తోడేళ్లున్నాయ్ జాగ్రత్త
కామ పిశాచుల బారిన పసి పిల్లలు
మానసిక, వ్యక్తిత్వ వికాసంపై తీవ్ర ప్రభావం
కుమిలిపోతున్న తల్లిదండ్రులు
కూతుర్ని గుండెల్లో పెట్టుకుని పెంచాల్సిన తండ్రే కామపిశాచిగా మారిపోయాడు. విజ్ఞాన దీపాలు వెలిగించాల్సిన గురువే లైంగిక పాఠాలు చెప్పాలనుకున్నాడు. పసిపిల్లల దగ్గర్నుంచి పండు ముసలమ్మ వరకూ మానప్రాణాలకు రక్షణ లేకపోతోంది. కామంతో కళ్లు మూసుకుపోతున్న దుర్మార్గుల వికార చేష్టలకు అంతులేకుండా ఉంది. జిల్లావ్యాప్తంగా జనవరి నెలలో ఇలాంటి సంఘటనలు ఆరు జరిగాయి. మద్యం మత్తులో జరుగుతున్న అఘాయిత్యాలు కొన్నయితే... కుటుంబ కలహాలతో కాటేస్తున్న సంఘటనలు మరికొన్ని...
యలమంచిలి, న్యూస్‌లైన్: పసిపిల్లలపై పైశాచిక చేష్టలకు అంతులేకుండా ఉంది. తమ పిల్లలకు జరిగిన అన్యాయానికి కన్నవాళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పిల్లలు ఇంటినుంచి పాఠశాలకు వెళ్లి వచ్చేవరకు తల్లిదండ్రుల్లో ఒకటే ఆందోళన ఉంటోంది. క్షేమంగా ఇంటికి వస్తారో లేదోనన్న ఆవేదన తల్లిదండ్రులను వెంటాడుతోంది. జరుగుతున్న సంఘటనలతో చిన్నారులు విలవిల్లాడుతున్నారు.
కుంగిపోతున్న చిన్నారులు
అభం శుభం తెలియని చిన్నారులు అత్యాచారాలకు గురైనప్పుడు వారి మానసిక పరిస్థితి దిగజారిపోతోంది. ఇలాంటి సంఘటనలు వారి మానసిక, వ్యక్తిత్వ వికాసాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదముందని మానసిక చికిత్స నిపుణులు చెబుతున్నారు.
కుటుంబ కట్టుబాట్లు, సమాజంలో తలెత్తుకు తిరగలేమన్న ఆందోళనతో కొందరు బయట పెట్టేందుకు రాలేకపోతున్నారు. కొద్దిమంది మాత్రం ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
జిల్లాలో జనవరి నెలలో 6 వరకు ఇలాంటి సంఘటన లే జరిగాయి. చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాాలు ఎక్కువగా మద్యపాన ప్రియుల వల్లే జరుగుతుండటం గమనార్హం.
కంటి‘పాప’ల్నే కాటేస్తే...
మద్యం మత్తులో కొందరు వావివరుసలు మరుస్తున్నారు. కన్నబిడ్డల్ని చూసి కామపిశాచులుగా మారిపోతున్నారు.
కుటుంబ కలహాలతో ఏళ్ల తరబడి దూరంగా ఉంటున్న భార్యభ ర్తల వల్ల పిల్లలు నలిగిపోతున్నారు. అలాంటి కుటుంబాల్లో తండ్రులు కుమార్తెలపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి.
రేపటి పౌరుల బంగారు భవితకు బాట వేయాల్సిన కొందరు ఉపాధ్యాయులు కూడా పిల్లలపై పైశాచికంగా వ్యవహరించడం తల్లిదండ్రులను తీవ్రంగా బాధిస్తోంది.
రాంబిల్లి మండలంలో జనవరి 16న కన్నతండ్రే ఆరేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
విశాఖలోని గోపాలపట్నంలో జనవరి 25న కీచక ఉపాధ్యాయుడు 5వతరగతి చదువుతున్న విద్యార్థినిపై అఘాయిత్యానికి ప్రయత్నించి స్థానికులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటనలో స్థానికులు ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించడంతో డీఈవో సస్పెండ్ చేశారు.
జనవరి 26న కశింకోటలో 3వ తరగతి విద్యార్థిపై ఒక యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
2010లో చీడికాడ మండలం, చుక్కపల్లిలో బాలికపై అత్యాచారం కేసులో మెల్లి అప్పలనాయుడు అనే నింది తుడికి చోడవరం కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ.17వేల జరిమానా విధించింది.