిషి సమస్త చెడులకు, పాపాలకు దూరంగా ఉంటూ సదాచార సంపన్నుడై సదా పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితం గడుపుతాడు. పై వాక్యంలో రమజాన్ ఉపవాసాల అసలు ఉద్దేశం ‘దైవభీతి’ లేక ‘దైవభక్తులు’ అని తెలియజేయబడింది.
అంటే రమజాన్ మాసంలో ఆచరించే ఉపవాసాలు మనిషిలో భయభక్తుల్ని జనింప జేసి, ఆ భావనలను పటిష్టం చేసే శిక్షణ ఇస్తాయన్నమాట. దైవం విశ్వాసులకు రమజాన్ ఉపవాసాలు పాటించాలని ఆజ్ఞాపించిన ఉద్దేశంలో దైవభీతితో పాటు, కృతజ్ఞత తెలియజేసుకోవడం కూడా ఉంది. అంటే, దైవం రమజాన్ మాసంలో మానవుల జీవితాలను సమూలంగా సంస్కరించి వారికి ఇహ పర సౌభాగ్యాలు అనుగ్రహించే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని కూడా అవతరింపజేసినందుకు వారాయనకు కృతజ్ఞతలు సమర్పించుకోవాలి.
‘‘దైవం మీకు రుజుమార్గం చూపినందుకు ఆయన ఔన్నత్యాన్ని కొనియాడడానికి, ఆయనకు కృతజ్ఞులై ఉండేందుకు గాను ఈ సౌలభ్యం ప్రసాదించాడు’’ (2-185).
రమజాన్ ఉపవాసాలు పాటించడం ద్వారానే మనం దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకోగలుగుతాం. ఈ పవిత్ర మాసంలో ఒక విశ్వాసి శక్తి ఉండి కూడా ఉపవాసాలు పాటించడం లేదంటే, అతడు దైవం చేసిన మేలును మరిచిపోయి ఆయనకు కృతఘు్నడై పోయాడని అర్థం. అ కృతఘ్నతా పర్యవసానాన్ని అతడు పరలోకంలో చవిచూడవలసి ఉంటుంది.
కనుక ఉపవాసాల ఉద్దేశాన్ని, పవిత్ర ఖురాన్ అవతరణ లక్ష్యాన్ని అర్థం చేసుకొని, రమజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటేనే పరలోక పరాభవం నుండి తప్పించుకొని దైవ ప్రసన్నతకు పాత్రులం కాగలుగుతాం. అలా కాకుండా మిగతా మాసాలకు లాగానే రమజాన్‌ను కూడా నిర్లక్ష్యంగా గడిపేస్తే అంతకంటే దౌర్భాగ్యం మరేమీ ఉండదు.
దైవం సమస్త మానవాళికీ సన్మార్గ భాగ్యం ప్రసాదించాలని, పరలోకంలో ఉన్నత స్థానాలు అనుగ్రహించాలనీ కోరుకుందాం.
- యం.డి. ఉస్మాన్‌ఖాన్